 
													సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపడుతున్న ‘దళితబంధు’ పథకంపై ఈనెల 26న ప్రగతిభవన్ వేదికగా అవగాహన సదస్సు జర గనుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సదస్సు సీఎం కేసీఆర్ అధ్యక్షతన సాయంత్రం వరకు కొనసాగుతుంది. ఈ పథకాన్ని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రా రంభించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో ఆ నియోజకవర్గానికి చెందిన 412 మంది దళితు లు, మరో 15 మంది రిసోర్స్ పర్సన్లు కలిపి మొత్తం 427 మంది సదస్సులో పాల్గొంటారు. నియోజక వర్గంలోని ప్రతీ గ్రామం, మున్సిపాలిటీల్లోని ప్రతీ వార్డు నుంచీ నలుగురు చొప్పున దళితులు సదస్సుకు హాజరవుతారు. గ్రామాలు, మున్సిపల్ వార్డుల నుంచి వచ్చే నలుగురిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషుల చొప్పున ఉంటారు.
బస్సుల్లో హుజూరాబాద్ టు ప్రగతిభవన్
సదస్సుకు హాజరయ్యే దళిత ప్రతినిధులు ఈ నెల 26న తమ గ్రామాల నుంచి బయల్దేరి ఉదయం 7 గంటలకు తమ మండల కేంద్రాలకు చేరుకుం టారు. అల్పాహారం చేసి ప్రభుత్వం ఏర్పాటుచేసిన బస్సుల్లో హుజూరాబాద్‌కు చేరుకుని అంబేడ్కర్ విగ్రహానికి నివాళి అర్పిస్తారు. అక్కడ నుంచి ప్రత్యేక బస్సుల్లో బయల్దేరి ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్‌కు చేరుకుంటారు. దళితబంధు పథకం ఉద్దేశం, పథకం అమలుతీరు, పర్యవేక్షణ, నిర్వహ ణ తదితరాలపై వీరికి సదస్సులో అవగాహన కల్పి స్తారు. హుజూరాబాద్‌లో ప్రారంభమయ్యే దళిత బంధు పథకం అమలులో దళితులు పోషించాల్సిన పాత్ర, దళితుల్లోకి తీసుకెళ్లాల్సిన తీరుపై సీఎం వివరిస్తారు. ప్రగతిభవన్‌లో మధ్యాహ్న భోజన విరామం తర్వాత కూడా అవగాహన కార్యక్రమం సాయంత్రం వరకు కొనసాగుతుంది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
