మాకు ఇదేం ‘శిక్ష’ణ

Telangana English Training Has Started For Government Teachers - Sakshi

ఎండా కాలంలో ఆంగ్ల మాధ్యమ శిక్షణపై ఉపాధ్యాయుల అసంతృప్తి

సోమవారమే తొలిదశ కార్యక్రమం మొదలు.. పెన్ను, నోట్‌బుక్‌లు ఇవ్వకపోవడంపైనా నిరసన

శిక్షణా కేంద్రాల్లో సౌకర్యాలు లేవంటున్న ఉపాధ్యాయ సంఘాలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆంగ్ల బోధనపై శిక్షణ మొదలైంది. జిల్లా, మండల స్థాయిల్లో కొద్దినెలల పాటు కొనసాగే ఈ కార్యక్రమానికి.. అన్ని స్థాయిల ఉపాధ్యాయులు విధిగా హాజరుకావాలని విద్యా శాఖ ఆదేశించింది. ఈ శిక్షణ బాధ్యతలను అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటీకి అప్పగించారు. యూనివర్సిటీ ప్రతినిధులు ఇప్పటికే రాష్ట్రంలో 20వేల మంది రిసోర్స్‌ పర్సన్లకు ట్రైనింగ్‌ ఇచ్చారు. వారు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు.

ఆదిలోనే అనాసక్తి..
శిక్షణ మొదలైన రోజే ఉపాధ్యాయుల నుంచి అసంతృప్తి కనిపిస్తోంది. మండు వేసవిలో శిక్షణ ఇవ్వడం సరికాదని, సరిగా శిక్షణ పొందే అవకాశం లేదని ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖ అధికారులపై ఒత్తిడి చేస్తున్నాయి. అంతేకాదు శిక్షణ కోసం అవసరమైన కొద్దిపాటి ఖర్చు పెట్టుకోవ డానికి కూడా టీచర్లు అనాసక్తత కనబరుస్తున్నారని అధికారవర్గాలు చెప్తున్నాయి.

లాంగ్‌ నోట్‌బుక్, పెన్ను, లంచ్‌ బాక్స్, మంచినీళ్లు వెంట తెచ్చు కోవాలని చెప్తే తప్పుపడుతున్నారని అంటున్నాయి. ఇక శిక్షణ కేంద్రాల్లో కొన్నిచోట్ల ఫ్యాన్లు లేవని, మంచినీటి వసతి కూడా కల్పించలేదని డీటీఎఫ్‌ అధ్యక్షుడు ఎం.రఘుశంకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి పేర్కొన్నారు. వేసవి ఎండలు పెరిగిపోతున్నందున ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకే శిక్షణ ఇవ్వాలని టీపీటీఎఫ్‌ నేతలు రమణ, మైస శ్రీనివాస్‌లు డిమాండ్‌ చేశారు.

60 వేల మందికి..
వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 8 తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు దాదాపు 60 వేల మంది టీచర్లకు ఇంగ్లిష్‌లో బోధనపై శిక్షణ ఇస్తున్నారు. మండల, జిల్లా కేంద్రాల్లోని ఒక్కో కేంద్రంలో దాదాపు 40 మందికి శిక్షణ ఇస్తున్నట్టు అధికారులు తెలిపారు.

ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఈ కార్యక్రమం ఉంటుందని, తొలి విడతగా ఐదు రోజులు కొనసాగుతుందని వివరించారు. కొద్దిరోజుల విరామం తర్వాత మళ్లీ శిక్షణ ఇవ్వనున్నారు. మొత్తంగా కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా శిక్షణ పూర్తి చేసి, టీచర్లను బోధనకు సిద్ధం చేయాలని భావిస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top