సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు శుభవార్త చెప్పింది. కార్మికుల కనీస వేతనాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో కార్మికులను నాలుగు విభాగాలుగా ప్రభుత్వం విభజించింది. కార్మికులకు ఇది తెలంగాణ ఆవిర్భావ కానుక అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. పెంచిన వేతనాలు జూన్ రెండో తేదీ నుంచి అమలులోకి వస్తాయన్నారు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. యువతకు నా విజ్ఞప్తి. సాంకేతిక నైపుణ్యం పెంచుకోండి. నైపుణ్యం ఉన్న వాళ్లను పంపాలని.. మన ప్రభుత్వాన్ని ఎన్నో దేశాలు సంప్రదిస్తున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న కార్మికులకు కనీస వేతనం ఎక్కువగా ఉండాలి. కార్మికుల హక్కులను కాపాడటమే మా లక్ష్యం. కార్మికుల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. గడిచిన 15 ఏళ్లలో కార్మికులకు వేతన సవరణ చేయలేదు. గత ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసింది. మేము అధికారంలోకి వచ్చాక కార్మికుల కోసం సబ్ కమిటీ ఏర్పాటు చేశాం.
గతంలో అర్బన్, రూరల్.. రెండే జోన్లు ఉండేవి. ఇప్పుడు మూడు జోన్లు చేశాం. నాలుగు కేటగిరిలుగా కార్మికులను విభజించాం. కనీస వేతనాలు సవరించకపోవడం వల్ల కోటీ 11 లక్షల మంది కార్మికులు నష్టపోయారు’ అని చెప్పుకొచ్చారు.
వేతనాల పెంపు ఇలా..
అన్‌స్కిల్డ్ కార్మికులకు రూ.12వేల నుంచి రూ.16వేలకు పెంపు.
హైస్కిల్డ్ కార్మికులకు రూ.14,600వేల నుంచి 20వేలకు పెంపు.
సెమీ స్కిల్డ్ కార్మికుల కనీస వేతనం రూ.13590 నుంచి రూ.15వేలకు పెంపు.
స్కిల్డ్ కార్మికులకు కనీస వేతనం రూ.17వేల నుంచి రూ.18వేలకు పెంపు.


