ముంపు సమస్యను ముగిద్దాం 

Talasani Srinivas Yadav Meeting On Begumpet Nala In Office Of The Municipal Administration - Sakshi

శాశ్వత చర్యలే ఇందుకు మార్గం  పేదల ఇళ్ల రెగ్యులరైజేషన్‌కు చర్యలు  ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశంలో మంత్రి తలసాని  

సాక్షి, సిటీబ్యూరో: బేగంపేట నాలా పొంగిపొర్లినప్పుడు ముంపు బారిన పడుతున్న బ్రాహ్మణవాడి, అల్లంతోటబావి, ప్రకాశ్‌నగర్‌ తదితర ప్రాంతాల ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం నాలాకు ఇరువైపులా రిటైనింగ్‌ వాల్‌ నిర్మించడమే కాక ఆయా కాలనీల్లో వరదనీటి కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణం వంటివి చేపట్టాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎస్‌ఎన్‌డీపీ (వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం), జలమండలి అధికారులు సమన్వయంతో ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా సూచించారు. శుక్రవారం మునిసిపల్‌ పరిపాలనశాఖ కార్యాలయంలో ఆ శాఖ స్పెషల్‌చీఫ్‌ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌తో కలిసి జీహెచ్‌ఎంసీ, జలమండలి, ఎస్‌ఎన్‌డీపీ, రెవెన్యూ, ఎండోమెంట్స్‌ తదితర శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముషీరాబాద్‌ మండలం భోలక్‌పూర్‌లోని సోమప్ప మఠానికి చెందిన 3571 గజాల స్థలంలో ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న దాదాపు 130 కుటుంబాలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. వారిలో 53 కుటుంబాలకు 1996లోనే పట్టాలు కూడా ఇచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా జీరా కాంపౌండ్‌లోని దాదాపు 70 కుటుంబాలకు కూడా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెబుతూ, ఎండోమెంట్స్‌కు చెందిన ఆ స్థలాన్ని జీహెచ్‌ఎంసీ స్వాధీనం చేసుకునేందుకు అవసరమైన పరిహారాన్ని చెల్లించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
  
ఆ గృహాలకు ఓకే..
రాంగోపాల్‌ పేట డివిజన్‌లోని 134 గృహాలకు సంబంధించిన రెగ్యులరైజేషన్‌కు మునిసిపల్‌ మంత్రి కేటీఆర్‌ అధ్యక్షతన ఇటీవల సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం సానుకూలత వ్యక్తం చేసిందని తెలిపారు. వీటితోపాటు న్యూ బోయగూడ, హైదర్‌ బస్తీ,మోండామార్కెట్‌ డివిజన్‌లోని శంకర్‌స్ట్రీట్,  సజ్జన్‌లాల్‌స్ట్రీట్, రాంగోపాల్‌ పేట డివిజన్‌ లోని వెంగళరావునగర్, సనత్‌ నగర్‌ డివిజన్‌లోని శ్యామల కుంట తదితర ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలకు ఆ స్థలాల రెగ్యులరైజేషన్‌కు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు సూచించారు.

మోండా మార్కెట్, ఓల్డ్‌ జైల్‌ ఖానా భవనాలను మోజంజాహీ మార్కెట్‌ తరహాలో ఆకర్షణీయంగా తీర్చిదిద్దే పనులకు కార్యాచరణ రూపొందించాలన్నారు. సనత్‌నగర్‌ ఇండస్ట్రియల్‌ ఏరియాలో అండర్‌పాస్, ఫతేనగర్‌ వంతెన విస్తరణ, రాణిగంజ్‌ రైల్వే బ్రిడ్జి పనులు చేపట్టేందుకు రైల్వే, జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి పర్యటించనున్నట్లు తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top