మావోయిస్టుల ఇలాకాలో పోలీస్‌ బాస్‌లు

Telangana DGP Police Visited Border Of Chhattisgarh for Anti Maoist Operations - Sakshi

చర్ల: మావోయిస్టుల ఇలాకాగా పేరున్న ఛత్తీస్‌గఢ్‌కు సరిహ ద్దులోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో తెలంగాణ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి, సీఆర్‌పీఎఫ్‌ డీజీపీ కుల్‌దీప్‌ సింగ్‌ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా చెన్నాపురం వద్ద  సీఆర్‌పీఎఫ్‌ క్యాంపును వారు ప్రారంభించారు. హైదరాబాద్‌ నుంచి హెలీకాఫ్టర్‌ ద్వారా చెన్నాపురం చేరుకున్న వారు క్యాంపు పరిసరాలతో పాటు అధికారులు, సిబ్బందికి కల్పించిన వసతులను పరిశీలించారు. అదనపు డీజీపీ ఎస్‌.ఎస్‌.చతుర్వేది, సీఆర్‌పీఎఫ్‌ సౌత్‌ జోన్‌ అదనపు డీజీ నళిన్‌ప్రభాత్, సదరన్‌ సెక్టార్‌ ఐజీ మహేష్‌చంద్ర లడ్డా, కుంట డీఐజీ రాజీవ్‌కుమార్‌ ఠాకూర్, డీఐజీ ఎస్‌.ఎన్‌.మిశ్రా ఈ పర్యటనలో పాల్గొన్నారు. 

ప్రత్యేకంగా క్యాంపులు
సీఆర్‌పీఎఫ్‌ క్యాంపు ప్రారంభించిన అనంతరం డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ, నక్సల్స్‌ నిర్మూలన కోసం కేంద్ర హోం శాఖ, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో బలగా లను పటిష్టం చేసేందుకు ప్రత్యేకంగా క్యాంపులను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా చెన్నాపురం, పూసుగుప్ప, ఉంజుపల్లి, చెలిమల, తిప్పాపురం, కలివేరులో క్యాంపులు ఏర్పాటుచేయగా, జిల్లా పోలీసు యంత్రాంగం, సీఆర్‌పీఎఫ్‌ బలగాల సమన్వయంతో ఛత్తీస్‌గఢ్‌ – తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలపై నిఘా మరింత పటిష్టమవుతుందని వెల్లడించారు.

కాగా, అమాయకపు ఆదివాసీ గిరిజనులపై దుశ్చర్యలకు పాల్పడుతున్న మావోయిస్టులు తెలంగాణలో ఆదరణ కోల్పోయారని మహేందర్‌రెడ్డి పేరొన్నారు. సీఆర్‌పీఎఫ్‌ డీజీపీ కుల్‌దీప్‌సింగ్‌ మాట్లాడుతూ మావోయిస్టులకు అడ్డుకట్ట వేయడంలో తెలంగాణ – ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతాల పోలీసుల పనితీరు అభినందనీయమని తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top