లైసెన్స్‌ ఫీజుపై సైలెన్స్‌!   | Telangana Government Not Yet Gives Clarity About License Fee For Bar And Restaurant | Sakshi
Sakshi News home page

లైసెన్స్‌ ఫీజుపై సైలెన్స్‌!  

Oct 4 2020 4:06 AM | Updated on Oct 4 2020 4:06 AM

Telangana Government Not Yet Gives Clarity About License Fee For Bar And Restaurant - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా లాక్‌డౌన్‌ తర్వాత బార్‌ అండ్‌ రెస్టారెంట్లు తెరుచుకునేందుకు అనుమతించిన రాష్ట్ర ప్రభుత్వం ఆయా బార్ల లైసెన్స్‌ ఫీజు విషయంలో మాత్రం పీటముడి ఇంకా విప్పలేదు. లాక్‌డౌన్‌తో ఆరు నెలలకు పైగా బార్లు మూసివేయాల్సి వచ్చిన నేపథ్యంలో ఆ కాలానికి లైసెన్సు ఫీజును ప్రభుత్వం మినహాయిస్తుందనే ఆశలో బార్‌ యాజమాన్యాలున్నాయి. అయితే ఫీజు చెల్లించే విషయంలో వెసులుబాటు కల్పించేంతవరకు నిబంధనలు అనుమతిస్తాయి కానీ, ఫీజు మినహాయింపునకు అవకాశం లేదని ఎక్సైజ్‌ వర్గాలు అంటున్నాయి. బార్‌ యజమానులు మాత్రం అసలే నష్టాల్లో ఉన్నామని, ఈ పరిస్థితుల్లో ఫీజు చెల్లించే విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని, లేదంటే లైసెన్సులు అమ్ముకోవడం మినహా మరో మార్గం లేదని చెపుతున్నారు. 

వెసులుబాటు వరకు ఓకే
ఎక్సైజ్‌ అధికారుల సమాచారం ప్రకారం లైసెన్సు ఫీజు చెల్లించే విషయంలో బార్‌ యాజమాన్యాలకు వెసులుబాటు కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి, గత నెలలోనే ఫీజు చెల్లించి లైసెన్సులు రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉంది. కానీ, బార్లు మూసి ఉండటంతో అది సాధ్యపడలేదు. ఇప్పుడు మళ్లీ బార్లు నడుపుకునేందుకు అనుమతిచ్చిన నేపథ్యంలో కుదుటపడేంతవరకు సమయం ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. మరో నెల రోజులపాటు లైసెన్సు ఫీజుపై ఒత్తిడి తేవద్దని ఎక్సైజ్‌ అధికారులకు ప్రభుత్వ వర్గాల నుంచి మౌఖిక ఉత్తర్వులు అందినట్టు తెలుస్తోంది. అదే విధంగా గతంలో మూడు వాయిదాల్లో వార్షిక లైసెన్సు ఫీజు చెల్లించే నిబంధనను కొంత మార్చి దాన్ని నాలుగు వాయిదాలకు పెంచాలని, వడ్డీ లేకుండానే ఫీజు కట్టేందుకు అనుమతివ్వాలని కూడా ప్రతిపాదనలు తయారు చేసినట్టు తెలుస్తోంది. అయితే, అసలు ఫీజు ఎప్పటివరకు, ఎంత కట్టాలన్న దానిపై ఎక్సైజ్‌ వర్గాల నుంచి స్పష్టత లేకపోవడంతో ఎప్పుడు మళ్లీ ఫీజు పిడుగు తమ నెత్తిపై పడుతుందనే ఆందోళన బార్‌ యాజమాన్యాల్లో వ్యక్తమవుతోంది. 

ఇప్పటికే నష్టపోయాం..
కరోనా లాక్‌డౌన్‌ కాలానికి ఫీజు మినహాయింపు అంశాన్ని బార్‌ యజమానుల అసోసియేషన్‌ రెండు నెలల ముందు నుంచే తెరపైకి తెచ్చింది. ఎక్సైజ్‌ ఉన్నతాధికారులతో పాటు ఆ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ను పలుమార్లు అసోసియేషన్‌ నేతలు కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. కానీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లభించలేదు. అయితే, బార్లు తెరిచేందుకు అనుమతినిచ్చిన సమయంలోనే వైన్‌షాపుల పర్మిట్‌రూంలను మూసి ఉంచాలని ఉత్తర్వుల్లో పేర్కొనడం ద్వారా కొంతమేర బార్లకు ఊరట కలిగించారు. కరోనా కారణంగా లక్షల్లో నష్టపోయామని, ఇప్పుడు మళ్లీ బార్లు తెరిచేందుకు అడ్వాన్సుల కింద పెద్ద మొత్తంలో చెల్లిస్తున్నామని, మళ్లీ లైసెన్సు ఫీజు కట్టాలంటే తమ వల్ల కాదని బార్‌ యజమానులు అంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement