
డీపీవోలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలు
ఎస్‌ఈసీ నోటిఫికేషన్ జారీ
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి...రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సన్నాహాలు వేగవంతం చేసింది. ఎన్నికలకు సన్నద్ధం కావడంలో భాగంగా పంచాయతీల్లో ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇందుకు అనుగుణంగా జాబితాలను సిద్ధం చేయాలని జిల్లా పంచాయతీ అధికారులను (డీపీవో) ఆదేశిస్తూ మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణీకుముదిని నోటిఫికేషన్ జారీచేశారు.
2025 జూలై 1న అందుబాటులోకి వచ్చిన అసెంబ్లీ నియోజకవర్గాల ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాలను తు.చ. తప్పకుండా అనుసరిస్తూ వార్డుల విభజన చేస్తూ తామిచ్చిన షెడ్యూల్‌ను అనుసరించాలని స్పష్టం చేశారు. డీపీవోలతో పాటు అదనపు జిల్లా ఎన్నికల అధికారులు, ఎంపీడీవోలు, సహాయ జిల్లా ఎన్నికల అధికారులు, సీఈవోలు, అదనపు జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు (హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలు మినహా), పీఆర్ ఆర్‌డీ డైరెక్టర్, పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శికి దీని ప్రతులను పంపించారు.
ఎస్‌ఈసీ జారీచేసిన షెడ్యూల్...
⇒ గురువారం (ఆగస్ట్ 28న) గ్రామపంచాయతీలు, వార్డుల వారీగా ముసాయిదా ఫొటో ఓటర్ల జాబితాను రూపొందించి గ్రామపంచాయతీలు, మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శించాలి.
⇒ శుక్రవారం (29న) జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీలప్రతినిధులతో జిల్లా ఎన్నికల అధికారుల (జిల్లా కలెక్టర్లు) సమావేశం
⇒ శనివారం (30న) మండల స్థాయిలో సంబంధిత ఎంపీడీవోల ఆధ్వర్యంలో రాజకీయ పారీ్టల ప్రతినిధుల సమావేశం
⇒ గురువారం నుంచి శనివారం దాకా (28 నుంచి 30వ తేదీ వరకు) గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల రీఅరేంజ్‌మెంట్‌కు (వార్డుల వారీగా గ్రామపంచాయతీ ఓటర్ల జాబితా) సంబంధించి అభ్యంతరాల స్వీకరణ
⇒ ఆదివారం (31న) ఈ అభ్యంతరాలపై డీపీవోల ద్వారా పరిష్కారం
⇒ సెప్టెంబర్ 2న గ్రామపంచాయతీల్లో వార్డుల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితాలను డీపీవోల ద్వారా ప్రచురణ.