సొంతంగా పంటల బీమా పథకం! 

Telangana Govt Likely To Implement Own Crop Insurance Scheme - Sakshi

పశ్చిమ బెంగాల్‌ తరహా పథకంపై అధ్యయనం

త్వరలో ఆ రాష్ట్రంలో అధికారుల పర్యటన 

మూడేళ్లుగా రాష్ట్రంలో అందని బీమా 

కేంద్ర పథకం ఎక్కువ మందికి ఉపయుక్తంగా లేదని సర్కార్‌ భావన 

ఈ నేపథ్యంలో సొంత పథకం రూపకల్పనపై దృష్టి 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా పంటల బీమా పథకాన్ని తీసుకొచ్చే పనిలో నిమగ్నమైంది. పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న తరహాలోనే ఇక్కడ కూడా బీమా పథకాన్ని అమలు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందుకోసం త్వరలో ఆ రాష్ట్రానికి అధికారుల బృందాన్ని పంపించే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి.

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా పథకం నుంచి బయటకు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎలాంటి పథకం అమలుకావడంలేదు. దీంతో పంట నష్టం జరిగినా రైతులకు ఎలాంటి పరిహారం అందని పరిస్థితి నెలకొంది. ప్రకృతి విపత్తులతో రైతులు వేల కోట్ల రూపాయల పంటలను నష్టపోవడం.. రైతులు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ సొంత పంటల బీమాను ప్రవేశపెట్టడంపై దృష్టిసారించింది.  

రైతుబంధుతోనే సరి.. 
రాష్ట్రంలో రైతుబంధు కింద రైతులకు ఆర్థిక సాయం అందుతున్న విషయం తెలిసిందే. ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున ఏడాదికి రెండు సార్లు రైతులకు ప్రభుత్వం సాయం చేస్తోంది. అందువల్ల ప్రత్యేకంగా పంట నష్టపరిహారం అవసరంలేదన్న భావన వ్యవసాయ శాఖ వర్గాల్లో నెలకొంది. కానీ ఈ వైఖరిపై రైతుల నుంచి విమర్శలు వస్తున్నాయి. కాగా, కేంద్ర ప్రభుత్వ పథకంలో గ్రామాన్ని యూనిట్‌గా కాకుండా మండలాన్ని యూనిట్‌గా తీసుకోవడంతో పెద్దగా ప్రయోజనం లేదన్న భావన నెలకొంది.

వడగండ్లు, పెనుగాలులకు పంట నష్టపోతే తక్షణం 25 శాతం పరిహారం ఇవ్వాలనే నిబంధనను ప్రైవేటు బీమా కంపెనీలు అమలుచేయక పోవడం, అధిక సంఖ్యలో రైతులకు పరిహారం అందేలా కేంద్ర పథకం లేదన్న భావనతో రాష్ట్ర ప్రభుత్వం దాని నుంచి బయటకు వచ్చింది. ఈ తరుణంలో పశ్చిమబెంగాల్‌లో అమలు చేస్తున్న పథకంతో ఎక్కువ మందికి పరిహారం అందుతోందని అధికారుల పరిశీలనలో తేలింది. ఈ నేపథ్యంలో బెంగాల్‌ తరహాలో పంటల బీమా పథకం అమలుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించారు.  

మూడేళ్లుగా బెంగాల్‌లో సొంత బీమా 
పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్‌ బీమా పథకంలో మార్పులు చేసి బంగ్లా సస్య బీమా యోజన (బీఎస్‌బీ) పేరుతో సొంత పథకం తీసుకొచ్చింది. మూడేళ్లుగా దీనిని అమలు చేస్తోంది. బెంగాల్‌ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆలుగడ్డ, చెరకు పంట విలువలో 4.85 శాతాన్ని ప్రీమియంగా రైతుల నుంచి వసూలు చేస్తుండగా, ఆహార ధాన్యాలు, వంట నూనెలకు సంబంధించిన పంటలకు రైతుల తరఫున పూర్తి ప్రీమియంను బెంగాల్‌ ప్రభుత్వమే భరిస్తోంది.

ఈ నేపథ్యంలో బెంగాల్‌ తరహాలో రాష్ట్రంలో కూడా సొంతంగా పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని సర్కారు భావిస్తోంది. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోనూ బెంగాల్‌ తరహాలో పంటల బీమా పథకాన్ని అమలు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ప్రభుత్వం వ్యవసాయ శాఖకు సూచించింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top