
కంపెనీల చట్టం కింద నమోదుకాని సంస్థకు ప్రభుత్వం నుంచి ఉచిత భూమి పొందే అర్హత లేదు
ఐఏఎంసీకి భూకేటాయింపుపై దాఖలైన పిల్‌లపై హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పు
భూమిని ట్రస్టు విక్రయించుకోవచ్చన్న నిబంధన చట్ట విరుద్ధం
అందువల్ల 3.70 ఎకరాల భూకేటాయింపును రద్దు చేస్తున్నాం.. జీవోను కొట్టేస్తున్నాం
సెంటర్ పనితీరు ఏమాత్రం ఆశాజనకంగా లేదని వ్యాఖ్య
సంస్థకు ప్రభుత్వ ఆర్థిక సాయం, కేసుల సూచన మాత్రం సమర్థనీయమేనని వెల్లడి
భవిష్యత్తులో ఆడిట్ లేకుండా సాయం కొనసాగించొద్దని సర్కార్‌కు సూచన
సాక్షి, హైదరాబాద్: ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)కు 2021లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన భూకేటాయింపును హైకోర్టు శుక్రవారం రద్దు చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్ సర్వే నంబర్83/1లో 3.70 ఎకరాలను కేటాయిస్తూ జారీ చేసిన జీవో 126ను జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ కె.సుజనా ధర్మాసనం కొట్టేస్తూ తీర్పు చెప్పింది. ఐఏఎంసీ ఒప్పందంలో భాగంగా ట్రస్టు బోర్డుకు ఆస్తులను విక్రయించే అధికా రం ఉంటుందంటూ ఒక ముఖ్యమైన నిబంధన క్లాజ్ 6 (డీ)ను చేర్చడాన్ని ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పు బట్టింది.
తెలంగాణ భూ రెవెన్యూ చట్టం 1317 ఫస్లీ, ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన భూమికి మార్కెట్ విలువ చెల్లింపును తప్పనిసరి చేసే ఏపీ ఏలియనేషన్ ఆఫ్ స్టేట్ ల్యాండ్స్ రూల్స్–1975ను ఈ భూ కేటా యింపు ఉల్లంఘించిందని స్పష్టం చేసింది. ఐఏఎంసీ చట్ట బద్ధమైన సంస్థగా కంపెనీల చట్టం కింద నమోదు కాలేదని.. అందువల్ల ఉచిత భూమికి అనర్హమైనదిగా పరిగణించాల్సిందేనని తేల్చిచెప్పింది. గత నాలుగేళ్లలో ఐఏఎంసీ పనితీరు ఆశాజనకంగా లేదంటూ సంస్థ భవి ష్యత్తుపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ ఏడాది జనవరి 29 నాటికి 15 ఆర్బిట్రేషన్ కేసులనే ఐఏఎంసీ నిర్వహించిందని (అందులో 11 అనుకూలంగా)... 57 మధ్యవర్తిత్వ కేసుల్లో 17 మాత్రమే అనుకూలంగా నిర్వహించిందని హైకోర్టు అభిప్రాయ పడింది. అయితే ఐఏఎంసీకి నిర్వహణ ఖర్చుల నిమి త్తం ఏటా రూ. 3 కోట్ల మేర చెల్లింపులకు అనుమ తిస్తూ జారీ చేసిన జీవోలు 76, 365లను మాత్రం ధర్మాసనం సమర్థించింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయంలో భాగంగా ఐఏఎంసీ లాంటి కొత్త సంస్థకు ఆర్థిక సాయం అందించినా.. ఓ ప్రైవేట్ సంస్థకు అది శాశ్వతంగా ఉండ కూడదని హితవు పలికింది. ఐదేళ్ల తర్వాత ఆర్థిక సాయాన్ని కొనసాగించాలా వద్దా? అనే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలని తీర్పులో సూచించింది.
ప్రజాప్రయోజన వ్యాజ్యాలు ఇవీ..
