శ్రీ వీర హనుమాన్ విజయ యాత్రకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు | Tight Security Arrangements For Sri Veera Hanuman Vijaya Yatra In Hyderabad, Check Details Inside | Sakshi
Sakshi News home page

శ్రీ వీర హనుమాన్ విజయ యాత్రకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

Mar 31 2026 5:46 PM | Updated on Mar 31 2026 6:42 PM

Security Arrangements for Sri Veera Hanuman Vijaya Yatra in Hyderabad

హైదరాబాద్‌: ఏప్రిల్‌ 2వ తేదీన జరగనున్న శ్రీ హనుమాన్‌ జయంతి  శ్రీ వీర హనుమాన్ విజయ యాత్రను అత్యంత ప్రశాంతంగా, దిగ్విజయంగా నిర్వహించేందుకు నగర పోలీసు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ యాత్ర ఏర్పాట్లపై కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారి అధ్యక్షతన వివిధ ప్రభుత్వ శాఖలు, ఉత్సవ నిర్వాహకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన శ్రీరామ నవమి శోభాయాత్రను అన్ని శాఖల సహకారంతో విజయవంతంగా పూర్తి చేసినట్లే, హనుమాన్ విజయ యాత్రను కూడా శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని పిలుపునిచ్చారు.

ఈసారి ప్రధాన యాత్రలో సుమారు 168 శోభాయాత్రలు కలవనున్న నేపథ్యంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 3,000 మంది పోలీసు సిబ్బందితో పాటు అదనపు సాయుధ బలగాలు, టాస్క్ ఫోర్స్ బృందాలను కీలక ప్రాంతాల్లో మోహరిస్తున్నట్లు వెల్లడించారు.

యాత్ర నిర్వహణలో వాలంటీర్లకు తగిన శిక్షణ ఇచ్చి, రోప్ పార్టీ సభ్యులను అధిక సంఖ్యలో ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు సీపీ సూచించారు.

యాత్రలో కొత్త వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, నిర్ణీత మార్గాల్లోనే యాత్ర సాగేలా చూడాలని కోరారు. ఫ్లైఓవర్లు, రైల్వే బ్రిడ్జిల దృష్ట్యా విగ్రహాల ఎత్తు విషయంలో జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా మళ్లింపులు చేపడతామని, ప్రజలు పోలీసుల సూచనలు పాటించాలని కోరారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని, రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సమావేశం అనంతరం సీపీ గౌలిగూడ రామమందిరాన్ని దర్శించుకుని.. అక్కడి నుంచి తాడ్‌బండ్ హనుమాన్ దేవాలయం వరకు ఉన్న 12 కిలోమీటర్ల యాత్ర మార్గాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 

Advertisement
 
Advertisement
Advertisement