రాష్ట్రంలో కొత్తగా 61 డయాలసిస్‌ సెంటర్లు 

Telangana: 61 New Dialysis Centres To Come Up Across Districts - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కిడ్నీ ఫెయిల్యూర్‌ రోగులకు డయాలసిస్‌ సౌకర్యాన్ని కల్పించడానికి కొత్తగా 61 డయాలసిస్‌ సెంటర్లను నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటి ద్వారా రాష్ట్రంలో 515 డయాలసిస్‌ పరికరాలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో సుమారు 10వేలకు పైగా కిడ్నీ బాధితులుంటారని అంచనా. తాజా నిర్ణయంతో వీరందరికీ లబ్ధి చేకూరనుంది.

కొత్తగా మంజూరు చేసిన 61కేంద్రాల్లో ఐదింటిని యుద్ధప్రాతిపదికన అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందులో ఒక్కోదాంట్లో 5 డయాలసిస్‌ పరికరాల చొప్పున నెలకొల్పనున్నారు. నాగార్జునసాగర్‌లోని కమలానెహ్రూ ప్రాంతీయ ఆసుపత్రి, సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి, హుస్నాబాద్‌ సామాజిక ఆరోగ్య కేంద్రం, జగిత్యాల జిల్లాలోని ధర్మపురి ప్రాంతీయ ఆసుపత్రి, రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్‌ సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ముందుగా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అవసరమైన చర్యలు తక్షణమే చేపట్టాలని వైద్య విధాన పరిషత్‌ కమిషనర్, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీకి వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top