
తెరపైకి ఏపీ సరికొత్త వాదన
కేవలం 200 టీఎంసీల తరలింపునకే గోదావరి–బనకచర్ల అనుసంధానం
బొల్లపల్లి రిజర్వాయర్ సామర్థ్యం 200 టీఎంసీలకు పెంచుకోవచ్చు
బనకచర్లపై సీడబ్ల్యూసీ కొర్రీలకు ఏపీ ప్రభుత్వ సమాధానాలు
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు వద్ద 75 శాతం నీటిలభ్యత ఆధారంగా 2,191 టీఎంసీల నీరు ఉండగా, 50 శాతం వార్షిక నీటిలభ్యత విశ్లేషణల ఆధారంగా అక్కడ తమ రాష్ట్రానికి 2,842 టీఎంసీల నీరు ఉందని ఏపీ ప్రభుత్వం సరికొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చింది. 75 శాతం లభ్యత ఆధారంగా గోదావరి ట్రిబ్యునల్ జరిపిన కేటాయింపుల మేరకు ఎగువ రాష్ట్రాలన్నీ తమ నీటి వాటాలను పూర్తిస్థాయిలో వాడుకున్నా, పోలవరం వద్ద 651 (2842–2191) టీఎంసీల మిగులు జలాల లభ్యత ఉంటుందని అభిప్రాయపడింది.
తాము కేవలం 200 టీఎంసీల జలాల తరలింపు కోసమే గోదావరి–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును ప్రతిపాదించినట్టు స్పష్టం చేసింది. బేసిన్ పరిధిలోని అన్ని రాష్ట్రాలు తమ ప్రస్తుత అవసరాల మేరకు నీటిని వాడుకున్నా ఏటా సగటున 3,000 టీఎంసీల గోదావరి నీరు పోలవరం ప్రాజెక్టు నుంచి సముద్రంలోకి కలిసిపోతున్నాయని పేర్కొంది.
ఏపీ ప్రభుత్వం సమర్పించిన బనకచర్ల ప్రాజెక్టు ప్రీఫిజిబిలిటీ రిపోర్టు (పీఎఫ్‌ఆర్)పై కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) లేవనెత్తిన అభ్యంతరాలు, సందేహాలకు వివరణలిస్తూ ఈ నెల 14న ఆ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. 75 శాతం లభ్యత ఆధారంగా గోదావరి ట్రిబ్యునల్ జరిపిన కేటాయింపుల మేరకు బేసిన్ పరిధిలోని మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు తమ పూర్తి వాటా జలాలను వాడుకుంటే బనకచర్ల ప్రాజెక్టుకు నీటిలభ్యత ఉంటుందా? అని సీడబ్ల్యూసీ లేవనెత్తిన ప్రశ్నకు ఏపీ ప్రభుత్వం పైవిధంగా బదులిచ్చింది.
వరద జలాలంటే.. మిగులు జలాలే
బనకచర్ల ప్రాజెక్టు ద్వారా 18,000 క్యూసెక్కుల వరద జలాలను కృష్ణానది (ప్రకాశం బరాజ్)కి తరలిస్తామని ఏపీ ప్రతిపాదించగా.. వరద జలాలను ఎలా నిర్వచిస్తారు? ఎలా లెక్కిస్తారు? ఈ మేరకు వరద జలాల తరలింపునకు గోదావరి ట్రిబ్యునల్ తీర్పు అంగీకరిస్తుందా? అని సీడబ్ల్యూసీ కొర్రీలు వేయగా, వరద జలాలు అంటే మిగులు జలాలే అని ఏపీ కొత్త భాష్యం చెప్పింది. 75 శాతం లభ్యత ఆధారంగా బేసిన్ పరిధిలోని అన్ని రాష్ట్రాలకు కేటాయించిన జలాలు పోగా అదనంగా లభ్యతలోకి ఉండే మిగులు జలాలే వరద జలాలని ఏపీ సర్కారు నిర్వచించింది.
గోదావరి ట్రిబ్యునల్ తీర్పునకు అనుగుణంగానే బనకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదించినట్టు సమర్థించుకుంది. 75 శాతం లభ్యతకు మించి పోలవరం వద్ద ఉండే జలాలను మిగులు వరద జలాలుగా పరిగణించినట్టు తెలిపింది. గోదావరి ట్రిబ్యునల్ తీర్పులో వరద జలాల ప్రస్తావన లేకపోవడం.. బేసిన్‌లో చివరి రాష్ట్రాలకు ఆ జలాలను వాడుకునే హక్కును నిషేధించదని స్పష్టం చేసింది.
2000–2015 మధ్యలోని 15 ఏళ్లలో ఏటా పోలవరం ప్రాజెక్టు నుంచి సముద్రంలోకి విడుదల చేసిన జలాల మొత్తం నుంచి ఎగువ రాష్ట్రాలు వాడుకోని జలాల వాటాను తీసివేయగా, మిగిలే జలాలను లెక్కించి వాటి లభ్యత ఆధారంగా బనకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదించినట్టు తెలిపింది.
మా రాష్ట్రానికి వచ్చే జలాలు మావే...
ఎగువ రాష్ట్రాలన్నీ తమ వాటా జలాలను వాడుకోగా తమ భూభాగంలోకి ప్రవేశించే మిగులు జలాలను వాడుకునే హక్కు బేసిన్‌లో చివరి రాష్ట్రంగా తమకు ఉంటుందని ఏపీ స్పష్టం చేసింది. న్యాయపరంగా, హైడ్రాలజికల్ సిద్ధాంతాల పరంగా బేసిన్ చివరి రాష్ట్రాలు మిగులు జలాలను వాడుకోవడం ఎగువ రాష్ట్రాల హక్కులను హరించినట్టు కాదని తేల్చి చెప్పింది.
నిల్వ సామర్థ్యం 200 టీఎంసీలకు పెంచుకోవచ్చు..
ప్రణాళిక సంఘం సిఫారసుల ఆధారంగా 2010లో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం సాగునీటి ప్రాజెక్టులు కనీసం 75 శాతం లక్ష్యాలను సాధించాల్సి ఉంటుందని, బనకచర్ల ప్రాజెక్టు ద్వారా రోజూ 2 టీఎంసీల జలాలను తరలించాలనే లక్ష్యాన్ని ఎలా సాధిస్తారని సీడబ్ల్యూసీ ఏపీని ప్రశ్నించింది.
75–50 శాతం లభ్యత ఆధారంగా పోలవరం ప్రాజెక్టు వద్ద అందుబాటులో ఉండే మిగులు వరద జలాల ఆధారంగా ఈ ప్రాజెక్టును ప్రతిపాదించామని, బొల్లపల్లి వద్ద నిర్మించనున్న జలాశయంలోకి 152 టీఎంసీలను నిల్వ చేస్తామని ఏపీ బదులిచ్చింది. నాలుగు వైపులా కొండలు ఉండడంతో ఈ జలాశయ సామర్థ్యాన్ని 200 టీఎంసీలకు పెంచుకోవచ్చని తెలిపింది.