సొంత జాగాల్లో ఇళ్ళకు రూ.3 లక్షలు.. దసరా తర్వాత షురూ..

Telangana Housing Scheme Minister Harish Rao - Sakshi

రూ.3 లక్షల పంపిణీకి కార్యాచరణ సిద్ధం

కేంద్రం రైతులకు ఉచిత కరెంట్‌ను వద్దనటం సిగ్గుచేటు: మంత్రి హరీశ్‌

గజ్వేల్‌: సొంత జాగాల్లో ఇళ్లు నిర్మించుకునేవారికి రూ.3లక్షలు పంపిణీ చేసే పథకానికి దసరా తర్వాత శ్రీకారం చుట్టనున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం బెజుగామ, శేర్‌పల్లి గ్రామాల్లో డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను మంగళవారం పంపిణీ చేశారు. ఆ తర్వాత గజ్వేల్‌ పట్టణంలోని మహతి ఆడిటోరియంలో కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్లను అందించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో హరీశ్‌ మాట్లాడుతూ.. కరోనా వల్ల రెండేళ్లుగా రాష్ట్రానికి ఆదాయం తగ్గడం వల్ల సొంత జాగాల్లో ఇళ్ల నిర్మాణ పథకాన్ని ప్రారంభించలేక పోయామన్నారు. దసరా తర్వాత నిధులు ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. సాగు పెట్టుబడి తగ్గించి, రాబడి పెంచుతామని చెప్పిన కేంద్రం డీజిల్, ఎరువుల ధరలను పెంచి రైతుల నడ్డి విరిచిందని విమర్శించారు.

రైతులకు గొప్పగా ఉపయోగపడుతున్న ఉచిత కరెంట్‌ను కూడా వద్దని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమాల్లో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, ఫారుఖ్‌ హుస్సేన్, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
చదవండి: రాష్ట్రంలోకి అడెల్లు, మంగులు దళాలు! కేసీఆర్‌ పర్యటన రూటుమార్పు?

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top