ఐఏఎస్ అధికారిగా మొదటి పోస్టింగ్ భువనగిరిలోనే

సాక్షి, యాదాద్రి : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా బాధ్యతలు చేపట్టిన శాంతికుమారి గతంలో భువనగిరి సబ్ కలెక్టర్‌గా పనిచేశారు. ఐఏఎస్ అధికారిగా ఆమె మొదటగా భువనగిరి సబ్ కలెక్టర్‌గా నియమితులయ్యారు. 1992 ఆగస్టు 25 నుంచి 1993 జూన్ 14 వరకు భువనగిరి డివిజన్‌లో విధులు నిర్వహించారు. సమస్య ఉన్నచోటుకు వెళ్లి పరిష్కరించే అధికారిగా ఆమెకు ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. భువనగిరిలో ప్రభుత్వ భూమిని కబ్జా చెర నుంచి విడిపించారు.
ప్రస్తుతం ఆ స్థలాన్ని టీఎన్‌జీవో భవనానికి కేటాయించారు. వలిగొండ మండలంలోని ఎం.తుర్కపల్లి గ్రామంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూమస్యను అప్పట్లో క్షేత్ర స్థాయికి వెళ్లి పరిష్కరించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు భువనగిరి డివిజన్‌లో పీపుల్స్‌వార్ నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో.. సబ్ కలెక్టర్‌గా శాంతికుమారి ప్రభుత్వ కార్యక్రమాలను ముమ్మరంగా కొనసాగించారు.
ప్రధానంగా చదువు–వెలుగు కార్యక్రమం భువనగిరి డివిజన్‌లో విజయవంతం కావడం కోసం రాత్రి పూట గ్రామాలను తిరిగి నిరక్షరాస్యులైన మహిళలకు చదువు చెప్పించారు. అలాగే యువజన, సేవా, వైద్య బిరాలకు విస్త్రతంగా హాజరయ్యేవారు. మొత్తంగా సుమారు 10 నెలల కాలంలో శాంతికుమారి సబ్ కలెక్టర్‌గా అందించిన సేవలు భువనగిరిలో ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. సేవలు అందించిన అధికారి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ సీఎస్‌గా నియమితులు కావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.