ఆ ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుంది: కేటీఆర్
జహీరాబాద్ గురుకులం విద్యార్థులు 16 మంది ఎంబీబీఎస్ సీట్లు సాధించడంపై హర్షం
మాజీ మంత్రి హరీశ్‌రావుతో కలిసి విద్యార్థులకు సన్మానం
గురుకుల విద్యార్థులు కేసీఆర్ కల నిజం చేశారు: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ధాన్యం ఉత్పత్తిలోనే కాదు.. డాక్టర్లను ఉత్పత్తి చేయడంలోనూ నంబర్ వన్‌గా నిలుస్తుందని నిరూపించిందని, ఆ ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జహీరాబాద్‌లోని తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలో చదివి ఎంబీబీఎస్‌లో సీట్లు పొందిన మైనారిటీ గురుకుల విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆదివారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సన్మానించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, పిల్లలు ప్రయోజకులైనప్పుడు తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారని, ఈ విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించడంలో కేసీఆర్ పాత్ర ఉన్నందుకు తాము ఎంతో సంతోషపడుతున్నామని చెప్పారు. ఒక్క జహీరాబాద్ నుంచి 16 మంది ఎంబీబీఎస్ సీట్లు సాధించారని, ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, సైంటిస్టులు అవుతున్నారని చెప్పారు.
‘ఏ తల్లీతండ్రి అయినా ఆడపిల్లని చదివించడానికి కులమతాలని చూడరు. మంచి వసతులు కల్పిస్తే చదివిస్తారు’అని ఎప్పుడూ కేసీఆర్ అంటూ ఉండేవారని గుర్తుచేసుకున్నారు. అందుకు నిదర్శనంగా రైతు కుమార్తె, జర్నలిస్టు కుమార్తె, ఆటో డ్రైవర్ కుమార్తె ఎంబీబీఎస్ సీట్లు సాధించి ఈరోజు గర్వంగా మనముందు నిలబడ్డారని పేర్కొన్నారు.
ఎంబీబీఎస్ సాధించిన విద్యార్థులంతా మరికొందరు పేద విద్యార్థులకు సాయం చేయాలని సూచించారు. హరీశ్‌రావు మాట్లాడుతూ, కేసీఆర్ గురుకుల పాఠశాలలు పెట్టి మైనార్టీలకు నాణ్యమైన విద్యను అందించారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 203 మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేసింది కేసీఆర్ అని గుర్తుచేశారు.
గురుకులాలు మా జీవితాలను మార్చేశాయి
కేసీఆర్ ప్రవేశపెట్టిన మైనార్టీ గురుకుల పాఠశాలలు తమ జీవితాలను మార్చేశాయని ఎంబీబీఎస్ సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు వారి అభిప్రాయాలు పంచుకున్నారు. ‘మేము ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు మా అబ్బాయిని మైనార్టీ గురుకుల పాఠశాలలో చదివించాం. ఈరోజు మా కుమారుడు డాక్టర్ చదువుతున్నాడు’అని ఎంబీబీఎస్ సీటు సాధించిన ఒబేదు తండ్రి, ఆటోడ్రైవర్ ఇబ్రహీం తన సంతోషాన్ని పంచుకున్నారు.
మరో విద్యార్థిని తాసిల్ కమల్ మాట్లాడుతూ, ‘నీట్‌లో 444 మార్కులు వచ్చాయి. వనపర్తి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ సాధించాను’అని తెలిపారు. రైతు కుమార్తె ఫిర్దోస్ మాట్లాడుతూ.. ‘నేను జహీరాబాద్ మైనార్టీ గురుకులంలో ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు చదివాను. మేం అయిదుగురం అక్కా చెల్లెళ్లము. ఒక తమ్ముడు ఉన్నారు. మా తండ్రి రైతు. తిండికి కూడా చాలా కష్టంగా ఉండేది. అలాంటి మేము ఫీజులు కట్టి స్కూళ్లలో చదవలేకపోయాం.
మైనార్టీ గురుకులాల వల్లే నేను చదవగలిగాను’అని పేర్కొన్నారు. జర్నలిస్ట్ కుమార్తె ప్రియా ఏంజెల్ మాట్లాడుతూ, ‘నేను వనపర్తి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఫ్రీ సీటు సాధించాను. నా తండ్రికి సరైన వేతనం లేనందువల్ల ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండేవాళ్లం. 2016లో జహీరాబాద్ గురుకులంలో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు చదివాను. ఈ గురుకులం మా జీవితాలను మార్చేసింది’అని హర్షం వ్యక్తంచేశారు.


