‘క్లినిక్‌’లతో లక్షలాది ఆర్మీ కుటుంబాలకు లబ్ధి | telangana chief justice inaugurates legal aid clinics for ex servicemen | Sakshi
Sakshi News home page

‘క్లినిక్‌’లతో లక్షలాది ఆర్మీ కుటుంబాలకు లబ్ధి

Aug 27 2025 1:50 AM | Updated on Aug 27 2025 1:50 AM

telangana chief justice inaugurates legal aid clinics for ex servicemen

‘ఏక్‌ ముఠ్టీ ఆస్మాన్‌’ సీడీని ఆవిష్కరిస్తున్న సీజే అపరేశ్‌కుమార్‌ సింగ్‌. చిత్రంలో జస్టిస్‌ శామ్‌కోషి, సీహెచ్‌ పంచాక్షరి

టీఎస్‌ఎల్‌ఎస్‌ఏ పాట్రన్‌ ఇన్‌ చీఫ్‌ జస్టిస్‌ ఏకే సింగ్‌ 

సైనికులపై న్యాయవ్యవస్థ నిబద్ధతకు నిదర్శనమని వెల్లడి 

సమగ్ర న్యాయ సాయమే లక్ష్యమన్న జస్టిస్‌ శామ్‌కోషి 

8 జిల్లాల్లో ఉచిత న్యాయ సేవల క్లినిక్‌లు ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌: ఉచిత న్యాయ సేవల క్లినిక్‌తో దేశవ్యాప్తంగా లక్షలాది ఆర్మీ కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని టీఎస్‌ఎల్‌ఎస్‌ఏ పాట్రన్‌ ఇన్‌ చీఫ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌ అన్నారు. సైనికులపట్ల న్యాయవ్యవస్థకు ఉన్న నిబద్ధతకు ఈ క్లినిక్‌లు నిదర్శనమని చెప్పారు. వీర పరివార్‌ సహాయత యోజన–2025 కింద దేశవ్యాప్తంగా ఉచిత న్యాయ సేవల క్లినిక్‌ల ద్వారా సేవలు అందించాలని నేషనల్‌ లీగల్‌ సర్విసెస్‌ అథారిటీ (నల్సా) నిర్ణయించిన విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా హైకోర్టు ఆవరణలోని లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆన్‌లైన్‌ ద్వారా 8 జిల్లాల్లో క్లినిక్‌లను టీఎస్‌ఎల్‌ఎస్‌ఏ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ జస్టిస్‌ పి.శామ్‌ కోషితో కలసి సీజే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని సాయుధ దళాల సభ్యులు, వారి కుటుంబాలకు న్యాయ సాయం అందించడంలో ఇదో కీలక ముందడుగు అన్నారు. గతంలో ఏర్పాటు చేసిన రెండు క్లినిక్‌లతో కలిపి ఉమ్మడి జిల్లాలవారీగా కేంద్రాలు ఏర్పాటయ్యాయని.. మిగిలిన జిల్లాలకు కూడా

క్లినిక్‌లను విస్తరిస్తామని చెప్పారు. న్యాయ సాయంతోపాటు న్యాయ సూచనలు కూడా ఈ క్లినిక్‌లలో అందిస్తామని వివరించారు. గత నెల 26న రెండు క్లినిక్‌లు ప్రారంభమవగా తాజాగా మరో 8 క్లినిక్‌లు ఏర్పాటు కావడం అథారిటీ చొరవకు నిదర్శనమని కొనియాడారు. అనంతరం జస్టిస్‌ శామ్‌ కోషి మాట్లాడుతూ రక్షణ సిబ్బంది, మాజీ సైనికులు, వారి కుటుంబాలకు సమగ్ర న్యాయ సాయం అందించడమే క్లినిక్‌ల లక్ష్యమన్నారు.

ఆస్తి, కుటుంబ వివాదాలు, పింఛన్, సంక్షేమ పథకాలు పొందడంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారంలో క్లినిక్‌లు కీలకపాత్ర పోషిస్తాయని చెప్పారు. ప్రతి మొదటి, నాలుగో శనివారం ఈ క్లినిక్‌లు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ సందర్భంగా తెలుగులోకి అనువదించిన నల్సా థీమ్‌ సాంగ్‌ ‘ఏక్‌ ముఠ్టీ ఆస్మాన్‌’ను న్యాయమూర్తులు విడుదల చేశారు. కార్యక్రమంలో రిజి్రస్టార్‌ గోవర్ధన్‌రెడ్డి, అథారిటీ సభ్య కార్యదర్శి సీహెచ్‌ పంచాక్షరీ నేరుగా హాజరుకాగా జిల్లా ప్రిన్సిపల్‌ జడ్జీలు, ప్రాంతీయ సైనిక్‌ వెల్ఫేర్‌ బోర్డుల అధికారులు, మాజీ సైనికులు, సైనిక్‌ వెల్ఫేర్‌ కార్యాలయ సిబ్బంది ఆన్‌లైన్‌ ద్వారా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement