అంచనాలకు దూరంగా.. ఆర్థికం! | State revenue less than budget proposals | Sakshi
Sakshi News home page

అంచనాలకు దూరంగా.. ఆర్థికం!

Jan 24 2025 5:14 AM | Updated on Jan 24 2025 5:14 AM

State revenue less than budget proposals

బడ్జెట్‌ ప్రతిపాదనల కంటే తక్కువగా రాష్ట్ర ఆదాయం.. కాగ్‌ నెలవారీ నివేదికలో వెల్లడి

ప్రతిపాదించిన మేరకు అందని కేంద్ర గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌

పన్నేతర ఆదాయంలోనూ గణనీయంగా తగ్గుదల

ఆశించిన మేర సమకూరని స్టాంపులు– రిజిస్ట్రేషన్ల ఆదాయం

పెరుగుతున్న ద్రవ్యలోటు.. తగ్గిన మూలధన వ్యయం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజ­న­కంగా కనిపించడం లేదని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడి­ట­ర్‌ జనరల్‌ (కాగ్‌) నెలవారీ నివేదిక తేల్చింది. ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఆదాయ, వ్యయాల అంచనాల్లో అంతరం పెరుగుతోందని వెల్లడించింది. పన్నేత­ర ఆదాయం, కేంద్ర గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ అంచనాల కంటే తగ్గుతుంటే... అప్పులు పెరిగిపో­యే పరిస్థితి కనిపిస్తోందని తెలిపింది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.49,225 కోట్లు రుణా­లు తీసుకోవాలని బడ్జెట్‌లో పేర్కొన్నా.. మరో మూడు నెలలు ఉండగానే, డిసెంబర్‌ చివరి నాటి­కే ప్రభుత్వం రూ.48,178 కోట్ల రుణాలు తీసేసు­కుందని వెల్లడించింది. 2024–25లో రూ.297 కోట్ల రెవెన్యూ మిగులు ఉంటుందని బడ్జెట్‌లో అంచనా వేయగా.. 2024 డిసెంబర్‌ నాటి­కి వాస్తవ రెవెన్యూ రూ.19,892 కోట్ల మైనస్‌లోకి వెళ్లిందని, ప్రస్తుత బడ్జెట్‌ అంచనాల ప్రకారమైతే ఇది రూ.6,688.47 కోట్లు లోటు అని పేర్కొంది. డిసెంబర్‌ నెలకు సంబంధించి కాగ్‌ గురువారం ఈ నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం..

9 నెలలు గడిచినా 58.57 శాతమే ఆదాయం...
రాష్ట్ర ప్రభుత్వం పన్నులు, పన్నేతర ఆదాయం, గ్రాంట్లు, రుణాలు.. ఇలా అన్ని కలిపి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 2,74,057 కోట్లు సమకూరుతాయని అంచనా వేసింది.  ఇందులో డిసెంబర్‌ చివరి నాటికి వచ్చినది రూ.1,60,518 కోట్లే. అంటే 58.57 శాతం మాత్రమే. గత ఆర్థిక సంవత్సరంలో ఈ సమయానికి బడ్జెట్‌ ప్రతిపాదనల్లో 62.17 శాతం ఆదాయం వచ్చినట్టు కాగ్‌ నివేదిక వెల్లడించింది. ప్రస్తుత బడ్జెట్‌లో గ్రాంట్ల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన ఆదాయం రూ.21,663 కోట్లుకాగా.. కేంద్రం నుంచి వచ్చింది రూ.4,771.44 కోట్లు మాత్రమే. 

రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం కూడా ఆశించినంతగా లేదు. స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ ఆదాయంలో తగ్గుదల ఉందని, స్థానిక సంస్థలకు రూ.3,046 కోట్లు బదిలీ చేయడం వల్ల లోటు బాగా ఎక్కువగా కనిపిస్తోందని కాగ్‌ వెల్లడించింది. స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ శాఖ ద్వారా రూ.18,228 కోట్లు వస్తాయని అంచనా వేసుకుంటే.. డిసెంబర్‌ చివరి నాటికి వచ్చింది రూ.7,524 కోట్లేనని తెలిపింది. అమ్మకం పన్ను ఆదాయం మాత్రం పెరుగుతోందని వెల్లడించింది. 

ఇక రాష్ట్ర ఎక్సైజ్‌ డ్యూటీ కింద అంచనా వేసుకున్న ఆదాయంలో ఇప్పటివరకు సగమే వచ్చిందని, పన్నేతర ఆదాయంలోనూ భారీ లోటు ఉందని తెలిపింది. బడ్జెట్‌ అంచనాల ప్రకారం రూ.35,208 కోట్లు పన్నేతర ఆదాయం రావాల్సి ఉండగా.. ఇప్పటివరకు సమకూరింది రూ.5,487.88 కోట్లు మాత్రమేనని కాగ్‌ నివేదికలో పేర్కొంది.

మూలధన వ్యయంలోనూ తగ్గుదల..
అభివృద్ధి పనులకు సూచికగా పరిగణించే మూలధన వ్యయం కూడా గతేడాదితో పోలిస్తే తక్కువగా ఉందని కాగ్‌ నివేదిక పేర్కొంది. 2023–24లో డిసెంబర్‌ నాటికి మూలధన వ్యయం 83.68 శాతం ఉంటే.. 2024–25లో డిసెంబర్‌ నాటికి ఇది 75.54 శాతంగా నమోదైనట్టు వెల్లడించింది. మూలధన వ్యయం కింద రూ.33,486 కోట్లు ఖర్చు చేయాలని బడ్జెట్‌లో ప్రతిపాదించగా.. డిసెంబర్‌ నాటికి రూ.25,295 కోట్లే వ్యయం చేశారని తెలిపింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement