
ఉపాధి కోసం 17 ఏళ్ల క్రితం వెళ్లిన మెట్‌పల్లి యువకుడు
రెండేళ్ల తర్వాత ఆచూకీ లేకుండా పోయిన వైనం
రెండు రోజుల క్రితం వెలుగులోకొచ్చిన మరణ వార్త
మృతదేహాన్ని అప్పగించాలని కుటుంబ సభ్యుల విజ్ఞప్తి
మెట్‌పల్లి: సుమారు పదిహేడేళ్ల క్రితం.. ఎన్నో ఆశలతో ఆ యువకుడు ఉపాధి కోసం బహ్రెయిన్ వెళ్లాడు. అతడికి అప్పటికే వివాహమైంది. భార్య, కుటుంబ సభ్యులను విడిచిపెట్టి ఏడారి దేశానికి వలసవెళ్లాడు. అక్కడకు వెళ్లిన రెండేళ్ల వరకు తరచూ ఫోన్ చేసిన అతడు.. అనంతరం ఆచూకీ లేకుండాపోయాడు. అప్పటినుంచి ప్రతిరోజు అతని ఫోన్ కోసం.. ఇంటికి వస్తాడనే ఆశతో గుమ్మం వైపు చూసీచూసీ కుటుంబ సభ్యులు అలసిపోయారు. ఎక్కడో బతికి ఉంటాడని, ఎప్పుడైనా ఇంటికొస్తాడని అనుకుంటున్న వారికి రెండురోజుల క్రితం అతడు సజీవంగా లేడనే సమాచారం అందింది. ఐదేళ్ల క్రితమే ఈ లోకాన్ని విడిచి వెళ్లాడని తెలియడంతో వారంతా ఒక్కసారిగా దుఖఃసాగరంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని రాంనగర్‌కు చెందిన భారతి, అశోక్ దంపతులకు ఇద్దరు కుమారులు.
పిల్లలు చిన్నతనంలో ఉండగానే వారు మరణించారు. వారి చిన్న కుమారుడు నరేశ్‌ను అతని చిన్నమ్మ శ్రీపాద లక్ష్మీ దత్తత తీసుకుంది. 2007లో అతడికి కథలాపూర్ మండలానికి చెందిన యువతితో వివాహమైంది. కొంతకాలానికే ఉపాధి నిమిత్తం బహ్రెయిన్ వెళ్లాడు. రెండేళ్ల వరకు కుటుంబసభ్యులు, బంధువులకు తరచూ ఫోన్ చేస్తూ ఉండేవాడు. తర్వాత చాలాకాలం పాటు ఫోన్ చేయకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు.. అక్కడ ఉంటున్న ఈ ప్రాంతం వారిని ఆరా తీసినప్పటికీ సమాచారం లభించలేదు. పాస్‌పోర్ట్ గడువు ముగిస్తే ఇంటికి వస్తాడని భావించారు. అయినా రాకపోవడంతో నరేశ్ (39) ఆచూకీ కోసం అతని భార్య కథలాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ఏళ్లు గడుస్తున్నా అతని ఆచూకీ దొరకకున్నా.. ఎక్కడో సజీవంగా ఉంటాడని భావిస్తున్న కుటుంబసభ్యులకు రెండు రోజుల క్రితం గుండెలను పిండేసే సమాచారం అందింది. ఐదేళ్ల క్రితమే నరేశ్ మృతి చెందాడని, అతని మృతదేహం బహ్రెయిన్‌లోని ఓ మార్చురీలో ఉందని తెలియడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అతడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పాస్‌పోర్టు గడువు ముగిసినప్పటికీ నరేశ్ అక్కడే ఉండిపోవడం..
మరణించిన తర్వాత అతని వివరాలు తెలియకపోవడంతో ఇంతకాలం మృతదేహాన్ని అక్కడి మార్చురీలోనే భద్రపర్చినట్లు సమాచారం. ప్రస్తుతం అతని వివరాలు తెలియడంతో భారత ఎంబసీ అధికారులు.. వాటిని బహిర్గతం చేయడం ద్వారా కుటుంబసభ్యులకు చేరింది. నరేశ్ సోదరుడు ఆనంద్ మృతదేహాన్ని తెప్పించి తమకు అప్పగించాలని మంగళవారం ఎన్నారై అడ్వయిజరీ కమిటీ ద్వారా సీఎం ప్రవాసీ ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. 17 ఏళ్ల క్రితం ఉపాధి కోసం ఎడారి దేశానికి వలస వెళ్లిన నరేశ్ కొంతకాలానికే ఆచూకీ లేకుండా పోవడం.. చివరకు అక్కడే అసువులు బాయడం స్థానికులను కలచివేసింది.