కరడుగట్టిన నక్సలిజం ఖతం: అమిత్‌ షా | Union Home Minister Amit Shah Says Naxalism Is Ended | Sakshi
Sakshi News home page

కరడుగట్టిన నక్సలిజం ఖతం: అమిత్‌ షా

Mar 31 2026 4:20 AM | Updated on Mar 31 2026 4:20 AM

Union Home Minister Amit Shah Says Naxalism Is Ended

తెలంగాణ–ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో 21 రోజుల భీకర పోరు..  

సాక్షి, న్యూఢిల్లీ: దశాబ్దాలపాటు దేశాన్ని, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలను వణికించిన వామపక్ష తీవ్రవాదం (నక్సలిజం) దాదాపు అంతమైందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సోమవారం లోక్‌సభ సాక్షిగా ప్రకటించారు. ముఖ్యంగా తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో కేంద్ర బలగాలు చేపట్టిన చరిత్రాత్మక ’ఆపరేషన్‌ బ్లాక్‌ ఫారెస్ట్‌’ విజయవంతం కావడంతో తెలంగాణ పూర్తిస్థాయిలో నక్సల్స్‌రహిత రాష్ట్రంగా మారిందని చెప్పారు. దేశవ్యాప్తంగా నక్సలిజాన్ని పారదోలేందుకు భద్రతా బలగాలు చేసిన త్యాగాలను కొనియాడుతూ సభలో సెల్యూట్‌ చేశారు. అదే సమయంలో వామపక్ష తీవ్రవాదానికి దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీ, గాంధీ కుటుంబం ఏ విధంగా అండగా నిలిచిందో వివరిస్తూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

ఆపరేషన్‌ బ్లాక్‌ ఫారెస్ట్‌.. భీకర పోరు 
‘తెలంగాణ–ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో 50 కి.మీ. పొడవు, 37 కి.మీ. వెడల్పు ఉన్న ఒక కొండపై మావోయిస్టులు ఏళ్ల తరబడి శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్క డ సోలార్‌ విద్యుత్, ఐఈడీ (బాంబుల) తయారీ ఫ్యాక్టరీలు, ఐదేళ్లకు సరిపడా ఆహార ధాన్యాలు నిల్వ ఉంచుకున్నారు. 400 నుంచి 500 మంది కేడర్‌ అక్కడ ఉన్నారు. ఆ స్థావరాన్ని ఛేదించేందుకు కోబ్రా, సీఆర్పీఎఫ్, డీఆర్‌జీ, ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు సంయుక్తంగా 21 రోజులపాటు ఆపరేషన్‌ బ్లాక్‌ ఫారెస్ట్‌ చేపట్టారు. 45 డిగ్రీల భగభగమండే ఎండలో మన జవాన్లు రోజుకు కేవలం 300 మిల్లీలీటర్ల నీటిని తాగుతూ ధైర్యంగా పోరాడారు. ఈ ఆపరేషన్‌లో 30 మందికిపైగా మావోయిస్టులు హతమయ్యారు. మిగిలిన వారు లొంగిపోయారు లేదా పారిపోతూ పోలీసులకు చిక్కారు. దీంతో బస్తర్, మహారాష్ట్ర, తెలంగాణలో మావోయిస్టుల ఉనికి తుడిచిపెట్టుకుపోయింది. అయితే, ఈ ఆపరేషన్‌ సమయంలో నక్సల్స్‌ పైకి (ఉత్తరం వైపు) రాకుండా అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరగా వారు నిరాకరించారు. కిందికి వస్తే మాత్రం ఆపుతామని చెప్పారు‘ అని అమిత్‌ షా పేర్కొన్నారు.  

తెలంగాణలో తుడిచిపెట్టుకుపోయారు 
2024 ప్రారంభంలో మావోయిస్టు కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరోలో 21 మంది సభ్యులు ఉండగా.. ఇప్పుడు వారు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయారని అమిత్‌షా తెలిపారు. ‘ఒకరు పట్టుబడ్డారు, ఏడుగురు లొంగిపోయారు, 12 మంది హతమయ్యారు, ఒకరు మాత్రమే పరారీలో ఉండి చర్చలకు మొగ్గుచూపుతున్నారు. అలాగే దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీలోని 37 మందికిగాను ఎవరూ మిగల్లేదు. తెలంగాణ విషయానికి వస్తే, రాష్ట్ర కమిటీలో ఉన్న వారిలో ఆరుగురు లొంగిపోయారు, ముగ్గురు ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. ప్రస్తుతం తెలంగాణలో ఒక్క నక్సలైట్‌ కూడా లేడు‘ అని చెప్పారు. బసవరాజు, హిడ్మా, వివేక్, పల్లూరి ప్రసాదరావు (చందన), వాసుదేవ్‌ వంటి అగ్రనేతలు ఎన్‌కౌంటర్లలో చనిపోవడం లేదా లొంగిపోయారని తెలిపారు.   

కాంగ్రెస్‌ దన్నుతోనే నక్సలిజం 
‘1970లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ’అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు వేయండి’ అని పిలుపునిచ్చి, నీలం సంజీవరెడ్డికి వ్యతిరేకంగా మావోయిస్టుల మద్దతు తీసుకున్నారు. ఆ మద్దతును ఆసరాగా చేసుకుని మావోయిస్టులు దేశంలోని 17 శాతం భూభాగానికి, 10 శాతం జనాభాకు విస్తరించారు. తిరుపతి నుంచి పశుపతినాథ్‌ వరకు రెడ్‌ కారిడార్‌ ఏర్పాటు చేసుకున్నారు‘ అని అమిత్‌షా చెప్పారు. అలాగే నక్సల్స్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నేత మహేంద్ర కర్మ ప్రారంభించిన ’సల్వాజుడుం’ ఉద్యమాన్ని 2011 జూలై 5న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం చట్టవిరుద్ధమని ప్రకటించిందని, ఆ తీర్పు వల్లే నిరాయుధులైన ఎంతోమంది సల్వాజుడుం కార్యకర్తలను, ఆదివాసీలను నక్సల్స్‌ ఊచకోత కోశారని చెప్పారు. 

ఆ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తినే విపక్షాలు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాయని, ఇదీ కాంగ్రెస్‌కు నక్సల్స్‌తో ఉన్న లాలూచీ అని దుయ్యబట్టారు. ‘రాహుల్‌ గాంధీ రాజకీయ జీవితంలో అనేకసార్లు నక్సల్స్‌ సానుభూతిపరులతో కనిపించారు. ఆయన జరిపిన భారత్‌ జోడో యాత్రలో నక్సల్స్‌ ఫ్రంటల్‌ ఆర్గనైజేషన్లకు చెందిన వారు పాల్గొన్నారు. 2010లో ఒడిశాలో లాడో సికాకాతో, 2018లో హైదరాబాద్‌లో గద్దర్‌తో రాహుల్‌ వేదిక పంచుకున్నారు‘ అని అమిత్‌షా పేర్కొన్నారు. 1970 నుంచి 2026 మార్చి వరకు వామపక్ష తీవ్రవాదానికి కాంగ్రెస్‌ మద్దతు ఇస్తూనే ఉందని, నక్సల్స్‌ చేతిలో ప్రాణాలు కోల్పోయిన 20 వేల మంది పౌరులు, జవాన్ల మరణాలకు కాంగ్రెస్‌ బాధ్యత వహించాలన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement