ఒంటరి మహిళలే అతని టార్గెట్‌ | Serial killer arrested in Filmnagar | Sakshi
Sakshi News home page

ఒంటరి మహిళలే అతని టార్గెట్‌

Mar 31 2026 8:03 AM | Updated on Mar 31 2026 8:03 AM

Serial killer arrested in Filmnagar

హైదరాబాద్: బెట్టింగ్‌ కు బానిసై.. ఒంటరి మహిళలను మభ్యపెట్టి కారులో తీసుకువెళ్లి హత్యలు చేస్తున్న సీరియల్‌ సైకో కిల్లర్‌ను జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. 

కృష్ణాజిల్లా చనగొల్లపాలెం గ్రామానికి చెందిన కునసాయి వాసు (29) మూడేళ్ల క్రితం నగరానికి వచ్చి జూబ్లీహిల్స్‌ రోడ్డునెంబర్‌–44లో ఓ వ్యాపారి ఇంట్లో డ్రైవర్‌గా ఉన్నాడు. కొంతకాలంగా బెట్టింగ్‌లకు బానిసయ్యాడు.  ఎలాగైనా ఈజీ మనీ సంపాదించాలని పథకం వేశాడు. ఇందులో భాగంగానే ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్‌ చేసుకున్నాడు.  

ఫిలింనగర్‌ రోడ్‌ నెంబర్‌–16లో నివసించే బోయినపల్లి యాదమ్మ (70)ని పరిచయం చేసుకున్నాడు. ఈ నెల 11న  తన కారులో ఆమెను ఎక్కించుకున్నాడు. నార్సింగ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓఆర్‌ఆర్‌ సర్వీసు రోడ్డుకు తీసుకువెళ్లి ఆమెను కిందికి దింపి తాడుతో ఉరి బిగించి కిరాతకంగా హత్య చేశాడు. తరువాత ఆమె ఒంటిపై ఉన్న నగలను తీసుకుని వెళ్లిపోయాడు. ఆ నగలు అమ్మిన డబ్బును మళ్లీ బెట్టింగ్‌లో పెట్టాడు. 

డిక్కీలో బ్యాగ్‌ మరిచిపోయానంటూ.. 
జూబ్లీహిల్స్‌ రోడ్డునెంబర్‌–44లో తాను పనిచేస్తున్న ఇంటి ఎదురుగానే ఓ ఫ్లాట్‌లో రోజూ బట్టలు ఉతికి ఇస్త్రే చేసే మంగతాయారమ్మ (60)ని టార్గెట్‌ చేశాడు. ఈ నెల 17న ఆమె పని ముగించుకుని బయటకు రాగానే జూబ్లీహిల్స్‌ రోడ్డునెంబర్‌–46లోని మస్తాన్‌నగర్‌లో దింపుతానని తన కారులో ఎక్కించుకున్నాడు. కొద్దిదూరం వెళ్లగానే డిక్కీలో బ్యాగ్‌ మరిచిపోయానంటూ కారు దిగి డిక్కీ తెరిచి అక్కడ ఉన్న తాడుతో వెనుక కూర్చొన్న మంగతాయారమ్మను గట్టిగా ఉరేసి హత్య చేశాడు.  మోకిల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నిర్మానుష్య ప్రదేశంలో మృతదేహాన్ని పడేసి ఆమె ఒంటిపై ఉన్న నగలు, అదే రోజు తీసుకున్న జీతం రూ.16 వేలు తీసుకుని ఉడాయించాడు. 

మిస్సింగ్‌ కేసులు నమోదు 
మిస్సింగ్‌ కేసులు నమోదు చేసిన అనంతరం  యాదమ్మ మృతదేహం కుళ్లిపోయి కనిపించగా నార్సింగ్‌ పోలీసులు జీహెచ్‌ఎంసీకి అప్పగించారు. అయితే మిస్సింగ్‌ కేసులను సీసీటీఎన్‌ఎస్‌లో పరిశీలిస్తున్న పోలీసులకు నార్సింగ్‌లో లభ్యమైన మృతదేహం ఫిలింనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అదృశ్యమైన వృద్ధురాలు ఒక్కటేనని తేలింది. దీంతో అక్కడి సీసీ కెమెరాలు పరిశీలించగా వరుస హత్యలకు పాల్పడుతున్న వాసు నడిపిస్తున్న కారును గుర్తించారు. నిందితుడిని పట్టుకొని పోలీసులు విచారించగా బెట్టింగ్‌ల కోసమే ఈ ఇద్దరిని హత్య చేసినట్లుగా అంగీకరించాడు. ఒకవేళ పట్టుపడకపోతే తాను పనిచేస్తున్న ఇంటి యజమానురాలిని కూడా ఇలాగే తీసుకువెళ్లి హత్యకు పథకం వేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.  

 

Advertisement
 
Advertisement
Advertisement