
అభిప్రాయం
కాళేశ్వరం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలోని తప్పులనే చంద్రబాబు ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో చేస్తోంది. తెలంగాణలో నాణ్యతా ప్రమాణాలను తుంగలో తొక్కి, భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు అయిన కాళేశ్వరంలో భాగంగా అనేక బ్యారేజీల నిర్మాణాలను మూడేళ్లలో పూర్తి చేసి కేసీఆర్ ప్రారంభించారు. ఇదే అడుగుజాడల్లో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నడుస్తూ 2027 నాటికి పోలవరం ప్రారంభిస్తామని డెడ్ లైన్ ప్రకటించడం ఆందోళనకరం.
2014లో తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక నీరు లేదనే సాకుతో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును రద్దు చేశారు. రీ–ఇంజ నీరింగ్, రీ–డిజైనింగ్ పేరిట మేడిగడ్డకు మార్చారు. అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు నిర్మించారు. బడ్జెట్‌ను లక్ష కోట్లకు చేర్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు 2016లో మొదలుపెట్టి, 2019లో ప్రారంభించారు. 4 ఏళ్ల లోపే, అసెంబ్లీ ఎన్నికల ముందే 2023 అక్టోబర్ 21న ఏడవ బ్లాకులోని కొన్ని పియర్లు ఐదు అడుగుల లోతుకు పైగా కుంగిపోయాయి.
ఏడవ బ్లాక్‌లోని మొత్తం 11 పియర్లను కూల్చి నిర్మించడం తప్ప మరో గతి లేదని జాతీయ డ్యామ్ రక్షణ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) పేర్కొంది. మళ్లీ నిర్మించినా, మరో బ్లాక్ లోని పియర్ల గేట్లు కుంగిపోవనే గ్యారెంటీ లేదు. అన్నారం,సుందిళ్ల బ్యారేజీలో పునాది అడుగున కూడా లీకేజీలు, సీపేజీలు బయటపడ్డాయి. ఎన్డీఎస్‌ఏ అత్యున్నత స్థాయి ఇంజనీర్ల బృందం కుంగిన మేడిగడ్డను పరిశీలించింది. నీటిని నిలువ ఉంచితే ప్రమాదమని, అత్యవసరంగా అన్ని బ్యారేజీలలో పూర్తి నీటిని ఖాళీ చేయించాలని నాటి సీఎం కేసీఆర్‌కు చెప్పి ఖాళీ చేయించింది.
జాతీయ డ్యామ్ రక్షణ అథారిటీ మధ్యంతర నివేదిక సంవత్సరం క్రితమే వచ్చింది. ఇటీవలే వచ్చిన పూర్తిస్థాయి నివేదిక కాళేశ్వరం మూడు బ్యారేజీల నిర్మాణంలో గత తెలంగాణ ప్రభుత్వం చేసిన అత్యంత ఘోరమైన తప్పుల నిగ్గు తేల్చింది. దీని ప్రకారం ఇంజ నీరింగ్ ప్రమాణాల ప్రకారం, పునాదులకు సంబంధించిన, ఏ రకమైన భూగర్భ పరీక్షలూ చేయకుండానే నిర్మాణం చేపట్టారు. బలహీనమైన ఇసుక పునాదులపై బ్యారేజీల నిర్మాణం జరిగింది. బ్యారేజీలలో వచ్చిన నీరు వచ్చినట్టు కాలువకు వెళ్లాలి. ఎక్కువైన నీరు నదిలోకి వెళ్లాలి.
