పిల్లల కేరింత తెలంగాణ తుళ్లింత! | Telangana leads in child birth rate | Sakshi
Sakshi News home page

పిల్లల కేరింత తెలంగాణ తుళ్లింత!

Jul 9 2026 4:50 AM | Updated on Jul 9 2026 4:50 AM

Telangana leads in child birth rate

శిశు జననాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో అగ్రస్థానం 

దేశవ్యాప్త సగటుతో పోలిస్తే రెట్టింపునకు పైగా నమోదు 

పదేళ్లలో దాదాపు 1.60 లక్షల జననాలు 

మొత్తం జననాల్లో మూడు వంతులకు పైగా పట్టణ ప్రాంతాల నుంచే..  

ప్రతి వెయ్యి మంది మగ పిల్లలకు 910 మంది ఆడ శిశువులు మాత్రమే..  

సాక్షి, హైదరాబాద్‌: పిల్లల జననాల రేటులో తెలంగాణ అగ్రగామిగా ఉంది. మిగిలిన దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే భిన్నమైన పరిస్థితి నెలకొని ఉండటం గమనార్హం. వాస్తవానికి దేశవ్యాప్తంగా సైతం గత పదేళ్లలో జననాల నమోదు పెరుగుతుండగా, దక్షిణాదిలో మాత్రం తగ్గుతోంది. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో జననాల సంఖ్య క్షీణిస్తోంది. కానీ ఒక్క తెలంగాణలో మాత్రం భారీ పెరుగుదల నమోదు కావడం విశేషం. 

2015తో పోలిస్తే 2024లో జననాల నమోదులో భారీ పెరుగుదల నమోదైన ఏకైక దక్షిణాది రాష్ట్రంగా తెలంగాణ ప్రత్యేక గుర్తింపు పొందింది. జననాల నమోదు వ్యవస్థ (సివిల్‌ రిజిస్ట్రేషన్ సిస్టమ్‌) ఆధారంగా రూపొందిన భారత్‌ అతిముఖ్యమైన గణాంకాల నివేదిక–2024 (రిపోర్ట్‌ ఆన్‌ వైటల్‌ స్టాటిస్టిక్స్‌ ఆఫ్‌ ఇండియా) పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. 

పదేళ్లలో 25.8 శాతం వృద్ధి 
రాష్ట్రంలో పదేళ్లలో లక్షా 58 వేలకు పైగా జననాల పెరుగుదల నమోదైంది. 2015 లో నమోదైన జననాల సంఖ్య 6,12,489 కాగా, 2024కి అది 7,70,616కు చేరుకుంది. అంటే పదేళ్లలో 25.8% వృద్ధి నమోదైంది. ఇదే కాలంలో కేరళలో జననాల నమోదు 33.2% తగ్గగా, తమిళనాడులో 27.3 శాతం, ఏపీలో 20.1 %, కర్ణాటకలో 5.8 శాతం తగ్గింది. దేశవ్యాప్తంగా 2015లో 2.31 కోట్ల జననాలు నమోదుకాగా, 2024 నాటికి అవి 2.55 కోట్లకు పెరిగాయి. అంటే జాతీయ స్థాయిలో 10.1 శాతం వృద్ధి నమోదైంది. దీనితో పోల్చుకుంటే తెలంగాణ వృద్ధి శాతం రెట్టింపునకు మించి ఉండటం గమనార్హం.  

పెరుగుదల..తగ్గుదల 
జననాల నమోదులో పదేళ్లలో పెరుగుదల/ తరుగుదల చోటు చేసుకోవడం విశేషం. 2015లో 6.12 లక్షలుగా ఉన్న జననాలు 2019 నాటికి 8.41 లక్షల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. అనంతరం కోవిడ్‌ ప్రభావంతో 2020, 2021 సంవత్సరాల్లో చెప్పుకోదగ్గ తగ్గుదల నమోదైంది. ఆ తర్వాత 2022లో మళ్లీ పుంజుకున్నాయి. కానీ మళ్లీ 2023లో కొద్దిగా తగ్గి, 2024లో మళ్లీ 7.71 లక్షలకు చేరుకున్నాయి. 

100 శాతం నమోదు 
తెలంగాణ మరో చెప్పుకోదగ్గ ఘనతను కూడా సాధించింది. 2023, 2024 సంవత్సరాల్లో రాష్ట్రంలో జననాల నమోదు సంపూర్ణంగా 100 శాతం నమోదైంది. అంటే రాష్ట్రంలో పుట్టిన ప్రతి శిశువు అధికారికంగా నమోదైనట్లు సివిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌ నివేదిక చెబుతోంది. ఈ విషయంలో కూ డా మిగిలిన దక్షిణాది రాష్ట్రాల కన్నా తెలంగాణ ముందంజలో ఉంది. తెలంగాణతో పోలిస్తే 97.5% నమోదుతో కర్ణాటక, 94.8%తో తమిళనాడు, 89%తో ఆంధ్రప్రదేశ్‌ ,86.4% నమోదుతో కేరళ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.  

వేగవంతమైన నమోదు 
బిడ్డ పుట్టిన తర్వాత వేగంగా జననాలను నమో దు చేయడంలోనూ తెలంగాణ ముందుంది. తెలంగాణలో పుట్టిన 21 నుంచి 30 రోజుల మధ్య నమోదు చేసిన జననాలు 1,70,936 ఉన్నాయి. అదే ఒక సంవత్సరం దాటిన తర్వాత నమోదు చేసి న జననాలు కేవలం 11,533 మాత్రమే ఉన్నాయి. ఈ విషయంలో ఏపీ అట్టడుగున ఉండడం గమనార్హం. బిడ్డ పుట్టిన ఒక సంవత్సరం తర్వాత 1,12,053 మంది జననాల నమోదుతో ఇతర దక్షిణాది రాష్ట్రాలు అన్నింటికన్నా వెనుకబడింది. ఈ విషయంలో కేరళ అన్నింటికన్నా ముందుంది. మన రాష్ట్రంలో మొత్తం జననాల్లో మూడు వంతులకు పైగా పట్టణ ప్రాంతాల నుంచే ఉన్నాయి. పట్టణ ప్రాంతాల నుంచి 5,75,753, గ్రామీణ ప్రాంతాల నుంచి 1,94,863 జననాలు నమోదయ్యాయి  

తగ్గిపోతున్న ఆడపిల్లల జననాలు.. 
అతి ముఖ్యమైన ఆడ, మగ శిశువుల నిష్పత్తిలో వ్యత్యాసం భారీగా ఉండడం ఆందోళన కలిగించే అంశం. 2024లో రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది మగ శిశువులకు 910 మంది ఆడ శిశువులు మాత్రమే నమోదయ్యారు. 2017లో ఇది 915గా ఉండగా, 2022లో 906కు పడిపోయింది. ఆ తర్వాత కొద్దిగా మెరుగై 2024లో 910కి చేరుకుంది. ఏపీలోనూ 929 మంది ఆడపిల్లలు మాత్రమే నమోదు కావడంతో ఆడపిల్లల నిష్పత్తిలో తెలుగు రాష్ట్రాలు రెండూ చివరి వరుసలోనే నిలిచాయి. ఈ విషయంలో కేరళ 970 మందితో ముందంజలో ఉండగా, 946 మందితో కర్ణాటక, 938 మందితో తమిళనాడు ఆ తర్వాతి స్థానల్లో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement