నిధులపై నీళ్లు.. సాగునీటి ప్రాజెక్టులపై గెజిట్‌ దెబ్బ | Sakshi
Sakshi News home page

నిధులపై నీళ్లు సాగునీటి ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ దెబ్బ

Published Wed, Aug 11 2021 4:40 AM

Telangana: Government Gazette Blow On Water Irrigation Projects On Funds - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు నిధుల కొరత వెంటాడుతోంది. ఇప్పటికే అనేక ప్రాజెక్టుల పరిధిలో భారీగా బకాయిలు పేరుకుపోగా.. కృష్ణా, గోదా వరి బోర్డులపై కేంద్రం తీసుకొచ్చిన గెజిట్‌తో కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. అనుమతుల్లేవని చెబుతున్న ప్రాజెక్టులకు రుణాల విడుదలలో రుణ సంస్థలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు నిధుల విడుదలను నిలిపివేయడంతో, ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాలు నిర్ణీత గడువులోగా చేరుకునే పరిస్థితి లేకుండా పోతోంది. 

పేరుకుపోయిన బకాయిలు
రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో గతంలో ఎన్నడూ లేనంతగా బకాయిలు పేరుకుపోయాయి. కరోనా ప్రభావంతో రాష్ట్ర ఆదాయానికి గండి పడటం, మరోవైపు ఇతర ప్రాధాన్యత రంగాలకు నిధుల వెచ్చింపు పెరగడంతో ప్రాజెక్టులకు రాష్ట్ర నిధుల నుంచి కేటాయింపులు తగ్గాయి. కొత్త ఆర్థిక ఏడాదిలో ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టులపై రూ.4,925 కోట్లు వెచ్చించగా, ఇందులో రాష్ట్ర నిధుల నుంచి ఇచ్చింది కేవలం రూ.1,887 కోట్లు మాత్రమే. ఇక రుణాల రూపేణా వచ్చిన సొమ్ముతో మరో రూ.3,038 కోట్లు మేర ఖర్చు చేశారు.

అయినప్పటికీ ఇంకా రూ.11,396 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇందులో నిర్మాణ పనులు (వర్క్స్‌)కు సంబంధించిన బిల్లులే రూ.5,710 కోట్ల మేర పెండింగ్‌లో ఉన్నాయి. పనులకు సంబంధించిన బకాయిల్లో కాళేశ్వరం పరిధిలోనే రూ.1,200 కోట్ల మేర చెల్లించాల్సి ఉండగా, మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ పరిధిలోనివి రూ.300–400 కోట్ల వరకు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ రిజర్వాయర్‌ పనులు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉన్నా, చివరి దశలో ఉన్న పనులకు నిధుల కొరత కారణంగా కనీసం డీజిల్‌ ఖర్చులకు సైతం ఇక్కట్లు తప్పట్లేదు. పాలమూరు–రంగారెడ్డి పరిధిలో మరో రూ.2 వేల కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు నీటి పారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. 

జూలై తొలివారం వరకు వచ్చిన నిధులు
ప్రాజెక్టులకు నిధుల కొరత రావద్దనే ఉద్దేశంతోనే కాళేశ్వరం కార్పొరేషన్, తెలంగాణ వాటర్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్‌లకు ప్రైవేటు బ్యాంకులతో పాటు పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్, రూరల్‌ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్, నాబార్డ్‌ వంటి సంస్థలు రుణాలిస్తున్నాయి. ఈ ఆర్థిక ఏడాది జూలై తొలివారం వరకు కాళేశ్వరానికి రూ.1,624 కోట్లు, పాలమూరు–రంగారెడ్డికి రూ.1,039 కోట్లు, కంతనపల్లికి రూ.40 కోట్లు, దేవాదులకు రూ.127 కోట్లు, సీతారామకు రూ.136 కోట్లు మేర రుణాలు విడుదలయ్యాయి. అయినప్పటికీ కాళేశ్వరం, పాలమూరుతో పాటు సీతారామలో పనులకు సంబంధించి రూ.563 కోట్లు, దేవాదులలో రూ.10 కోట్లు బకాయిలున్నాయి. మున్ముందు పనులకు రూ.2 వేల కోట్ల మేర నిధుల అవసరాలున్నాయి. 

గెజిట్‌తో రుణ సంస్థల వెనుకంజ
ప్రస్తుతం కేంద్రం వెలువరించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ల కారణంగా రుణ సంస్థలు రుణాల విడుదలపై సందిగ్ధంలో పడ్డాయి. అనుమతుల్లేని ప్రాజెక్టులు, వాటికి అనుమతుల విషయమై గెజిట్‌లో కేంద్రం పలు సూచనలు చేసిన నేపథ్యంలో రుణాల విడుదలపై సంస్థలు వెనుకంజ వేస్తున్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం అదనపు టీఎంసీ, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, దేవాదుల, సీతమ్మసాగర్‌ బ్యారేజీ వంటి ప్రాజెక్టులకు కేంద్ర సంస్థల నుంచి అనుమతి తీసుకోవాలని గెజట్‌లో పేర్కొన్న నేపథ్యంలో రుణ సంస్థలు ఈ అంశాలపై రాష్ట్రానికి ప్రశ్నలు సంధిస్తున్నాయి.

ప్రాజెక్టులకు ఆమోదం ఎప్పటిలోగా తీసుకుంటారు, ఒకవేళ అనుమతులు రాకుంటే పరిస్థితి ఏంటీ, రుణాల చెల్లింపు విషయంలో ప్రభుత్వ విధానం ఏంటని ఆరా తీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గెజిట్‌ వెలువడిన నాటి నుంచి కార్పొరేషన్‌లకు రుణ సంస్థలు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టుకు నాబార్డ్‌ నుంచి రూ.400 కోట్ల మేర రావాల్సి ఉన్నా.. ప్రస్తుత పరిస్థితులతో వాటిని వాయిదా వేస్తోంది. ప్రధాన ప్రాజెక్టులన్నింటికీ రుణాలే కీలకం కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత మేర రుణాలు లభిస్తాయన్నది ప్రశ్నార్ధకంగా మారింది.   

Advertisement

తప్పక చదవండి

Advertisement