ఐఏఎంసీ ట్రస్టుకు అత్యంత విలువైన ప్రాంతంలో రూ. వందల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కేటా యిస్తూ 2021 డిసెంబర్ 26న రాష్ట్ర ప్రభుత్వం జీవో 126 విడుదల చేసింది. అలాగే నిర్వహణ ఖర్చుల కింద ఏటా రూ. 3 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు జీవోలు 76, 365లను, కేసుల కేటాయింపునకు జీవో 6ను జారీ చేసింది. ఏఐఎంసీని 2021 డిసెంబర్ 18న నాటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. అయితే ఆ జీవోలను కొట్టేసి ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకొనేలా ఆదేశించాలని కోరుతూ న్యాయవాదులు ఎ.వెంకట్రామిరెడ్డి, వ్యక్తిగత హోదాలో కోటి రఘునాథరావు వేర్వేరుగా 2023లో ప్రజాప్రయోజన వ్యాజ్యాల (పిల్)ను దాఖలు చేశారు.
ఓ ప్రైవేట్ ఆర్బిట్రేషన్ సెంటర్‌కు అత్యంత విలువ చేసే భూమిని ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో ప్రభుత్వం వద్ద సమాధానం లేదన్నారు. ఇది తెలంగాణ అర్బన్ ఏరియాస్ (డెవలప్‌మెంట్) చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. అలాగే ఐఏఎంసీకి నిర్వహణ ఖర్చుల కింద ఏటా రూ. 3 కోట్లను ప్రభుత్వం మంజూరు చేయడం ప్రజాధనాన్ని వృథా చేయడమే అవుతుందని.. ప్రభుత్వ నిర్ణయం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు. ఈ పిల్‌లపై జనవరిలో వాదనలు ముగించిన జసిŠట్‌స్ కె.లక్ష్మణ్, కె.సుజన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది.
వాదనలు సాగాయిలా..
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘రూ. 350 కోట్లకుపైగా విలువైన 3.70 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉచితంగా ఐఏఎంసీకి కేటాయించడం రాష్ట్రానికి తీరని నష్టం. ఓ ప్రైవేట్ ట్రస్ట్‌కు నిబంధనలకు విరుద్ధంగా నిధులు కేటాయించడమే కాకుండా నిర్వహణ పేరిట ఏటా రూ. 3 కోట్ల నిధులు కేటాయించడం ప్రజాధనం దుర్వినియోగం చేయడమే. నిబంధనలకు, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ప్రైవేట్‌సంస్థకు భూకేటాయింపు జరిపారు’ అని పేర్కొన్నారు. ఐఏఎంసీ తరఫున సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ప్రజాప్రయోజనాల కోసమే ప్రభుత్వం భూమి, నిధులు ఇచ్చిందన్నారు.
ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదిస్తూ ‘ఐఏఎంసీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తే పలు అంతర్జాతీయ సంస్థల మధ్య వివాదాల పరిష్కారానికి దోహదపడుతుంది. ఇలాంటి వివాదాలు కేవలం న్యాయస్థానాల్లోనే కాకుండా బయట కూడా చేసుకోవచ్చని న్యాయస్థానాలే చెబుతున్నాయి. ఐఏఎంసీతో వివాదాలు పరిష్కారమైతే కోర్టులపైనా భారం తగ్గుతుంది. ఇందులో ప్రజాహితం ఉన్నందునే ప్రభుత్వం భూమి, నిధులు ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంది. ఐఏఎంసీ ట్రస్ట్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయశాఖ మంత్రితోపాటు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు ట్రస్టీలుగా ఉన్నారు. ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో ఒక్క రూపాయీ దుర్వినియోగం కాలేదు’ అని నివేదించారు.
ఐఏఎంసీ తనను తాను నిలబెట్టుకోలేకపోయిందన్న ధర్మాసనం
‘ప్రభుత్వాల నుంచి నిరంతర ఆర్థిక సాయం పొందుతున్నప్పటికీ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ (ఐసీఏడీఆర్) తన లక్ష్యాలను నెరవేర్చడంలో ఎలా విఫలమైందో మేము ఎత్తి చూపాలనుకుంటున్నాం. దేశంలో ప్రత్యామ్నాయ వివాద పరిష్కారాన్ని ప్రోత్సహించడానికి 1995లో కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ద్వారా ఐసీఏడీఆర్ ఒక రిజిస్టర్డ్ సొసైటీగా ఏర్పడింది. దాని ప్రారంభం నుంచి ఐసీఏడీఆర్ 49 మధ్యవర్తిత్వ కేసులనే స్వీకరించిందని ఉన్నతస్థాయి కమిటీ నివేదిక పేర్కొంది.
