దక్షిణ మధ్య రైల్వేకు రికార్డు స్థాయిలో ఆదాయం | South Central Railway records record revenue | Sakshi
Sakshi News home page

దక్షిణ మధ్య రైల్వేకు రికార్డు స్థాయిలో ఆదాయం

Apr 3 2026 4:17 AM | Updated on Apr 3 2026 4:17 AM

South Central Railway records record revenue

గత ఆర్థిక సంవత్సరంలో రూ.21211 కోట్లు వచ్చాయన్న జీఎం  

సాక్షి, హైదరాబాద్‌: గత ఆర్థిక సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో రూ. 21,211.92 కోట్ల స్థూల ఆదాయాన్ని నమోదు చేసింది. జోన్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఆర్జించిన అత్యధిక ఆదాయం ఇదే. అంతకుముందు 2024–25లో నమోదైన రూ.20,569.35 కోట్ల మునుపటి అత్యుత్తమ స్థాయితో పోలిస్తే ఇది 3 శాతం అధికం కావటం విశేషం. ఇందులో సరుకు రవాణా రూపంలో రూ.13,575 కోట్లు రాగా, ప్రయాణికుల టికెట్ల రూపంలో రూ.6,235 కోట్లు వచ్చింది. పెనాల్టీలు, తుక్కు అమ్మకాలు లాంటి ఇతర రూపాల్లో మిగతాది వసూలైంది. 

ఈ వివరాలను గురువారం రైల్‌ నిలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌ కుమార్‌ శ్రీవాస్తవ వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే...గత ఆర్థిక సంవత్సరంలో 147.871 మిలియన్‌ టన్నుల సరుకును రవాణా చేసింది. 28.64 కోట్ల మంది ప్రయాణికుల తరలింపు ద్వారా రూ.6,235.37 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఈ మొత్తం 2024–25 సంవత్సరంలో రూ.5,714.83 కోట్లుగా ఉంది. 

2024–25 సంవత్సరంలో 3,495 రైళ్లతో పోలిస్తే, ఈ సంవత్సరంలో 3,791 ప్రత్యేక రైళ్లను నడిపారు. టికెట్ల తనిఖీ ద్వారా రూ.232.6 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇది రూ.184.24 కోట్లు కాగా, 2023–24లో మునుపటి అత్యుత్తమ స్థాయి రూ.220.85 కోట్లుగా నమోదైంది. జోన్‌పరిధిలో 194.57 కిలోమీటర్ల ట్రాక్‌ అదనంగా నిర్మితమైంది. ఏడాది కాలంలో 325 కిలోమీటర్ల ట్రాక్‌ విద్యుదీకరణను పూర్తి చేసింది. 

అమృత్‌భారత్‌ స్టేషన్ల పథకం కింద దక్షిణ మధ్య రైల్వే రూ. 6వేల కోట్లకు పైగా వ్యయంతో 119 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పనులను చేపడుతోంది. ఇందులో రూ.2,900 కోట్ల వ్యయంతో 11 ప్రధాన స్టేషన్‌ భవనాలను అభివృద్ధి చేస్తున్నారు. ఈ మొత్తంలో తెలంగాణ పరిధిలో 40 స్టేషన్లు ఉన్నాయి. వరంగల్, బేగంపేట, కరీంనగర్‌ స్టేషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మరో ఐదు స్టేషన్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. 

జోన్‌ పరిధిలో 479 రూట్‌ కిలోమీటర్ల మేర ఆటోమేటిక్‌ బ్లాక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ ప్రారంభమైంది. 486 రూట్‌ కిలోమీటర్ల మేర కవచ్‌ వ్యవస్థ ఏర్పాటైంది. ఆర్‌ఓబీ/ ఆర్‌యూబీల నిర్మాణం ద్వారా 65 చోట్ల మ్యాన్డ్‌ లెవల్‌ క్రాసింగ్స్‌ను తొలగించారు. కొత్తగా 72 ఆర్‌యూబీలు, 27 ఆర్‌ఓబీలను నిర్మించారు. గత ఏడాది కాలంలో కొత్తగా 40 లిఫ్టులు, 25 ఎస్కలేటర్లు, 10.74 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement