ర్యాంకుల్లో కనపడని 'మార్కు'! | Students getting confused by concept based questions | Sakshi
Sakshi News home page

ర్యాంకుల్లో కనపడని 'మార్కు'!

May 21 2026 4:47 AM | Updated on May 21 2026 4:47 AM

Students getting confused by concept based questions

ఇంటర్మీడియెట్‌లో ప్రతిభ చూపించినా ఎప్‌సెట్‌లో వెనుకంజ 

అక్కడ 90 శాతం మార్కులు..కానీ ప్రవేశ పరీక్షలో 60 వేల పైనే ర్యాంకు  

కాన్సెప్ట్‌ ఆధారిత ప్రశ్నల్లో కంగారు పడిపోతున్న విద్యార్థులు 

ఇదే సమయంలో ఇంటర్‌లో సాధారణ మార్కులు వచ్చిన విద్యార్థులు సెట్‌లో ప్రతిభ చూపిన వైనం 

దాదాపు 70 వేల మందిది ఇదే తరహా పరిస్థితి  

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌లో మంచి మార్కులు వచ్చిన విద్యార్థులు ఎప్‌సెట్‌ ర్యాంకుల్లో వెనుకబడ్డారు. సాధారణ మార్కులు వచ్చిన విద్యార్థులు ప్రతిభ చూపారు. ఇది ఏ కొద్దిమందికో పరిమితం కాలేదు. దాదాపు 70 వేల మంది ఈ కోవలో ఉన్నారు. ఇటీవల వెల్లడైన ఇంజనీరింగ్, అగ్రి, ఫార్మా ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీసెట్‌) ఫలితాల్లో ఈ ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. ఈ పరిస్థితిపై ఇంటర్‌ విద్య వర్గాలు దృష్టి పెట్టాయి. 

ప్రైవేటు కాలేజీల్లో క్షణం విరామం లేకుండా చదివి, ఇంటర్‌ మార్కుల్లో 90 శాతంపైగా స్కోర్‌ చేసినా, పోటీ పరీక్షలో వెనుకబడటంపై అన్ని వర్గాలు ఆలోచనలో పడ్డాయి. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, సమగ్ర విశ్లేషణ చేపట్టాల్సిందిగా ప్రభుత్వానికి సూచించాలని రాష్ట్ర విద్యా కమిషన్‌ భావిస్తోంది. అనేక కాలేజీలు ఇంటర్‌ ఫలితాల ప్రచారంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాయని, బోర్డు పరీక్షలకు అవసరమైన ప్రశ్నలపైనే శిక్షణ ఇస్తూ, సబ్జెక్టులపై లోతైన అవగాహన కల్పించడంపై తగిన శ్రద్ధ చూపడం లేదని కమిషన్‌ అభిప్రాయపడుతోంది. 

కాన్సెప్ట్‌ ప్రశ్నల్లో కంగారు 
ఎప్‌సెట్‌లో ఇచ్చే ప్రశ్నలను సాధారణ, మధ్యస్థ, కఠిన అనే మూడు కేటగిరీలుగా విభజించారు. సాధారణ ప్రశ్నలన్నింటికీ 30 సెకన్లలో సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. మధ్యస్థ ప్రశ్నలకు 40 సెకన్లు, కఠిన ప్రశ్నలకు నిమిషం వరకూ సమయం తీసుకునేలా ప్రశ్నపత్రం సెట్‌ చేస్తారు. మధ్యస్థం, కఠిన ప్రశ్నలన్నీ బేసిక్‌ కాన్సెప్ట్‌ (సబ్జెక్టు ప్రాథమిక అంశం) నుంచే ఉంటాయి. మెరిట్‌ విద్యార్థులు ఇక్కడే వెనకబడుతున్నారు. 990 మార్కులు వచ్చినా, బేసిక్‌ కాన్సెప్ట్‌ ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితి ఉందని జాతీయ పోటీ పరీక్షల సీనియర్‌ అధ్యాపకుడు శంకర్‌ రాంబొట్ల తెలిపారు. 

