
గ్రూప్–1 మెయిన్స్‌పై తేల్చి చెప్పిన హైకోర్టు
మార్చిలో ఇచ్చిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రద్దు.. తుది మార్కుల జాబితా కూడా..
జవాబు పత్రాలు మాన్యువల్‌గా పునఃమూల్యాంకనం చేయాలి
ఆ మేరకు ఫలితాలు ప్రకటించి పోస్టులు భర్తీ చేయాలి... మూల్యాంకనం సాధ్యం కాకుంటే మళ్లీ మెయిన్స్ పరీక్ష పెట్టండి
ఈ ప్రక్రియంతా 8 నెలల్లో పూర్తవ్వాలి
నోటిఫికేషన్, నిబంధనల మేరకు పరీక్ష జరగలేదు... కమిషన్ చర్యలు మెయిన్స్ పరీక్షల పవిత్రతను దెబ్బతీశాయి
ఒకరి మార్కులు మరొకరికి తెలియకుండా చేయడం పారదర్శకతను దెబ్బతీస్తోందన్న న్యాయమూర్తి
రెండు హాల్ టికెట్ల జారీపై కమిషన్ వివరణ నమ్మశక్యంగా లేదని వెల్లడి
మొత్తం సమస్యను రెండు కేటగిరీలుగా విభజించి, అంశాల వారీగా తీర్పు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల జవాబు పత్రాలను మళ్లీ దిద్దాల్సిందేనని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)కు హైకోర్టు తేల్చిచెప్పింది. మార్చి 10న వెలువరించిన తుది మార్కుల జాబితా, మార్చి 30న ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ జాబితా(జీఆర్‌ఎల్)ను రద్దు చేసింది. గ్రూప్–1 మెయిన్స్‌కు సంబంధించిన అన్ని సమాధాన పత్రాలను మాన్యువల్‌గా తిరిగి మూల్యాంకనం చేసి ఫలితాలను ప్రకటించాలని ఆదేశించింది.
సంజయ్‌సింగ్ అండ్ అదర్స్ వర్సెస్ యూపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అలహాబాద్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు మేరకు మోడరేషన్ పద్ధతిని వర్తింపజేయాలని స్పష్టం చేసింది. ఆ ఫలితాల ఆధారంగా 563 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇది సాధ్యంకాని పక్షంలో గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష రద్దు చేసి ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించిన అందరికీ తిరిగి మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని స్పష్టం చేసింది.
ఈ ప్రక్రియంతా మంగళవారం నాటి ఉత్తర్వుల కాపీ అందిన రోజు నుంచి 8 నెలల్లో పూర్తి చేయాలంటూ కీలక తీర్పు వెలువరించింది. 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించిన గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు, అసమానతలు చోటుచేసుకున్నాయని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ సిద్దిపేట శివనగర్‌కు చెందిన కె.పర్శరాములుతో పాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
వీటిని విచారించిన జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు సుదీర్ఘ వాదనల అనంతరం.. జూలై 7న తుది తీర్పు రిజర్వు చేశారు. తాజాగా మంగళవారం తీర్పు వెలువరించారు. ఈ కేసుకు సంబంధించిన మొత్తం సమస్యను విధానపరమైన, మూల్యాంకన విధానం అనే రెండు కేటగిరీలుగా విభజించవచ్చునని న్యాయమూర్తి తెలిపారు. ఒక్కో కేటగిరీలోని అంశాల వారీగా తీర్పు ఇచ్చారు.
1) విధానపరమైన అంశాలు..
రెండు హాల్ టికెట్ల జారీ: 2024 ఫిబ్రవరి 19న టీజీపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్‌లో రెండు హాల్‌టికెట్ల ప్రస్తావన ఎక్కడా లేదు. కానీ వేర్వేరు హాల్ టికెట్లు జారీ చేయడం అనుమానాలకు తావిస్తోంది. కమిషన్ వివరణ కూడా అస్పష్టంగా ఉంది. యూపీఎస్సీనే ఒక హాల్‌టికెట్ ఇస్తున్నప్పుడు.. ఇక్కడ రెండు ఎందుకనే దానిపై వివరణ నమ్మశక్యంగా లేదు. 2011లో ఇదే విధానం అనుసరించినట్లు కమిషన్ పేర్కొన్నా.. ఆ డాక్యుమెంట్లను సమర్పించలేదు. నోటిఫికేషన్ లేదా నిబంధనల మేరకు పరీక్ష జరగలేదని ఈ కోర్టు అభిప్రాయపడుతోంది.
