
తెరపైకి మళ్లీ వివాదాస్పద ఉత్తర్వులు
గెజిటెడ్ హెచ్‌ఎం స్కూల్‌కు ఎస్‌ఏలకు అధికారం
గతంలో ఇదే తరహా ఉత్తర్వులు...టీచర్ల నుంచి వ్యతిరేకత
మధ్యలో ఆపేసిన ప్రభుత్వం.. మళ్లీ అవే ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసే అధికారం ఉపాధ్యాయులకు ఇస్తూ విద్యాశాఖ మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల వారీగా బృందాలను ఏర్పాటు చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలు ఇచ్చారు. ప్రాథమిక పాఠశాలలకు 168, ప్రాథమికోన్నత పాఠశాలలకు 35, ఉన్నత పాఠశాలలకు 96 బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ఆయా స్థాయిల ప్రధానోపాధ్యాయుడు నోడల్ అధికారిగా, సెకండరీ గ్రేడ్ టీచర్లు సభ్యులుగా ఉంటారు. ప్రైమరీ, ప్రాథమికోన్నత పాఠశాలల్లో వేసే కమిటీల్లో ముగ్గురు, హైస్కూల్ స్థాయిలో 9 మంది సభ్యులు ఉంటారు.
ప్రస్తుతం ప్రతీ మండల పరిధిలో స్కూళ్ల తనిఖీకి కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, మండల విద్యాశాఖాధికారులు పనిచేస్తున్నారు. తాజా కమిటీలు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఏర్పడతాయి. ఏప్రిల్ 4వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ నేపథ్యంలో పాఠశాల తనిఖీలు విస్తృతం చేయాలని, ఇవి నిరంతరంగా ఉండాలని పేర్కొన్నారు. దీంతో తనిఖీలకు ఉపాధ్యాయులనే నియమించేందుకు విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది.
కమిటీలు ఏం చేస్తాయి?
పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, మధ్యాహ్న భోజన నిర్వహణ, ఉపాధ్యాయుల హాజరు ఏ విధంగా ఉంది? ఎప్పుడు వస్తున్నారు ? బోధన ప్రణాళికను ఎలా అమలు చేస్తున్నారు? విద్యార్థుల హాజరు శాతం? ఇతర ప్రధాన కార్యక్రమాలు ఎలా అమలు చేస్తున్నారు? అనే అంశాలను ఈ కమిటీలు పరిశీలిస్తాయి. ఆ వివరాలను జిల్లా విద్యాశాఖ అధికారులకు అందిస్తాయి. జిల్లా అధికారులు ప్రతీ నెలా 5వ తేదీన రాష్ట్ర విద్యాశాఖ ప్రధాన కార్యాలయానికి వాటిని పంపుతారు. కలెక్టర్ల సమావేశంలో ప్రతీనెలా ప్రభుత్వం ఈ అంశాలపై చర్చిస్తుంది. కమిటీల్లో ఎంపికయ్యే టీచర్లు ఏడాదిపాటు ఇదే పనిలో ఉంటారు. బోధన చేపట్టాల్సిన అవసరం ఉండదు.
– పర్యవేక్షణ కమిటీ కోసం ఎంపిక చేసే టీచర్లు కనీసం పదేళ్ల పాటు టీచర్‌గా ప్రభుత్వ స్కూళ్లల్లో పనిచేసిన అనుభవం ఉండాలి. ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎంలు, లేదా ఎస్‌జీటీలను నియమిస్తారు. వీరు ప్రతీ రోజు రెండు స్కూళ్లను విధిగా తనిఖీ చేయాలి.
– ప్రాథమికోన్నత పాఠశాలలకు ఎంపిక చేసే టీచర్లు కూడా పదేళ్ల అనుభవం కలిగి ఉండాలి. స్కూల్ అసిస్టెంట్లను నియమిస్తారు. వీరు రోజుకు రెండు స్కూళ్లను తనిఖీ చేయాలి.
– ఉన్నత పాఠశాలలకు కూడా పదేళ్ల అనుభవం ఉన్న స్కూల్ అసిస్టెంట్లు అర్హులు. వీరు రోజూ ఒక స్కూల్‌ను, మూడు నెలల్లో 50 స్కూళ్లను తనిఖీ చేయాలి.
కొంతకాలం బ్రేక్ తర్వాత.. మళ్లీ
వాస్తవానికి పాఠశాలల తనిఖీకి ఉపాధ్యాయులను నియమిస్తూ జూన్ 21వ తేదీన విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. వీటిపై ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. స్కూల్ అసిస్టెంట్ స్థాయి టీచర్.. గెజిటెడ్ హెచ్‌ఎం పనిచేసే స్కూల్‌ను తనిఖీ చేయడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇప్పటికే కాంప్లెక్స్ హెచ్‌ఎం, ఎంఈఓలతో పాటు అభ్యసన సామర్థ్య పరిశీలనకు ప్రత్యేకంగా ఐదు స్థాయిల అధికారులను నియమించారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఇంకెన్ని తనిఖీ వ్యవస్థలను ఏర్పాటు చేస్తారని పలు సంఘాలు విద్యాశాఖ కార్యదర్శి వద్ద అభ్యంతరం తెలిపాయి. ఇప్పటికే స్కూళ్లల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఉందని, కొత్త కమిటీల వల్ల ప్రతీ జిల్లాలోనూ రెండు శాతం టీచర్లు తనిఖీ అధికారులుగా వెళతారని తెలిపారు. దీంతో ఇచ్చిన ఉత్తర్వులను మధ్యలో నిలిపివేశారు. తనిఖీలు చేపట్టాల్సిందేనని, టీచర్లే తనిఖీలు చేస్తే వాస్తవాలు తెలుస్తాయని ఉన్నతాధికారులు భావించారు. దీంతో మళ్లీ తనిఖీ బృందాల ఏర్పాటుకు ఆదేశాలిచ్చారు.