పేరుకే పల్లె.. అందరికీ ఫారిన్‌ కొలువులే! | Komatireddy Narasimha Reddy: Karimnagar First to America | Sakshi
Sakshi News home page

పేరుకే పల్లెటూరు.. అన్నీ ఫారిన్‌ కొలువులు, ప్రభుత్వ ఉద్యోగాలే!

Oct 19 2025 1:24 PM | Updated on Oct 19 2025 1:31 PM

Komatireddy Narasimha Reddy: Karimnagar First to America

 అమెరికా, యూరప్‌ దేశాల్లో యువత

 విదేశాల్లో పనిచేస్తున్న 34 మంది 

17 మంది ప్రభుత్వ ఉద్యోగులు

ముగ్గురు బ్యాంక్‌ మేనేజర్లు

ఒక డాక్టర్‌.. ఇదీ ఆ పల్లె విజయగాథ 

ఇల్లంతకుంట(మానకొండూర్‌): అది పేరుకే పల్లెటూరు. ఆ ఊరిలోని యువత దారి అమెరికా, యూరప్‌ దేశాలు. దాదాపు ప్రతీ ఇంటిలో ఉన్నత విద్యావంతుడు ఉంటారు. ఇప్పటికే 34 మంది విదేశాల్లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా స్థిరపడగా.. గ్రామంలోనే ఉంటున్న 17 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. వీరిని స్ఫూర్తిగా తీసుకున్న నేటి యువత ఉన్నత చదువులు.. విదేశాల్లో కొలువులే లక్ష్యంగా హైదరాబాద్, బెంగళూర్‌ నగరాల్లో చదువుకుంటున్నారు. కుగ్రామం ముస్కానిపేట విజయగాథపై సండే స్పెషల్‌.

1961లోనే అమెరికా పయనం
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోనే అమెరికాకు వెళ్లిన మొట్టమొదటి వ్యక్తిగా ఇల్లంతకుంట మండలంలోని ముస్కానిపేటకు చెందిన కోమటిరెడ్డి నరసింహారెడ్డి గుర్తుకొస్తారు. 1954లో గ్రామపంచాయతీగా ఏర్పడ్డ ముస్కానిపేటలో 3,625 మంది జనాభా నివసిస్తున్నారు. మండల కేంద్రం ఇల్లంతకుంటకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గ్రామంలో అతి పురాతనకాలం నాటి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆధ్యాత్మికతను పంచుతుండగా.. గ్రామం మొదట్లో దేవతామూర్తుల చిత్రాలతో ఆర్చి స్వాగతం పలుకుతుంటుంది. గ్రామం నుంచి అమెరికాకు వెళ్లిన వారు 11 మంది, లండన్‌లో ఇద్దరు, ఆస్ట్రేలియాలో ఒకరు, ఇండియాలో 21 మందితో కలిపి 34 మంది సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నారు. కె.లక్ష్మారెడ్డి అనస్తీషియా డాక్టర్‌గా యశోద ఆస్పత్రిలో సేవలు అందిస్తున్నారు. బద్దం అనిల్, సారా నరేశ్‌గౌడ్, సింగిరెడ్డి రమణారెడ్డి వివిధ బ్యాంకుల్లో మేనేజర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. గ్రామంలో 17 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా ఇటీవల ఏడుగురు ఉద్యోగ విరమణ పొందారు. 

ముస్కానిపేట టు అమెరికా     వయా ఆర్‌ఈసీ
ముస్కానిపేటకు చెందిన కోమటిరెడ్డి నరసింహారెడ్డి వరంగల్‌లోని రీజినల్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ(ఆర్‌ఈసీ)లో ఇంజినీరింగ్‌ చదివారు. గ్రామంలో నిధులు సమకూర్చుకొని అమెరికాకు వెళ్లారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని మొట్టమొదటి వ్యక్తిగా 1961లో అమెరికాకు వెళ్లారు. నరసింహారెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని గ్రామంలోని చాలా మంది యువకులు అమెరికాకు వెళ్లి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా స్థిరపడ్డారు.