కేంద్రాల కేటాయింపు: 18, 19 పరీక్షా కేంద్రాల్లో మహిళా అభ్యర్థులకే ప్రాధాన్యత ఎలా ఇచ్చారు. రాండమైజేషన్ విధానమే అయితే ఎక్కువ మంది మహిళా అభ్యర్థులను రెండు కేంద్రాలకే ఎలా కేటాయించారు? మహిళా అభ్యర్థులనే కేటాయించాలని కళాశాల అధికారులు చెప్పినట్లు కమిషన్ పేర్కొన్నా ఆధారాలను సమర్పించలేదు. అసలు అలా కేటాయింపులో ప్రాధాన్యత ఎందుకో కమిషన్ చెప్పలేదు. నోటిఫికేషన్‌లో పేర్కొనలేదు. మరోవైపు శారీరకంగా వికలాంగులైన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వలేదు. నగరానికి దూరంగా 2వ, 3వ అంతస్తుల భవనాలను కేటాయించింది. ఇది కేంద్రాలను కేటాయించడంలో వివక్షను ప్రతిబింబిస్తోంది.
హాజరులో అసమానత:
మెయిన్స్‌కు హాజరైన అభ్యర్థుల సంఖ్యను.. 21,093, 21,085, 21,110, 20,161గా ఇలా ఒక్కోసారి ఒక్కోలా పేర్కొంది. అభ్యర్థుల హాజరు నమోదులో కమిషన్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. రాజ్యాంగ సంస్థ ఇలా చేయడం ప్రశంసించలేం. తుది మార్కుల జాబితా విడుదల సమయంలో 21,085 మందిగా పేర్కొంది. సంఖ్యలో మార్పునకు ఎటువంటి వివరణ లేదు.
బహుళ మూల్యాంకనం:
జవాబు పత్రాల తొలి రెండు మూల్యాంకనాల్లో మార్చి 13 నాటి వెబ్ నోట్ ప్రకారం బార్‌కోడ్, బబ్లింగ్‌లున్నాయి. మూడో మూల్యాంకనంలో ఇవి లేవు. ఏపీలో నిర్వహించినట్లు ఇక్కడా చేశామని కమిషన్ చెప్పినా మూడో మూల్యాంకనం భిన్నంగా ఉండటంతో మార్కులను మార్చే అవకాశం ఉంది. నోటిఫికేషన్‌లో మూడో మూల్యాంకనంపై వివరాలు లేవు. కమిషన్ చర్యలు గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష పవిత్రతను దెబ్బతీశాయి. మూల్యాంకన ప్రక్రియ పిటిషనర్ల వాదనలకు బలాన్ని చేకూర్చింది. వారి వాదన తోసిపుచ్చలేం.
మార్కుల జాబితా ప్రచురణ:
నిబంధనల ప్రకారం అభ్యర్థుల మార్కులను సబ్జెక్టుల వారీగా ప్రచురించాలి. అలా చేయకుండా కమిషన్ వ్యక్తిగత లాగిన్‌లకు సబ్జెక్టుల వారీగా పంపింది. అంటే ఎవరి మార్కులు వారికే కనిపిస్తాయి తప్ప.. ఇతరుల మార్కులు తెలియవు. ఇది సరికాదు. అందరి అభ్యర్థుల మార్కులతో జాబితాను ప్రచురించకపోవడం పారదర్శకతను దెబ్బతీస్తోంది. దీనిపై కమిషన్‌ను ప్రశ్నించే హక్కు అభ్యర్థులకు ఉంది.
అర్హత సాధించని అభ్యర్థుల పేపర్లు మూల్యాంకనం:
ఇంగ్లిష్ పరీక్షలో అర్హత సాధించిన తర్వాతే ఇతర పేపర్లు మూల్యాంకనం చేశామని కమిషన్ చెప్పింది. అయితే జనరల్ ఇంగ్లిష్‌లో అర్హత సాధించని వారి పేపర్లూ మూల్యాంకనం చేసినట్లు 12 మంది పేర్లు పరిశీలిస్తే తెలుస్తోంది. పరీక్ష నిర్వహణలో అసమగ్రతను ఇది స్పష్టం చేస్తోంది. దశాబ్దంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇది అశనిపాతం లాంటిది.
ఖాళీలు పెంచడం:
రెండో నోటిఫికేషన్ ద్వారా ఖాళీల సంఖ్య పెంచారు. మళ్లీ దరఖాస్తులు తీసుకున్నారు. అంతకుముందు దరఖాస్తు చేసుకోని వాళ్లు కూడా కొత్తగా రావడంతో అభ్యర్థుల సంఖ్య పెరిగింది. అయితే దీనిపై ఇప్పటికే ఇదే హైకోర్టు తీర్పునిచ్చింది. అందుకే ఈ అంశంపై విచారణకు నిరాకరించాం.
2) మూల్యాంకన విధానం..
