హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఓ రెస్టారెంట్ టేబుల్ పైకి ఎక్కి అక్కడ మిగిలి ఉన్న ఆహారాన్ని వీధి కుక్క తింటుండడం కలకలం రేపింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండాల్సిన చోట పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయంటూ దీనిపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జీఎంఆర్ సంస్థ స్పదించింది.
వీధి కుక్కల నియంత్రణకు తాము జీహెచ్‌ఎంసీతో కలిసి పనిచేస్తున్నామని వెల్లడించింది. జనవరి నుంచి 21 వీధి శునకాలను సంబంధిత అధికారులు పట్టున్నట్లు తెలిపారు. హోటళ్లు, ఇతర వాణిజ్య సంస్థల ముందు ఘన, ద్రవ పదార్థాలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు వాటి నిర్వహణపై నిరంతరం శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడుతున్నామన్నారు.


