Telangana Police: లాక్‌డౌన్‌లో పోలీసుల వినూత్న శైలి

Telangana Police Show Humanity During Lockdown - Sakshi

అన్నార్థుల ఆకలి తీరుస్తూ... అంతిమ సంస్కారాలు చేస్తూ... 

గర్భిణులకు అంబులెన్స్‌లు.. అత్యవసర సమయాల్లో రక్తం అందిస్తూ...

లాక్‌డౌన్‌ ఉల్లంఘనదారులపై కఠిన చర్యలు.. వాహనాల సీజ్‌

ఐసోలేషన్‌ సెంటర్లకు తరలించి కౌన్సెలింగ్‌..   

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ అమలులో తెలంగాణ పోలీసులు సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగిస్తున్నారు. సందర్భాన్ని బట్టి కాఠిన్యాన్ని, కరుణను ప్రదర్శిస్తున్నారు. తోక జాడించిన ఉల్లంఘనదారులను అప్పటికప్పుడు ఐసోలేషన్‌కు తరలిస్తూ, మిగిలిన వారిలో మార్పు తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఇచ్చిన మినహాయింపు ఇచ్చినా, చాలామంది లేనిపోని కారణాలు చెబుతూ బయటికి వస్తున్నారు.

ఇప్పటిదాకా రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఉల్లంఘనల కేసులు దాదాపు 5 లక్షలు వరకు ఉంటాయి. అందులో గ్రేటర్‌లోని సైబరాబాద్‌ (58,050), రాచకొండ (56,466), హైదరాబాద్‌ (11,513) కమిషనరేట్లలో నమోదైన కేసులే 30 శాతానికి పైగా ఉండటం గమనార్హం. కరోనా జాగ్రత్తలపై ఎంత చెప్పినా కొందరు యువతలో మార్పు మాత్రం రావడం లేదు. ఇలాంటి వారిలో మార్పు తీసుకొచ్చేందుకు కొన్ని జిల్లాల, కమిషనరేట్ల పోలీసులు వినూత్న చర్యలు చేపడుతున్నారు. 

నేరుగా ఐసోలేషన్‌ కేంద్రానికే.. 
కరీంనగర్, రామగుండం, రాచకొండ కమిషనరేట్లలో పోలీసులు పనీపాటా లేకుండా, ఇంటి నుంచి బయటికి వచ్చిన ఆకతాయిలను డీసీఎం వాహనాల్లో ఏకంగా ఐసోలేషన్‌ సెంటర్లకు తరలిస్తున్నారు. వారు ఏడ్చినా, అరిచి గీపెట్టినా వినడం లేదు. నేరుగా ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలించి అక్కడ వీరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్‌ అయితే అదే ఐసోలేషన్‌ కేంద్రాల్లో ఉండేలా, నెగిటివ్‌ అయితే కౌన్సెలింగ్‌ చేయడం, వాహనం సీజ్‌ చేసి కేసులు పెట్టి విడిచి పెడుతున్నారు. ఈ వీడియోలు ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి. ఈ వీడియోల కారణంగా సాకులు చెబుతూ లాక్‌డౌన్‌ ఉల్లంఘించేవారి సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోందని పోలీసులు అంటున్నారు. కరీంనగర్, సుల్తానాబాద్, మంచిర్యాల, బెల్లంపల్లి తదితర ప్రాంతాల్లో ఇలా డీసీఎం వాహనాలతో పోలీసులు సంచరిస్తున్నారు. 

ఆకలి తీరుస్తూ, అండగా ఉంటూ.. 
లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి పోలీసులు యాచకులు, వికలాంగులు, పేదలు, గర్భవతుల సమస్యలు తీర్చడంలో ముందుంటున్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల పని దొరకని కూలీలను గుర్తించి వారికి స్థానిక నేతలు, ఎన్జీవోలు, యువజన సంఘాల సహాయంతో ఆహారం ఇప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా వనపర్తి జిల్లా మదనాపురం మండల కేంద్రంలో ఓ అనాథ వృద్ధురాలు మరణించింది. అయిన వారు ఎవరూ లేకపోవడం, దానికితోడు కరోనా భయంతో అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఎస్సై తిరుపతి తన సిబ్బందితో కలిసి ఆ వృద్ధురాలికి అంతిమ సంస్కారాలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు.

అలాగే శంషాబాద్‌ పరిసరాల్లో ఆకలితో అలమటిస్తోన్న 12 మంది యాచకులను పోలీసులు దుండిగల్‌లోని ఓ హోంకు తరలించారు. ఆపదలో అత్యవసరంగా రక్తం కావాల్సి వచ్చినా అందజేస్తున్నారు. రాచకొండ కమిషనరేట్‌లో స్వప్న అనే కానిస్టేబుల్‌ రక్తదానం చేసి, కీలక సమయంలో ఓ ప్రాణం కాపాడారు. లాక్‌డౌన్‌ సమయంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా క్షణాల్లో వారికి సాయం చేస్తూ ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకుంటున్నారు.

చదవండి: 
పాకిస్తాన్‌ చెరలో చిక్కుకున్న తెలుగు యువకుడు విడుదల

అన్ని భవిష్యత్తులోనే చేస్తారా?.. తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top