గణితంలో జరిగే ఈ పొరపాటు ఫిజిక్స్‌లోనూ కొనసాగుతోంది. ఇంటర్‌లో 900కు పైన మార్కులు వచ్చిన దాదాపు 40 వేల మంది విద్యార్థులు ఎప్‌సెట్‌లో 40 నుంచి 60 వేల ర్యాంకులకు పరిమితం అవ్వడం ఇంటర్‌ విద్య నాణ్యతను ప్రశ్నిస్తోందని మేథ్స్‌ అధ్యాపకుడు వీరేంద్ర పాటిల్‌ అన్నారు. బేసిక్స్‌ నేర్పకుండా ఇంటర్‌లో వివరణాత్మక సమాధానాలివ్వడంపైనే కాలేజీలు దృష్టి పెడుతున్నాయని, దీనివల్ల ఇంటర్‌లో మంచి మార్కులు వస్తున్నా, కాన్సెప్‌్టతో కూడిన ఎప్‌సెట్‌లో వెనుకబడుతున్నారని పాటిల్‌ తెలిపారు.  

గెస్‌ వర్క్‌తో గోవిందా! 
ఇంటర్‌లో 970కి పైగా మార్కులు వచ్చిన దాదాపు 4,800 మంది విద్యార్థుల ర్యాంకులు 25 నుంచి 35 వేల మంది వరకు ఉన్నాయి. వీళ్ళంతా ప్రశ్నలకు సమాధానాలు ఊహించి రాయడం ద్వారా బోల్తా కొట్టినట్టు ఓ కార్పొరేట్‌ కాలేజీ అధ్యాపకులు రాంప్రసాద్‌ సువర్చల తెలిపారు. కాలేజీ స్థాయిలో ఎక్కువ మార్కుల కోసం వివరణాత్మక సమాధానాలపైనే వీళ్ళు ఎక్కువగా ఆధారపడ్డారు. జేఈఈ వంటి పోటీ పరీక్షలకు ఇదే విధానం సరైందని భావిస్తుంటారు. దీంతో ఎప్‌సెట్‌లో ముందుగా కఠిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంపై దృష్టి పెడుతున్నారు. 

సబ్జెక్టుపై లోతైన అవగాహన లేకపోవడంతో సమాధానాలు రాబట్టేందుకు ఎక్కువ సమయం పడుతోంది. ఇచ్చే ఐచ్ఛికాల్లోనూ తప్పులు దొర్లడం పరిపాటిగా మారింది. ఇక మిగిలిన సమయంలో సాధారణ, మధ్యస్థ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. సమయం సరిపోని కారణంగా ఊహించి ఐచ్ఛికాలు ఇవ్వడానికి ప్రాధాన్యమిస్తున్నారు. గెస్‌ సరైంది కాకపోవడం, కఠిన ప్రశ్నల్లో స్కోర్‌ తగ్గడంతో ర్యాంకులు పడిపోతున్నాయని సీనియర్‌ ఇంటర్‌ అధ్యాపకుడు రాపర్తి వర్మ విశ్లేషించారు.

ఇంటర్‌లో సాధారణ ప్రతిభ కనబరిచే విద్యార్థి కొన్ని చాప్టర్లైనా కాన్సెప్ట్‌ స్థాయిలో నేర్చుకుంటు న్నాడు. ఎప్‌సెట్‌లో సాధారణ ప్రశ్నలకు ఆత్మస్థైర్యంతో సమాధానాలు ఇస్తున్నాడు. ఇలా ఇంటర్‌లో 700కు పైగా మార్కులు వచ్చిన 28 వేల మంది వరకూ ఎప్‌సెట్‌లో 15 నుంచి 20 వేల ర్యాంకులు పొందగలిగినట్టు విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి.  

Advertisement
 
Advertisement
Advertisement