సోనూసూద్‌ సాయం: హైదరాబాద్‌కు ఎయిర్‌ అంబులెన్స్‌లో

Sonu Sood Help To Hyderabad Corona Patient In Air Ambulance - Sakshi

హిమాయత్‌ నగర్‌: ప్రభుత్వాలు పట్టించు కోకపోయినా నేనున్నా అంటూ బాధితుల్లో ధైర్యం నింపుతున్నాడు బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందిన కైలాశ్‌ అగర్వాల్‌ నాలుగు రోజుల క్రితం కోవిడ్‌ బారిన పడ్డారు. ఆక్సిజన్‌ శాచురేషన్‌ 60–70 మధ్యలో ఉండటంతో బంధువులు ఆస్పత్రుల్లో చేర్చేందుకు యత్నించగా ఎక్కడా బెడ్లు ఖాళీ లేవు. గ్రామస్తులు ఈ విషయాన్ని ట్విట్టర్‌లో సోనూసూద్‌ దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో సోనూసూద్‌ శుక్రవారం ఉదయం కైలాశ్‌ ఇంటికి అంబులెన్స్‌ పంపారు. ఇంటి నుంచి ఝాన్సీ విమానాశ్రయానికి తరలించారు. కైలాశ్‌ అక్కడ నుంచి ఎయిర్‌ అంబులెన్స్‌లో హైదరాబాద్‌ బేగంపేట విమానాశ్రయానికి శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వచ్చారు. హైదర్‌గూడ అపోలో ఆసుపత్రికి చెందిన అంబులెన్స్‌ అప్పటికే అక్కడ సిద్ధంగా ఉంది.

వెంటనే ఆసుపత్రికి తరలించారు. కైలాశ్‌ ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నారని, సీనియర్‌ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారని ఆస్పత్రి ఇంచార్జి మోహన్‌ వేమూరి తెలిపారు. సోనూసూద్‌ నాలుగు రోజుల క్రితం కూడా ఝాన్సీ నుంచి ఇద్దరు కరోనా రోగులను హైదరాబాద్‌కు తరలించి సాయం చేశారు. వీరి ఆరోగ్యం కుదుటపడుతుండటం తనకు ఎంతో ఆనందాన్నిస్తోందని సోనూసూద్‌ ‘సాక్షి’ తెలిపారు.
చదవండి: కరోనా: వాట్సాప్‌ ‘స్టేటస్‌’ మారిపోతోంది!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top