సన్న రకం.. ‘ధర’హాసం

Telangana: Farmers Getting Best Price In Rice Grain In Nalgonda District - Sakshi

ఉమ్మడి నల్లగొండలో క్వింటా రూ. 2,300 పలికిన సన్నరకం ధాన్యం 

మద్దతు ధర రూ.1,960కు మించి వస్తుండటంతో రైతుల్లో ఆనందం 

ఈ నెల మొదట్లో రూ.1,700కే కొన్న మిల్లర్లు 

ఇతర రాష్ట్రాలు, హైదరాబాద్‌ నుంచి ఆర్డర్లతో పెరిగిన డిమాండ్‌ 

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఈ ఇద్దరే కాదు.. ఉమ్మడి నల్లగొండలో సన్నరకం ధాన్యాన్ని మిల్లుల్లో విక్రయిస్తున్న రైతులకు ఇప్పుడు మంచి ధర వస్తోంది. ఈ నెల మొదట్లో ఎక్కువ మందికి క్వింటాకు రూ.1,700, కొంతమందికి రైతులకు రూ. 1,960లోపే చెల్లించిన మిల్లర్లు.. ఇప్పుడు సర్కారు మద్దతు ధర రూ. 1,960 కన్నా ఎక్కువగా గరిష్టంగా రూ. 2,300 వరకు ఇస్తున్నారు. దీంతో రైతులు సంబురపడిపోతున్నారు.  

కారణమిదీ..
జిల్లాలోని మిల్లర్లు సన్నరకం ధాన్యాన్నే ఎగుమతి చేస్తారు. ఈ ధాన్యాన్ని రా రైస్‌గా మార్చి హైదరాబాద్‌ సహా దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలు, విదేశాలకు ప్రతి ఏడాది ఎగుమతి చేస్తుంటారు. ఇటీవల ఆయా ప్రాంతాల వ్యాపారులు పెద్ద ఎత్తున సన్నరకం కావాలని కోరడంతో ధాన్యం కొనుగోళ్లను పెంచినట్లు మిల్లర్లు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో సన్న ధాన్యం విక్రయించేందుకు వస్తున్న రైతులు తగ్గడంతో మిల్లర్లు పోటీపడి మరీ ఎక్కువ ధరకు కొంటున్నారు. ఒక్క మిర్యాలగూడలోనే 83 మిల్లులు సన్నరకం ధాన్యం కొనుగోలు చేస్తున్నాయి.  

చివరి దశకు సన్నరకం అమ్మకాలు 
నల్లగొండ జిల్లాలో సన్నరకం ధాన్యం 6,09,758 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వచ్చింది. ఇందులో రైతులు తాము తినేందుకు పక్కనపెట్టుకున్నవి పోనూ మిగతా 5 లక్షల మెట్రిక్‌ టన్నులు అమ్ముతారని అధికారులు అంచనా వేశారు. మిల్లర్లు ఇప్పటికే 3.5 లక్షల మెట్రిక్‌ టన్నులు కొన్నారు. దీంతో ధాన్యం రాక తగ్గింది. యాదాద్రి జిల్లాలో 1.12 లక్షల హెక్టార్లకు గాను 7 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. ఇందులో ఎక్కువ శాతం సాధారణ రకమే.

సూర్యాపేట జిల్లాలో 4,51,623 మెట్రిక్‌ టన్నుల సన్నరకం ధాన్యం దిగుబడి రాగా ఇందులో సగానికిపైగా ఇప్పటికే మిల్లర్లకు అమ్మేశారు. ఇలా వచ్చే ధాన్యం తగ్గుతుండటం, వ్యాపారుల నుంచి డిమాండ్‌ ఉండటంతో రేటు పెరుగుతోంది. 

ఈయన పేరు పేరం వెంకన్న. ఊరు నేరేడుచర్ల మండ లం నర్సయ్యగూడెం. తనకున్న ఐదెకరాలతో పాటు మరో పదెకరాలు కౌలుకు తీసుకొని చింట్లు రకం ధాన్యం సాగు చేశాడు. పదెకరాల్లో పండిన ధాన్యాన్ని 15 రోజుల కిందట క్వింటాకు రూ.1,700 చొప్పున విక్రయించాడు. తాజాగా ఆదివారం ఐదెకరాల ధాన్యాన్ని క్వింటా రూ.2,300 చొప్పున అమ్మాడు. ఒక్కో క్వింటాపై రూ. 600 ఎక్కువ రావడంతో సంతోషించాడు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top