మూల్యాంకనదారుల ఎంపిక:
రెగ్యులర్ అధ్యాపకులు, ఇద్దరు రిటైర్డ్ అధ్యాపక సభ్యులను మెయిన్స్ మూల్యాంకనానికి నియమించినట్లు కమిషన్ పేర్కొంది. వీరి పేర్లను రహస్యంగా ఉంచామని, పిటిషనర్లు బహిర్గతం చేసినందుకు చట్టప్రకారం చర్యలు తీసుకునే హక్కు ఉందని వాదించింది. అలాంటప్పుడు ఆ వివరాలిచ్చిన కమిషన్ ఉద్యోగులపై కూడా చర్యలు తీసుకోవాలి. నోటిఫికేషన్ ప్రకారం రెగ్యులర్ ఉద్యోగులను మాత్రమే తీసుకోవాలన్నది పిటిషర్ల వాదన.
ప్రైవేట్ ట్యూటర్‌గా పనిచేసిన డాక్టర్ ఎం.ఎ.మాలిక్‌ను కూడా తీసుకున్నారని వారు తెలిపారు. ఇతను 22 ఏళ్లుగా ఆంధ్రజ్యోతి సహా ఇతర పత్రికలకు పోటీ పరీక్షల కథనాలను అందిస్తున్నానని పేర్కొన్నారు. దీనిని అంగీకరించని కమిషన్ పిటిషనర్లపై కేసులు నమోదు చేస్తామని బెదిరించింది. అలాగే కమిషన్ రెగ్యులర్ ఫ్యాకల్టీ అనే దానికి అర్థాన్ని మార్చింది.
పత్రాలు దిద్దిన విధానం:
సమాధాన పత్రాల మూల్యాంకనానికి ఏదైనా విధానం ఉందా? కీ ఉందా? అని కమిషన్‌ను ప్రశ్నించాం. ఎటువంటి కీ లేదని, మూల్యాంకనదారులు సబ్జెక్ట్ నిపుణులని పేర్కొంది. తర్వాత కీ ఉందని సీల్డ్ కవర్‌లో సమర్పించింది. కీ విషయంలో కమిషన్ తన వాదనను ఎప్పటికప్పుడు మార్చింది. పరీక్షల నిర్వహణ, మూల్యాంకనాలపై ఏదైనా కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టాలనుకుంటే సర్కార్‌ను సంప్రదించాలి. కానీ అలా జరగలేదని తెలుస్తోంది. కోర్టుకు సమర్పించిన కీలోనూ లోపాలున్నాయి.
‘తెలుగు’ అభ్యర్థుల విషయంలో నిర్లక్ష్యం:
తెలుగు మాధ్యమంలో మెయిన్స్ రాసిన వారి పత్రాలను సరైన పద్ధతిలో మూల్యాంకనం చేయలేదనేది ప్రధాన ఆరోపణ. కాగా భాషల వారీగా ఎంతమంది మూల్యాంకనదారులను నియమించారన్నది స్పష్టత లేదు. టీచర్లంతా ఇంగ్లిష్, తెలుగులో ప్రావీణ్యం కలిగినవారే అని చెప్పడం హాస్యాస్పదం. ఇంగ్లిష్ మీడియంలో 506 మంది (మొత్తం రాసిన వారిలో 89.88 శాతం), తెలుగు మీడియంలో 56 (9.95 శాతం), ఉర్దూలో ఒకరు అర్హత సాధించారు. ఈ గణాంకాలను పరిశీలిస్తే తెలుగు అభ్యర్థులకు అన్యాయం జరిగిందని స్పష్టమవుతోంది.
నిర్దిష్ట కేంద్రాల్లో అత్యధికులు అర్హత సాధించడం:
18, 19 కేంద్రాల నుంచి 35.5 శాతం మహిళలు అర్హత సాధించగా, ఇతర కేంద్రాల నుంచి 5.35 మాత్రమే అర్హత పొందారు. ఇది చాలా వ్యత్యాసాన్ని చూపిస్తోంది. ఆమోదయోగ్యంగా లేదు.
కొందరు అభ్యర్థులకు ఒకే మార్కులు ఇవ్వడం:
మెయిన్స్ రాసిన చాలామంది అభ్యర్థులకు ఒకే విధంగా మార్కులొచ్చాయి. 719 మందికి ఈ విధంగా మార్కులొచ్చాయని కమిషన్ అంగీకరించింది. అయితే పోటీ పరీక్షలో సమాన మార్కులు వచ్చే అవకాశమున్నా.. పక్కపక్క హాల్‌టికెట్ల వ్యక్తులకు అలా రావడం అనుమానాలకు తావిస్తోంది. సమాన మార్కులు వచ్చిన వారి విషయంలోనూ కమిషన్ అనుసరించిన ర్యాంక్‌ల విధానం చట్టవిరుద్ధం.. లోపభూయిష్టం.