
‘ఎక్స్’వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి హర్షం
సాక్షి, హైదరాబాద్: మహిళల ఉచిత ప్రయాణ పథకం 18 నెలల కాలంలో 200 కోట్ల జీరో టికెట్ల మైలురాయి ని చేరుకోవటం సంతోషంగా ఉందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ పథకంలో భాగంగా జారీ చేసిన జీరో టికెట్ల సంఖ్య బుధవారంతో 200 కోట్లకు చేరు కుంటున్న నేపథ్యంలో అన్ని డిపోల ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్లలో ప్రజాప్రతినిధులు, మహిళా సమాఖ్య ప్రతినిధుల సమక్షంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
మహిళా ప్రయాణికుల అనుభవాలను వెల్లడించటంతోపాటు పలు రంగాల మహిళా ప్రయాణికులకు బహుమతులు అందించి సత్కరించనున్నారు. ఈమేరకు సీఎం ‘ఎక్స్’వేదికగా సంతోషాన్ని వ్యక్తం చేశారు.
మహిళలకు రూ.6,700 కోట్లు ఆదా: ఉచిత ప్రయాణ పథకంలో 200 కోట్ల జీరో టికెట్లు జారీ అయ్యాయని, వాటి ద్వారా మహిళలు రూ.6,700 కోట్లు ఆదా చేసుకున్నారని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వీటికి సంబంధించిన మొత్తాన్ని ఆర్టీసీకి ప్రభుత్వం ఎప్పటికప్పుడు రీయింబర్స్ చేస్తోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.