కానీ బలహీన పునాదులపై నిర్మించిన బ్యారేజీలలో ప్రాజెక్టులలో మాదిరిగా భారీ ఎత్తున నీటిని నిలువ చేసింది ప్రభుత్వం. ఇలా చేయడం ప్రమాదకరం. భారీ నీటి నిలువ ఒత్తిడి, తాకిడికి పునాదులు దెబ్బతిన్నాయి. పునాదుల కింద నుంచి భారీగా ఇసుక కొట్టుకుపోయి, లీకేజీలు నిరంతరం సాగుతున్నాయి. ఆగమేఘాల మీద దోపిడే లక్ష్యంగా సాగిన, ఈ తప్పుడు డిజైన్ వల్ల ఇసుక కొట్టుకుపోవడం నిరంతరంగా సాగుతోంది. స్పిల్‌వే నిట్ట నిలువుగా మూడు ఫీట్ల వెడల్పుతో చీలి పోయి, రెండు చెక్కలైంది. భూమిలో ఐదు అడుగులు లోపలికి కుంగిపోయింది.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు ఇప్పుడు ఉన్నవి ఉన్నట్లుగా పనికి రావని ఎన్డీఎస్‌ఏ పేర్కొంది. నీటి ఒత్తిడి ఎక్కు వైనందువల్ల సీకెండ్ ఫైల్స్ కూలిపోయాయనీ, బ్యారేజీ ఎగువ, దిగువ భాగాల్లో భారీ రంధ్రాలు పడ్డాయని తేల్చింది. మూడు బ్యారేజీలకు విస్తృత నష్టం జరిగిందని పేర్కొంది. ఈ నష్టం ఇక్క డితో ఆగదనీ, నీటి ఒత్తిడి ఎక్కువైతే మొత్తం బ్యారేజీలకే ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. ఒక బ్లాక్‌ను కూల్చి పునర్ని ర్మాణం చేస్తే, మరొకటి మళ్లీ కుంగి కూల్చవలసిన ప్రమాదపు అంచులలోకి వెళ్లవచ్చని చెప్పింది. అంటే మూడు బ్యారేజీల నిర్మాణానికి ఖర్చు చేసిన 30 వేల కోట్లు గంగలో కలిసినట్లే.
సమగ్ర పునర్నిర్మాణ డిజైన్ చేయాలని, జియో ఫిజికల్ పరీక్షలు, జియో సాంకేతిక పరీక్షలు చేసి, ఆధునిక హైడ్రాలిక్ నమూనాల (నీటి ప్రవాహ ఒత్తిడికి సంబంధించిన నమూనా ల)ను ఉపయోగించి ఈ పునర్నిర్మాణ రీడిజైన్ చేయాలని ఎన్డీఎస్‌ఏ చెప్పింది. కానీ ఈ పరీక్షలన్నీ చేస్తే ఇంతకంటే ప్రమాదకర తప్పులన్నీ బయటపడతాయి. మూడు బ్యారేజీలలో ఇంత ప్రమాదకరమైన పరిస్థితి ఉన్న నేపథ్యంలో మేడిగడ్డ పునరుద్ధరణ అసంబద్ధమైనది. మేడిగడ్డ ముగిసిన అధ్యాయం. పునరుద్ధరణ తెలంగాణను మళ్లీ అప్పుల విష వలయంలోకి ఈడ్చడమే! తుమ్మిడిహెట్టి ప్రాణహిత ప్రాజెక్టు మాత్రమే దీనికి నిజమైన ఏకైక ప్రత్యామ్నాయం. దాన్ని వెంటనే చేపట్టాలి.
ఇక ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కూడా కాళేశ్వరం మేడిగడ్డలో జరిగిన తప్పిదాన్నే పునరుక్తం చేయబోతున్నట్లని పిస్తోంది. పోలవరం పునాది అడుగున 460 కోట్లతో కట్టిన డయాఫ్రమ్ వాల్ కూలిపోయింది. మేడిగడ్డ లాంటి విపత్తు, పోలవరంలో జరగదని చంద్రబాబు ఆంధ్ర ప్రజలకు హామీ ఇవ్వగలరా? పోలవరం ప్రాజెక్టు 2027కల్లా ప్రారంభమవుతుందని ప్రకటించడం ద్వారా ఇంజినీర్లను బాబు కూడా డమ్మీలను చేసినట్లే! ఎన్డీఎస్‌ఏ కాళేశ్వరం బ్యారే జీలపై తుది నివేదిక ఇచ్చింది. పోలవరంపై లోతైన రక్షణ నివేదికను ఎన్డీఎస్‌ఏ ఇవ్వగలదా? డయాఫ్రమ్ వాల్ కూలిన క్రమంపై ప్రఖ్యాత ఇంజనీర్లు, భూగర్భ నిపుణులు పోలవరం ప్రాజెక్టును నిశితంగా పరిశోధించారు. చంద్రబాబు ఆ నివేదికలను వెల్లడించాలి.
నైనాల గోవర్ధన్
వ్యాసకర్త నీటిపారుదల ప్రాజెక్టుల విశ్లేషకులు