
సోమవారం ఏఎస్‌జీ ఆధ్వర్యంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలసిన.. కొత్త జడ్జీలుగా నియామకమైన చలపతిరావు, రామకృష్ణారెడ్డి, మొహియుద్దీన్, గాడి ప్రవీణ్‌కుమార్
సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం
జడ్జీలుగా మొహియుద్దీన్, చలపతిరావు, రామకృష్ణారెడ్డి, ప్రవీణ్‌కుమార్
న్యాయవాదుల కోటా నుంచి నలుగురికి దక్కిన అవకాశం
మొత్తంగా 30కి చేరిన న్యాయమూర్తుల సంఖ్య.. ఇంకా 12 ఖాళీలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గౌస్ మీరా మొహియుద్దీన్, సుద్దాల చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, గాడి ప్రవీణ్‌కుమార్ నియామకానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. సుప్రీంకోర్టు కొలీజియం ఈ నెల 3న వీరి పేర్లను సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. ఈ సిఫార్సులకు ఆమోదం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం సోమవారం గెజిట్ జారీ చేసింది. దీంతో వీరు అదనపు న్యాయమూర్తులుగా త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
కొత్త జడ్జీలుగా నియమితులైన నలుగురు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ నరసింహశర్మతో కలసి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం హైకోర్టులో 26 (సీజేతో కలిపి) మంది న్యాయమూర్తులున్నారు. ఈ నలుగురి ప్రమాణం స్వీకారం తర్వాత ఆ సంఖ్య 30కి చేరనుంది. ఇంకా 12 పోస్టులు ఖాళీగా ఉంటాయి. కాగా, సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన జస్టిస్ అభిషేక్‌రెడ్డి, జస్టిస్ కన్నెగంటి లలిత, జస్టిస్ సుమలత బదిలీపై ఇక్కడికి రావాల్సి ఉంది. ఈ బదిలీలకు కేంద్రం ఇంకా ఆమోదం తెలుపలేదు. అలాగే తడకమళ్ల వినోద్‌కుమార్‌ను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేసిన విషయం తెలిసిందే.

సుద్దాల చలపతిరావు..
చలపతిరావు 1971, జూన్ 25న జనగాంలో జన్మించారు. 1998, మార్చి 26న న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. న్యాయవాది వై.రామారావు వద్ద 1998 నుంచి 2004 వరకు జూనియర్‌గా పనిచేశారు. 2004 నుంచి స్వతంత్ర ప్రాక్టీస్ ప్రారంభించారు. రంగారెడ్డి, సిటీ సివిల్ కోర్టులతోపాటు హైకోర్టులో సివిల్, క్రిమినల్ సహా అన్ని విభాగాల కేసులు వాదించారు. జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ స్టాండింగ్ కౌన్సిల్‌గా 2022 నుంచి విధులు నిర్వహిస్తున్నారు.
వాకిటి రామకృష్ణారెడ్డి
రామకృష్ణారెడ్డి 1970, సెపె్టంబర్ 14న జన్మించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు స్వగ్రామం. వీరిది వ్యవసాయ కుటుంబం. తండ్రి సర్పంచ్‌గా, జెడ్పీటీసీగా సేవలందించారు. తల్లి గృహిణి. బీకామ్ ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసి 1998లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. న్యాయవాది ఎ.అనంతసేన్‌రెడ్డి వద్ద జూనియర్‌గా పనిచేశారు. 2005 నుంచి స్వతంత్ర ప్రాక్టీస్ ప్రారంభించారు. రంగారెడ్డి, సికింద్రాబాద్, సిటీ సివిల్ కోర్టుతోపాటు తెలంగాణ, ఏపీ హైకోర్టుల్లో వాదనలు వినిపించారు. రాజ్యాంగ, సివిల్, క్రిమినల్, రెవెన్యూ, ట్యాక్స్, ఫ్యామిలీ, కంపెనీ లా విభాగాల్లో సమర్థుడిగా పేరు పొందారు. 2016–17లో తొలి తెలంగాణ హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈడీ స్టాండింగ్ కౌన్సిల్ విధులు నిర్వహిస్తున్నారు.
గౌస్ మీరా మొహియుద్దీన్..
గౌస్ 1969, జూలై 15న జన్మించారు. హైదరాబాద్‌లోని బాలానగర్‌కు చెందినవారు. తండ్రి మహమ్మద్ ఇస్మాయిల్ హెచ్‌ఎంటీ మేనేజర్‌గా పనిచేశారు. వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని నెల్లూరు వీఆర్ న్యాయ కళాశాల నుంచి న్యాయ విద్య పూర్తి చేశారు. ఉస్మానియా వర్సిటీలో ఎల్‌ఎల్‌ఎం చదివారు. 1993 మార్చి 17న న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. ఉమ్మడి బార్ కౌన్సిల్, తెలంగాణ బార్ కౌన్సిల్‌కు స్టాండింగ్ కౌన్సిల్‌గా విధులు నిర్వర్తించారు. సివిల్, రాజ్యాంగంతోపాటు పలు విభాగాల్లో సమర్థ వాదనలు వినిపించారు.
గాడి ప్రవీణ్‌కుమార్...
ప్రవీణ్‌కుమార్ 1971, ఆగస్టు 28న జన్మించారు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ స్వస్థలం. కాకతీయ వర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. ఉస్మానియా వర్సిటీలో ఎంఏ, ఎల్‌ఎల్‌ఎం చదివారు. 1998, నవంబర్ 12న న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. హైకోర్టు, అడ్మిని్రస్టేటివ్ ట్రిబ్యునల్స్, లేబర్ కోర్టులో పలు కేసులు వాదించారు. రాజ్యాంగం, సర్విస్ మ్యాటర్, లేబర్ లా, క్రిమినల్ లా.. వంటి పలు విభాగాల్లో సమర్థుడిగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం హైకోర్టులో డిప్యూటీ సొలిసిటర్ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.