రేపే.. ‘పైలట్‌’ అప్పు | Telangana Government Debts in BIS pilot basis | Sakshi
Sakshi News home page

రేపే.. ‘పైలట్‌’ అప్పు

Apr 6 2026 5:11 AM | Updated on Apr 6 2026 5:11 AM

Telangana Government Debts in BIS pilot basis

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఆర్థిక సంవత్సరంలో అప్పులు తీసుకునే ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్వారా బాండ్లను తనఖా పెట్టనున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఏడో తేదీన బహిరంగ మార్కెట్‌లో రుణం తీసుకోనుంది. ఆర్‌బీఐ తొలిసారి ప్రవేశపెడుతోన్న బీఐఎస్‌ అనే పైలట్‌ పద్ధతిలో ఈ అప్పును తీసుకోనుండడం గమనార్హం. ఈనెల ఏడో తేదీన దేశంలోని 4 రాష్ట్రాలకు రూ. 15,500 కోట్లను ఆర్‌బీఐ రుణాల రూపంలో సమకూర్చనుంది. అందులో 16–20 సంవత్సరాల కాల పరిమితితో రూ.2 వేల కోట్లు, 25 కంటే ఎక్కువ సంవత్సరాల కాల పరిమితితో రూ.1,900 కోట్లు రుణం తీసుకునేందుకు తెలంగాణకు అనుమతి లభించింది. 

ఈ మేరకు తొలి మూడు నెలల కాలంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు బహిరంగ మార్కెట్‌లో ఇప్పించే రుణాల షెడ్యూల్‌ను ఆర్‌బీఐ తాజాగా విడుదల చేసింది. ఈ షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ ఏడో తేదీన రూ.3,900 కోట్లతోపాటు అదే నెల 21వ తేదీన మరో రూ.2 వేల కోట్లను రుణం తీసుకోవడం ద్వారా తొలి మాసంలోనే రూ.6 వేల కోట్లను తెలంగాణ ప్రభుత్వం సమకూర్చుకోనుంది. ఇక, మే, జూన్‌ నెలల్లో కూడా రెండు దఫాల్లో రూ.5,250 కోట్ల చొప్పున మొత్తం రూ.16,400 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం రుణాల కింద తీసుకోనుంది.  

తొమ్మిదింటిలో మనం కూడా.. 
ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం నుంచి ఆర్‌బీఐ పైలట్‌ పద్ధతిని అమలు చేయాలని నిర్ణయించింది. ప్రామాణాత్మక జారీ వ్యూహం (బీఐఎస్‌) పద్ధతిలో దేశంలోని తొమ్మిది రాష్ట్రాలకు బహిరంగ మార్కెట్‌లో రుణాలు ఇప్పించనుంది. ఇందులో తెలంగాణతోపాటు ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, ఛత్తీస్‌గఢ్, బిహార్, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలున్నాయి. బాండ్లను తనఖా పెట్టుకోవడం ద్వారా అప్పులిచ్చే పెట్టుబడిదారులకు ఈ తొమ్మిది రాష్ట్రాలపై మరింత నమ్మకం కలిగేలా ప్రణాళిక రూపొందించింది. 

మార్కెట్‌ పరిస్థితులు ఎలా ఉన్నా, ఈ రుణాల చెల్లింపులకు నిర్ణీత గడువు (మెచ్యూరిటీ బకెట్‌)ను నిర్ధారించడం ద్వారా దీర్ఘకాలంలో రాష్ట్రాలకు భారంగా మారకుండా చూడడమే దీని ఉద్దేశమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు పెట్టుబడిదారులకు వెంటనే రిటర్న్‌లు వచ్చే విధంగా ఆయా రాష్ట్రాలు చెల్లింపుల షెడ్యూల్‌ను ఈ పద్ధతిలో నిర్ణయించనున్నందున అప్పులిచ్చే వారికి కూడా వెసులుబాటు ఉండేలా ఆర్‌బీఐ ఈ పద్ధతిని ఎంచుకుందని అంటున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement