ముద్ర రుణాల్లో వెనుకంజలో తెలుగు రాష్ట్రాలు | Telangana and Andhra Pradesh lags in Mudra loan disbursal | Sakshi
Sakshi News home page

ముద్ర రుణాల్లో వెనుకంజలో తెలుగు రాష్ట్రాలు

May 10 2026 4:37 AM | Updated on May 10 2026 4:37 AM

Telangana and Andhra Pradesh lags in Mudra loan disbursal

జాతీయ సగటుతో పోలిస్తే ఖాతాల సంఖ్య దాదాపు సగమే 

పొరుగున ఉన్న రాష్ట్రాల కంటే వెనుకబడిన ఏపీ, తెలంగాణ  

సాక్షి, హైదరాబాద్‌: ముద్ర రుణాల మంజూరులో తెలుగు రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతోంది. జనాభా ప్రాతిపదికన జాతీయ సగటుతో పోలి­స్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మంజూరైన ముద్ర ఖాతాల సంఖ్య దాదాపు సగమే. దీంతో రుణాలు అందక ఔత్సాహిక యువత ఉపాధి అవకాశాలను కోల్పోతున్నారు. చిరు వ్యాపారులు తదుపరి వ్యాపార విస్తరణ చేపట్టలేక పోతున్నారు. 

100 మందికి 21 ఖాతాలు.. 
ప్రధానమంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) పథ­కం ద్వారా చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా విస్తరించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి తనఖా లేకుండా రుణాలను అందిస్తోంది. 2015 ఏప్రిల్‌ 8 నుంచి 2026 జనవరి 2 మధ్య 56.31 కోట్ల ఖాతాలకుగాను రూ.37.31 లక్షల కోట్ల రుణాలు మంజూరు అయ్యాయి. 70% మంది లబ్ధిదారులు మహిళలు కావడం విశేషం. మొ­త్తం జనాభా ప్రాతిపదికన చూస్తే దేశవ్యాప్తంగా ముద్ర ఖాతాల సంఖ్య 39.88 శాతం ఉంది. అంటే 100 మందికి దాదాపు 40 లోన్లు జారీ అయినట్టు.

వాస్తవానికి ఇదొక రికార్డు. అయితే, తెలంగాణలో 21.44 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 21.04­శాతం.. అంటే ఒక్కో రాష్ట్రంలో 100 మందికిగాను 21 లోన్లే అందాయంటే మన తెలుగు రాష్ట్రాలు ఏ స్థాయిలో వెనుకంజలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అదే పొరుగున ఉన్న తమిళనాడు, కర్నాటక, ఒడిశాలు జనాభా ప్రాతిపదికన అత్యధిక ఖాతాలతో టాప్‌–3లో ఉండడం గమనార్హం. టాప్‌–10 జాబితాలోనూ తెలుగు రాష్ట్రాలకు చోటు దక్కలేదు. 

పీఎంఎంవై ప్రారంభం నుంచే.. 
ముద్ర రుణాలు విరివిగా లభిస్తే డెయిలీ, నకిలీ ఫైనాన్స్‌లకు అడ్డుకట్ట పడుతుందన్నది జనం మా­ట. కనీ­సం ఐదు ముద్ర ఖాతాలు లేని గ్రామాలు వేలాదిగా ఉన్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ నిర్దేశించిన లక్ష్యాల మే­ర­కే రుణాలు మంజూరు చేస్తున్నట్టు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో బ్యాంకుల ఉన్నతాధికారులు తేల్చి చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు ముద్ర రుణాలు తక్కువగా మంజూరు అవుతున్నాయని పలు సంఘా­లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు సమర్పించినా ఫలితం లేకపో­యింది. పీఎంఎంవై ప్రారంభం నుంచే తెలంగాణ, ఏపీకి తక్కువ కేటాయింపులు జరగడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్న విమర్శలు ఉన్నాయి.  

Advertisement
 
Advertisement
Advertisement