ప్రైవేట్‌ ఆసుపత్రులపై రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్‌ 

Telangana To Set Up Task Force To Monitor For Coronavirus Charges In Private Hospitals - Sakshi

ముగ్గురు ఐఏఎస్‌లతో ఏర్పాటు చేసిన సర్కార్‌ 

రాహుల్‌ బొజ్జా, సర్ఫరాజ్‌ అహ్మద్, దివ్య సభ్యులు

సాక్షి, హైదరాబాద్‌: కరోనా చికిత్సలో ప్రైవేట్‌ ఆసుపత్రుల పనిని పర్యవేక్షించడానికి ముగ్గురు ఐఏఎస్‌లతో రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. టాస్క్‌ఫోర్స్‌లో రాహుల్‌ బొజ్జా, సర్ఫరాజ్‌ అహ్మద్, డి.దివ్య ఉన్నారు. ప్రైవేట్‌ ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తుండటంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

బుధవారం మధ్యాహ్నం అసెంబ్లీలోనూ సీఎం కేసీఆర్‌ ఆసుపత్రుల తీరుపై మండిపడ్డారు. ప్రతిపక్షాలు కూడా డిమాండ్‌ చేయడంతో ఆగమేఘాల మీద ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. కరోనా చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రులు అందించే వివిధ సేవలకు వసూలు చేయాల్సిన గరిష్ట రేట్లు పేర్కొంటూ గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయా రేట్లను ఆస్పత్రులు తమ ప్రాంగణంలో ప్రముఖంగా ప్రదర్శించాలని కూడా ఆదేశించింది. ఫీజులపై రోగి బంధువులకు వివరించాలి. కానీ, ఆస్పత్రులు వీటిని పాటించకపోవడంపై వైద్య,ఆరోగ్యశాఖకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంటువ్యాధుల చట్టం కింద తగు చర్యలు తీసుకునేందుకు సర్కారు సన్నద్ధమైంది. ప్రభుత్వం నిర్ధేశించిన గరిష్ట ఫీజులను ఆసుపత్రులు పాటిస్తున్నాయా.. లేదా.. ఈ టాస్క్‌ఫోర్స్‌ పర్యవేక్షిస్తుంది. కరోనా చికిత్స, భద్రతా ప్రొటోకాల్‌లను పరిశీలించి ఎప్పటికప్పుడు తమ నివేదికను ప్రధాన కార్యదర్శికి సమర్పిస్తాయి. అంతేకాదు... ఈ టాస్క్‌ఫోర్స్‌ ఆసుపత్రుల్లో తనిఖీలు కూడా నిర్వహిస్తుంది.

10వేల పడకలకు ఆక్సిజన్‌  : మంత్రి ఈటల
సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్‌ సౌకర్యం కలిగిన 10 వేల బెడ్లను సిద్ధం చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. అసెంబ్లీలో బుధవారం కోవిడ్‌–19పై స్వల్పకాలిక చర్చను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో కరోనా ప్రారంభం నుంచి ఇప్పటివరకు పరిస్థితిని, ప్రభుత్వం తీసుకున్న చర్యలను కూలంకషంగా వివరించారు. 1,259 వెంటిలేటర్లు, 200 హై ఫ్లో నాసల్‌ ఎక్విప్‌ మెంట్లు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిద్ధంగా ఉన్నాయన్నారు. కరోనా నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం 1,224 పడకల సామర్థ్యం కలిగిన, అన్ని రకాల వైద్య పరికరాలతో తెలంగాణ ఇన్సిటిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌)ను కొత్తగా ఏర్పాటు చేసిందని చెప్పారు. అందులో కోవిడ్‌ బాధితులకు చికిత్స అందుతొందన్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్నవారిని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 10.30 లక్షల పీపీఈ కిట్లను, 18.50 లక్షల ఎన్‌–95 మాస్కులు, 24 వేలకుపైగా రెమిడిసివిర్‌ ఇంజక్షన్లను ఆసుపత్రులకు అందించామన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top