ఫ్యూచర్ సిటీ స్వరూపం ఇలా..
హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌కు దీటుగా నాలుగో నగరం ఆవిష్కృతం కాబోతోంది. ఇటు శ్రీశైలం, అటు నాగార్జునసాగర్ జాతీయ రహదారుల మధ్యలో ఉన్న ఏడు మండలాలు.. 56 గ్రామ పంచాయతీలతో సుమారు 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (future city urban development authority) పేరుతో మరో అద్భుత నగరం ఆవిష్కరణకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ మేరకు గురువారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ తీర్మానం చేసింది. అంతేకాదు.. ఇప్పటి వరకు ఓఆర్‌ఆర్ నుంచి ఆర్‌ఆర్‌ఆర్ మధ్యలో హెచ్‌ఎండీఏ (HDMA) పరిధిలో ఉన్న 36 గ్రామాలను కూడా కొత్త గా ఏర్పాటు చేసే ఎఫ్‌డీసీఏలో విలీనం చేయనున్నట్లు ప్రకటించింది.
ఫ్యూచర్‌సిటీ అభివృద్ధి కోసం కొత్తగా 90 పోస్టులను సృష్టించడమే కాకుండా, వాటి భర్తీకి ఆమోదం కూడా తెలిపింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ శంకుస్థాపనతో ఇప్పటికే ఈ ప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్నంటాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఆ ధరలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ 13 నుంచి మీర్‌ఖాన్‌పేట మీదుగా ఆర్‌ఆర్‌ఆర్ (RRR) వరకు నిర్మించతలపెట్టిన 300 ఫీట్ల గ్రీన్‌ఫీల్డ్ (రతన్‌టాటా) రోడ్డుకు భూసేకరణ చేపట్టింది. తొలి దశలో 19.2 కిలోమీటర్లకు రూ.1,665 కోట్లు కేటాయించింది. అదే విధంగా రెండో విడతలో 22.30 కిలోమీటర్ల దూరంలో చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులకు రూ.2,365 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే.
హెచ్‌ఎండీఏ పరిధిని పెంచుతూ మంత్రివర్గం ఆమోదం
హైదరాబాద్ మహా నగర పరిధి విస్తరణకు గురువారం మంత్రివర్గం (Telangana Cabinet) ఆమోద ముద్ర వేసింది. దీంతో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధి రీజినల్ రింగ్‌రోడ్డు వరకు పెరగనుంది. ఈ మేరకు గురువారం మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం 7 జిల్లాలు, 7,257 చదరపు కిలోమీటర్లు ఉన్న హెచ్‌ఎండీఏ పరిధి తాజా నిర్ణయంతో సుమారు 11,000 చదరపు కిలోమీటర్ల నుంచి 12,000 చ.కి.మీ వరకు పెరగనుంది. ఇప్పుడు 70 మండలాలు, సుమారు 1000 గ్రామ పంచాయతీలు, మరో 8 కార్పొరేషన్‌లు, 38కి పైగా మున్సిపాలిటీలు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్నాయి. కొత్తగా ట్రిపుల్ ఆర్ వరకు విస్తరించడం వల్ల మరో 4 జిల్లాల పరిధిలోని 32 మండలాలు చేరనున్నాయి. దీంతో 11 జిల్లాలు, 106 మండలాలు, సుమారు 1400కు పైగా గ్రామాలతో హెచ్‌ఎండీఏ పరిధి భారీగా పెరగనుంది.
హెచ్‌ఎండీఏ పరిధి పెరగడం వల్ల ట్రిపుల్ ఆర్ పరిధిలో శాటిలైట్ టౌన్‌షిప్పుల నిర్మా ణం జరిగే అవకాశం ఉంది. కొంతకాలంగా స్తబ్దత నెలకొన్ని ఉన్న రియల్ ఎస్టేట్ రంగంలో కదలిక వచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయ సంస్థలు సైతం భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావచ్చని అంచనా.
చదవండి: మల్కాజిగిరి రైల్వే స్టేషన్ న్యూ లుక్ అదరింది
ఔటర్‌రింగ్‌రోడ్డు వరకు ఉన్న నగరాన్ని కోర్ అర్బన్‌గా, ఔటర్‌రింగ్ రోడ్డు నుంచి ట్రిపుల్ ఆర్ వరకు ఉన్న ప్రాంతాన్ని సెమీ అర్బన్‌గా, మిగతా ప్రాంతాన్ని రూరల్ తెలంగాణగా పరిగణిస్తారు. ఈ మేరకు సెమీ అర్బన్ వరకు సమగ్రమైన మాస్టర్ ప్లాన్ ను రూపొందించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఔటర్ నుంచి ట్రిపుల్ ఆర్‌కు వెలుపల మరో 5 కిలోమీటర్ల వరకు హెచ్‌ఎండీఏ పరిధి పెరగనుంది. ప్రస్తుతం 11 జిల్లాలకు పరిధిని పెంచడం వల్ల నల్లగొండ, నాగర్‌కర్నూల్, వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలు కొత్తగా చేరనున్నాయి.


