రాష్ట్రంలో క్రీడా విధానమేదీ?

Telangana: BJP to oppose handing over of land to TIMS - Sakshi

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి ఓ క్రీడా విధానమంటూ లేకపోవడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నిం చారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి చర్యలు తీసుకోకపోగా గచ్చిబౌలి స్టేడియంలోని స్థలాన్ని ఇతర సంస్థలకు ఇవ్వడానికి కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గచ్చిబౌలి స్టేడియం టవర్‌లో టిమ్స్‌ ఆస్పత్రి అభివృద్ధి చెందాలని అనుకున్నామన్నారు.

అయితే దానికి భిన్నంగా స్టేడియం మధ్యలో ఐదెకరాల స్థలాన్ని టిమ్స్‌కు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించి, సంబంధం లేని వ్యక్తులతో పంచనామాపై సంతకం చేయించారని విమర్శించారు. దీన్ని అడ్డుపెట్టుకుని ఈ ప్రాంతం లోని 25 ఎకరాల స్థలాన్ని ఇతరులకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. దీనిపై మంగళవారం నుంచి క్రీడాకారులు, క్రీడా ప్రేమికులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.

హైదరాబాద్‌లోని స్టేడియాలని అభివృద్ధి చేయాల్సింది పోయి సీఎం నియోజకవర్గం గజ్వేల్‌లో రూ.50 కోట్లతో స్టేడియం, ఆర్థికమంత్రి హరీశ్‌రావు నియోజకవర్గం సిద్దిపేటలో, మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో స్టేడియాలు మంజూరు చేసుకోవడం ఏంటని రఘునందన్‌రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో 25 వేల ఎకరాల్లో క్రీడా గ్రామాన్ని నిర్మిస్తామని సీఎం కేసీఆర్‌ ఏడేళ్ల కిందట చేసిన ప్రకటన ఏమైందని నిలదీశారు. మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌కు, క్రీడలకు ఏం సంబంధం? ఒలింపిక్‌ అసోసియేషన్‌లో ఆయన ఎందుకు వేలు పెట్టారని నిలదీశారు. ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఎన్నికై 20 నెలలు దాటినా ఎందుకు బాధ్యతలు తీసుకోలేదని రఘునందన్‌రావు ప్రశ్నించారు.     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top