ప్రెటోల్, పురుగు మందుతో..

Telangana: MPTC Family Members Plead For Justice Over land - Sakshi

న్యాయం చేయాలని ఎంపీటీసీ కుటుంబ సభ్యుల వేడుకోలు

సూర్యాపేట జిల్లాలో ఘటన

చివ్వెంల (సూర్యాపేట): తమ భూమి తమకు ఇప్పించాలని కోరుతూ సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఐలాపురం గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ సభ్యురాలు ధరావతు బుచ్చమ్మ కుటుంబ సభ్యులు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేశారు. వివరాలిలా ఉన్నాయి.. ఐలాపురం గ్రామ ఆవాసం అంగోతు తండాకు చెందిన ధరావతు లచ్చిరాం, బుచ్చమ్మ భార్యాభర్తలు. 2013లో లచ్చిరాం కుమారుడు హరిసింగ్‌ 3 ఎకరాల భూమిని రఫీ అనే వ్యక్తికి విక్రయించాడు.

అలాగే 2016లో తన బాబాయ్‌ కుమారుడు వెంకన్న వద్ద హరిసింగ్‌ 22 గుంటలను కొనుగోలు చేసి డబ్బులు కూడా చెల్లించాడు. అయితే ఆ భూమిని వెంకన్న ఇంతవరకు హరిసింగ్‌ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించలేదని చెపుతున్నారు. ఇటీవల ఆ భూమిని వెంకన్న అదే తండాకు చెందిన మరొకరికి విక్రయించేందుకు సిద్ధమయ్యాడు. దీంతో హరిసింగ్‌ తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి వెంకన్నకు తమకు మధ్య జరిగిన విక్రయ దస్తావేజులు చూపించి సంబంధిత భూమిని వేరే ఎవరికీ రిజిస్ట్రేషన్‌ చేయవద్దని కోరాడు.

అయితే అధికారులు తమ గోడు పట్టించుకోవడం లేదని, దీనికి తోడు గతంలో తాము విక్రయించిన 3 ఎకరాల భూమి తక్కువగా ఉందని, రఫీ పక్కనే ఉన్న తమ భూమిలో సుమారు 20 గుంటల్లో హద్దురాళ్లు పాతి ఆక్రమించాడని హరిసింగ్‌ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం తహసీల్దార్‌ కార్యాలయం ముందు హరిసింగ్‌ భార్య ఆమని పురుగు మందు తాగి, కూతురు శకుంతల పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు.

దీంతో పక్కన ఉన్నవారు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆమని సొమ్మసిల్లిపోవడంతో ఆమెను సూర్యాపేటలోని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇదిలా ఉండగా తాను కొన్న భూమిలో 11 గుంటలు తక్కువ ఉందని, ఈ విషయాన్ని లచ్చిరాం కుటుంబ సభ్యులకు తెలపగా, పెట్రోల్‌ పోసుకుని తనను బెదిరిస్తున్నారని రఫీ మీడియాకు తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top