సంతోషంగా ఉన్నాం
నేను 2008లో యూఎస్‌ ఏ వెళ్లాను. టెక్సాస్‌ స్టే ట్‌లోని డల్లాస్‌లో ఒక కంపెనీలో సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాను.  కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగాలేని సమయంలో అతి కష్టం మీద ఇక్కడికి వచ్చాను. ఇద్దరు అమ్మాయిలు. ఇప్పుడు ఆర్థికంగా స్థిరపడ్డాం.            
– కె.వంశీధర్‌రెడ్డి, యూఎస్‌ఏ 

భార్యాభర్తలం ఉద్యోగం చేస్తున్నాం
2018లో అమెరికాకు వెళ్లా ను. నా భార్య సరిత, నేను ఒకే కంపెనీలో పనిచేస్తున్నాం. మాకు ఒక కూ తురు. నార్త్‌ కరోలినా స్టే ట్‌లోని కెరీలో ఉంటున్నా ము. ఆర్థికంగా స్థిరపడ్డాం. సంతోషంగా ఉంది.          
– కాట్నపల్లి గోపాల్‌రెడ్డి

ఆస్ట్రేలియాలో ఉంటున్నా
నేను ఆస్ట్రేలియాకు 2017 లో వెళ్లాను. ఎన్‌ఐటీ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్‌గా స్థిరపడ్డాను. మెల్‌బోర్న్‌లో ఉంటున్నాను. మా ది వ్యవసాయ కుటుంబం.  
– కొమ్ముల మహేందర్‌రెడ్డి

లండన్‌లో ఉద్యోగం చేస్తున్న
నేను 2023లో లండన్‌ వెళ్లాను. ఇక్కడ ఎంబీఏ పూ ర్తి చేశాను. ప్రైవేట్‌ కంపెనీ లో ఉద్యోగం చేస్తున్నాను. ఇక్కడ ఉద్యోగం చేయడం సంతోషంగా ఉంది. 
– గుర్రం అజయ్‌రెడ్డి

2006 నుంచి సాఫ్ట్‌వేర్‌గా.. 
2006లో హైదరాబాద్‌లోని జేఎన్టీయూలో బీటెక్‌ పూర్తిచేసి అదే సంవత్సరం సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగం పొందాను. మేద సర్వో డ్రైవ్‌్సలో ఇండియన్‌ రైల్వే సిగ్నలింగ్‌ సిస్టంలో పనిచేస్తున్నాను. మొదట్లో నా సాలరీ రూ.10వేలు, ప్రస్తుతం సంవత్సరం ప్యాకేజీ రూ.50లక్షలు. ఊరి నుంచి సాఫ్ట్‌వేర్‌గా ఉద్యోగం పొందిన మొదటి వ్యక్తిని నేనే. చాలా సంతోషంగా ఉన్నాను. 
– కొమిరే లింగమూర్తిగౌడ్, హైదరాబాద్‌

బ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తున్న
ఎమ్మెస్సీ కంప్యూటర్‌ పూర్తి చేసి 2011లో కర్ణాటక బ్యాంకులో ప్రొహిబిషనరీ ఆఫీసర్‌గా ఎంపికయ్యాను. 2017లో బ్యాంకు మేనేజర్‌గా ప్రమోట్‌ అయ్యాను.  2011 నుంచి 19 వరకు గుజరాత్‌లో పనిచేశాను. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నారాయణగూడ బ్రాంచ్‌లో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాను. 
– బద్దం అనిల్‌

జీవితం సంతోషంగా ఉంది
నా కొడుకు అమెరికాలోని డల్లాస్‌లో సాఫ్ట్‌వేర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. దేశం పోయేటప్పుడు ఆర్థికంగా కష్టంగా ఉండేది. దేశం పోయి 17 ఏళ్లు అయ్యింది.  ఇప్పుడు చేతిలో డబ్బు ఉంది. చాలా సంతోషంగా ఉంది. కష్టపడి చదివినందుకు ఫలితం దక్కింది. 
– కోమటిరెడ్డి చిన్ననరసింహారెడ్డి, 
ముస్కానిపేట 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement