పెద్దపల్లి జిల్లా: పదో తరగతి వార్షిక పరీక్షల్లో 550 మార్కులు దాటిన విద్యార్థులను సొంత ఖర్చులతో విమానంలో తీసుకెళ్తానని గణతంత్ర దినోత్సవం రోజున ఇచ్చిన మాటను గణిత ఉపాధ్యాయుడు నిలబెట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా గణితం బోధిస్తున్న మల్క రాంకిషన్‌రావు ఇచ్చిన మాట ప్రకారం 564 మార్కులు సాధించిన విద్యార్థి శ్రీమంతుల పూర్ణచందర్‌ను విమానంలో బుధవారం విశాఖపట్నం తీసుకెళ్లారు. అక్కడ వివిధ పర్యాటక ప్రదేశాలు చూపించారు. ఇలాంటి కార్యక్రమాలతో హాజరుశాతం పెరగడంతో పాటు పరీక్షల్లో పోటీ వాతావరణం ఏర్పడుతుందని చెప్పారు.
ఐఎఫ్‌ఎస్‌కు ఎంపిక.. డీజీపీ సన్మానం
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు ఎంపికైన హెడ్ కానిస్టేబుల్ కూతురు చల్లా యామినిని డీజీపీ సీవీ ఆనంద్ బుధవారం తన కార్యాలయంలో సన్మానించారు.

సూర్యాపేట జిల్లాలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చల్లా యాదగిరి కుమార్తె యామిని ప్రస్తుతం సికింద్రాబాద్‌లో ఎంసీఈఎంఈలో ఆడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల వెలువడిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఫలితాల్లో ఆమెకు 119 ర్యాంక్ లభించింది. ఆమెకు శాంతిభద్రతల డీజీ మహేశ్ భగవత్ మెంటార్‌గా వ్యవహరించారు.


