ఎస్‌ఎల్‌బీసీ సొరంగం కూలిన చోటుకు 6 కి.మీ. దూరంలో ‘నల్లవాగు’ మేజర్ ఫాల్ట్ జోన్
వాగుకు 2 కి.మీ. దూరంలోని సొరంగ మార్గంలో మరో రెండు ఫాల్ట్ జోన్లు
50–300 మీటర్ల లోతు వరకు శిలల మధ్య భారీ చీలికలు, పగుళ్లు..వీటి మధ్య జల ప్రవాహం
సీఎస్‌ఐఆర్–ఎన్జీఆర్‌ఐ శాస్త్రవేత్తల సర్వేలో వెలుగులోకి ఆందోళనకర అంశాలు
నల్లవాగు ప్రాంత పరిధిలోనే నిర్మాణం జరుగుతుండటంతో ఏర్పడిన ఫాల్ట్ జోన్లు
శిలల మధ్య పగుళ్లు, మధ్యలో మట్టి, నీటి ప్రవాహంతో గతంలో కూలిన సొరంగం
కూలిన ప్రాంతానికి పక్కన తీవ్ర పగుళ్లతో మరో రెండు ప్రమాదకర జోన్లు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం కుప్పకూలిన ప్రాంతానికి 6 కి.మీ.ల దూరంలో ‘నల్లవాగు’ మేజర్ ఫాల్ట్ జోన్ ఉన్నట్టు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. నల్లవాగుకి 2 కి.మీ.ల తూర్పు, పడమర దిశలోని సొరంగ మార్గంలో మరో రెండు ఫాల్ట్ జోన్లు కూడా ఉన్నాయి. భూ ఉపరితలం నుంచి 50–300 మీటర్ల లోతుల్లో దక్షిణ దిశగా వాలుతూ ఈ ఫాల్ట్ జోన్లు కనిపించాయి. అక్కడి పొరల నిర్మాణంలో చీలికలూ ఉన్నాయి. సొరంగ మార్గం వెంబడి భూగర్భ జలాల ప్రవాహానికి ఈ చీలికలు ప్రధాన మార్గంగా పనిచేస్తున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలోని నల్లవాగు ప్రాంతం పరిధిలోనే సొరంగ నిర్మాణం జరుగుతుండడంతో ఈ ఫాల్ట్ జోన్లు ఏర్పడ్డాయి. సీఎస్‌ఐఆర్–నేషనల్ జియోఫిజికల్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు 2025 అక్టోబర్–నవంబర్ మధ్యకాలంలో అత్యాధునిక హెలీబోర్న్ వీటెమ్ సాంకేతికతతో ఆకాశం నుంచి భూగర్భంలో పరిశోధనలు నిర్వహించగా, పైన పేర్కొన్న రీతిలో పలు ఆందోళనకర అంశాలు బయటపడ్డాయి. ఈ సర్వే నివేదికను ఇటీవల ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తలు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. అత్యాధునిక పరికరాల ద్వారా విద్యుదయస్కాంత సంకేతాలను భూగర్భంలోకి పంపించి వాటి వ్యాప్తిని గమనించడం ద్వారా భూ పొరల్లో ఫాల్ట్స్, ఫ్రాక్చర్లు, షీర్ జోన్లతో పాటు భూగర్భ జలాల ప్రవాహాన్ని ఈ పరిశోధన ద్వారా నిర్థారిస్తారు.
పగుళ్ల మధ్య ప్రవహిస్తున్న నీళ్లు
సొరంగం కుప్పకూలిన ప్రాంతంలో 13.65– 13.95 కి.మీ.ల మార్గంలోని శిలల మధ్య తీవ్రమైన పగుళ్లు ఏర్పడి ఉండగా, వాటి మధ్య మట్టి నిక్షిప్తమై బలహీన నిర్మాణాన్ని కలిగి ఉంది. అక్కడి శిలలు చీలిపోయి నిటారున మడతపడి ఉండగా, పగుళ్ల మధ్య నీళ్లు ప్రవహిస్తున్నాయి. దీంతోనే సొరంగం కుప్పకూలినట్టు భావిస్తున్నారు.
⇒ సొరంగం కూలిన ప్రాంతానికి పక్కన తీవ్ర పగుళ్లతో మరో రెండు ప్రమాదకర జోన్లను కూడా గుర్తించారు. ఈ పగుళ్ల మధ్య కూడా భూగర్భ జల ప్రవాహం కొనసాగుతోంది.
⇒ సొరంగం మధ్య ప్రాంతంలో నల్లవాగు ఫాల్ట్ జోన్ ఉంది. ఇక ఉత్తర భాగంలో పగుళ్లు/చీలికలున్నాయి. 
ఉత్తరాన విద్యుదయస్కాంత క్షేత్రం
⇒ సొరంగం కూలిన ప్రాంతానికి ఉత్తరాన అసాధారణ రీతిలో అత్యల్ప విద్యుదయస్కాంత క్షేత్రం ఉన్నట్టు కనుగొన్నారు. (నల్లవాగు ఫాల్ట్ జోన్)
⇒ సొరంగ మార్గంలో 13.2 కి.మీలు, 13.6 కి.మీలు, 13.9కి.మీ.ల వద్ద పగుళ్లు, చీలికలు ఉన్నాయి. వీటి మధ్య జలాలు ప్రవహిస్తున్నాయి.
ఇక్కడ జాగ్రత్తగా వ్యవహరించాలి
⇒ సొరంగ మార్గం 21–23 కి.మీ.ల మధ్య 250 మీటర్ల లోతుల్లో శిలల నిర్మాణం లోహ ఖనిజాల నుంచి గ్రనైట్‌కు మారుతోంది. దీంతో ఇక్కడ తవ్వకాల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నివేదిక స్పష్టం చేస్తోంది.
⇒ నల్లమలలోని తిరుమలపూర్‌కి ఉత్తరాదిన.. ఈశాన్యం నుంచి నైరుతి దిశగా మరో రెండు సమస్యాత్మక ప్రాంతాలున్నాయి.
⇒ సొరంగం తవ్వకాలు జరగాల్సిన ప్రాంతాల్లో పగుళ్లు, చీలికలు పలు దిశల్లో విస్తరించి ఉన్నాయి. ఉపరితలం నుంచి 250 మీటర్ల లోతు వరకు ఇలాంటి నిర్మాణాలుండగా, వీటి గుండా భూగర్భ జలాలు ప్రవహిస్తున్నాయి.