ఆర్థిక సహాయం ఉన్నా కేసుల పరిష్కారం నామమాత్రంగానే ఉన్నందున ఐసీఏడీఆర్‌ను స్వాధీనం చేసుకోవాలని.. దానికి మంజూరు చేసిన శాశ్వత లీజును రద్దు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. ఐఏఎంసీ అలా మారదని మేము ఆశిస్తున్నాము. అయితే మూడేళ్లుగా ఏటా రూ. 3 కోట్ల ఆర్థిక సాయం, ఉచిత కార్యాలయ స్థలాన్ని అందించినా ఐఏఎంసీ తనను తాను నిలబెట్టుకోలేకపోయింది. ప్రభుత్వం ఆశించిన మేరకు భవిష్యత్తులో ఆర్థికంగా నిలదొక్కుకునే సంకేతాలను చూపించలేకపోయింది. ఐఏఎంసీ ప్రారంభానికి మద్దతు సమర్థనీయమే.
కానీ అలాంటి సంస్థలకు నిరంతర, శాశ్వత ఆర్థిక సాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా లాభదాయకం కాకపోవచ్చు. ఐఏఎంసీ పనితీరును ఏటా సమీక్షించి, దాని ఖాతాలను తెలంగాణ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఆడిట్) లేదా మరే ఇతర సమర్థ అధికారి ద్వారా ఆడిట్ చేయించుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాం. గత ఒప్పందం మేరకు ఐదేళ్ల తర్వాత ఐఏఎంసీ పనితీరుకు లోబడి నిధుల విడుదల ఉండేలా ప్రభుత్వం చూసుకోవాలి’ అని ధర్మాసనం పేర్కొంది.
నిధుల కేటాయింపునకు పనితీరే కొలమానం..
‘ప్రభుత్వ వివాదాలన్నీ ఐఏఎంసీలోనే పరిష్కరించుకునేలా ఇచ్చిన జీవో సమర్థనీయమే అయినా.. పలు సూచనలు చేయాల్సి ఉంది. రూ. 3 కోట్లకుపైగా విలువైన అన్ని వివాదాలను ఐఏఎంసీకి మధ్యవర్తిత్వం కోసం సూచించాలనే ప్రభుత్వ నిర్ణయం విధానపరమైనది. అయితే ప్రజాధనంతో ఈ అంశం ముడిపడి ఉన్నందున జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రభుత్వం కేసులను ఐఏఎంసీకి సూచించడం, దానికయ్యే ఖర్చులను పరిశీలించాల్సి ఉంటుంది. ఐఏఎంసీ ద్వారా మధ్యవర్తిత్వ ఖర్చు ఎక్కువగా ఉందని.. ఖజానాపై గణనీయమైన భారం పడుతున్నట్లు గురిస్తే ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవచ్చు. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి తర్వాత పిల్‌లను పాక్షికంగా అనుమతిస్తున్నాం’ అని ధర్మాసనం తెలిపింది.
మధ్యవర్తిత్వాన్ని బలోపేతం చేయాలి..
‘కేంద్ర న్యాయ శాఖ జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ ప్రత్యామ్నాయ వివాద పరిష్కారాన్ని ప్రోత్సహించడానికి దేశంలో సంస్థాగత మధ్యవర్తిత్వాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించాలన్న లక్ష్యాన్ని సాధించడానికి ఐసీసీ కోర్టు, సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఎస్‌ఐఏసీ), లండన్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ (ఎల్‌సీఐఏ), హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (హెచ్‌కెఐఏసీ)ల మాదిరిగానే మధ్యవర్తిత్వ సేవలను అందించే సంస్థలను స్థాపించాలని సిఫార్సు చేసింది.
సంస్థాగత మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించడంలో ప్రభుత్వ మద్దతు ప్రాముఖ్యతను వివరించింది. ప్రధాన వాణిజ్య కేంద్రాల్లో సమగ్ర మౌలిక సదుపాయాలను ప్రభుత్వాలు సులభతరం చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. మధ్యవర్తిత్వ సంస్థల నిర్వహణకు ప్రారంభ మూలధనం అవసరమని.. దాన్ని ప్రభుత్వం అందించవచ్చని పేర్కొంది. మధ్యవర్తిత్వ సంస్థలకు ప్రభుత్వాలు మద్దతివ్వడం సంతృప్తికరమే’ అని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.