హైదరాబాద్‌: వాహనచోదకులకు ట్రాఫిక్‌ పోలీసుల షాక్‌.. ఫైన్‌ కట్టకుంటే మళ్లీ ఫైన్‌! వేటికంటే..

Telangana: Hyd Traffic Police Again Impose Challan Who Neglects - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: అనునిత్యం ఉల్లంఘనలకు పాల్పడటం, జారీ అయిన ఈ–చలాన్లు పట్టించుకోకుండా వ్యవహరించడం... ఈ పంథాలో రెచ్చిపోతున్న వాహనచోదకులకు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు షాక్‌ ఇవ్వనున్నారు. మూడు నెలల వ్యవధిలో పదేపదే వైలేషన్స్‌కు పాల్పడి, జరిమానాలు చెల్లించని వారికి భారీగా వడ్డించనున్నారు. కేవలం తీవ్రమైన ఉల్లంఘనలకు మాత్రమే ఈ విధానం అమలుకానుంది. దీనికి సంబంధించి నగర ట్రాఫిక్‌ విభాగం ప్రాథమిక కసరత్తు చేస్తోంది.
 
ప్రస్తుతం హెల్మెట్‌ లేకుండా వాహనాలు నడిపే ద్విచక్ర వాహనచోదకులకు రూ.100 జరిమానా పడుతోంది. ఇలా జారీ అవుతున్న ఈ–చలాన్లను అనేక మంది చెల్లించట్లేదు. ఇకపై ఒకసారి చలాన్‌ జారీ అయిన నాటి నుంచి మూడు నెలల వ్యవధిలో ఆ ఈ–చలాన్‌ చెల్లించకుండా మరో ఉల్లంఘనకు పాల్పడితే అప్పుడు విధించే జరిమానా పెరుగుతుంది. రెండోసారికి రూ.200, మూడోసారికి రూ.600 చొప్పున విధిస్తారు. ఎప్పటి జరిమానాలు అప్పుడు చెల్లించేస్తే మాత్రం రూ.100 చొప్పునే పడుతుంది.  ఇదొక్కటే కాదు..  మరికొన్ని తీవ్రమైన ఉల్లంఘనల విషయంలోనూ ఈ విధానం అమలు చేయనున్నారు.

రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌ చేస్తే ద్వికచ్ర వాహనాలు, ఆటోలకు రూ.200, రూ.600, రూ.800 చొప్పున,
► తేలిక పాటి వాహనాలకు, భారీ వాహనాలకు రూ.1000, రూ.1500, రూ.2 వేల చొప్పున జరిమానా విధిస్తూ ఈ–చలాన్‌ జారీ చేస్తారు.
► అలాగే ఎక్కడపడితే అక్కడ అక్రమంగా పార్కింగ్‌ చేస్తే ద్విచక్ర వాహనాలు, ఆటోలకు రూ.200 (అక్కడ నుంచి ఠాణాకు తరలిస్తే మాత్రం రూ.350), రూ.700, రూ.1000 చొప్పున, తేలికపాటి, భారీ వాహనాలకు రూ.1000, రూ.1200, రూ.1700 చొప్పున విధిస్తారు. 

 ఈ విధానం కోసం ట్రాఫిక్‌ పోలీసులు జరిమానాలు పెంచట్లేదు. మోటారు వాహనాల చట్టంలో (ఎంవీ యాక్ట్‌) ఉన్న కీలక సెక్షన్లు వినియోగిస్తున్నారు. దీని కోసం పెద్ద అధ్యయనమే నిర్వహించారు. అందులో రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్, డేంజరస్‌ డ్రైవింగ్‌ ఇలా వేర్వేరు సెక్షన్లకు వేర్వేరుగా జరిమానాలు ఉన్నాయి. మరోపక్క ఒకసారి జారీ చేసిన చలాన్‌ను నిర్ణీత గడువులోగా చెల్లించకపోతే అది ఉత్తర్వుల ధిక్కరణ కిందికి వస్తుందని, దీనికి రూ.500 జరిమానా విధించవచ్చని ఎంవీ యాక్ట్‌ చెప్తుంది. ఇలాంటి అనేక కీలక సెక్షన్లు ఇప్పటి వరకు వాడలేదు. వాహనచోదకుల్లో క్రమశిక్షణ పెంచడంతో పాటు ట్రాఫిక్‌ జామ్స్, ప్రమాదాలు తగ్గించడానికి ఇకపై వినియోగించాలని నిర్ణయించారు. 

► వితౌట్‌ హెల్మెట్, రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్, అక్రమ పార్కింగ్‌లతో పాటు సిగ్నల్‌ జంపింగ్, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్, ఓవర్‌లోడింగ్‌ తదితర ఉల్లంఘనకూ ఈ విధానం వర్తిస్తుంది. ఏ వైలేషన్‌ వల్లనైతే ప్రాణనష్టం, ఇతరులకు ఇబ్బందులు కలుగుతాయో అలాంటి వాటికి వినియోగిస్తున్నారు. భవిష్యత్తులో ట్రాఫిక్‌ లోక్‌ అదాలత్‌లు ఉండవని, ప్రతి ఒక్కరూ ఈ–చలాన్లు ఎప్పటికప్పుడు చెల్లించాలని ట్రాఫిక్‌ పోలీసులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: దసరా సెలవులు కుదింపుపై క్లారిటీ వచ్చేసింది

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top