Nagarkurnool: బస్సు నడుస్తున్న సమయంలోనే ఊడిపోయిన చక్రాలు

కల్వకుర్తి రూరల్: ఆర్టీసీ బస్సు నడుస్తున్న సమయంలోనే వెనుక చక్రాలు అకస్మాత్తుగా ఊడిపోయాయి. ఈ ఘటన ఆదివారం మార్చాలలో చోటు చేసుకుంది. నాగర్‌కర్నూల్ జిల్లా తోటపల్లి నుంచి 20 మంది ప్రయాణికులతో ఓ ఆర్టీసీ బస్సు కల్వకుర్తికి బయలుదేరింది. అయితే మార్గమధ్యంలో సాంకేతిక సమస్యలతో నిలిచిపోయింది.
దానిని వెనక్కి తీసుకురావడానికి కల్వకుర్తి డిపో నుంచి మరో బస్సు (ఏపీ 28జెడ్ 2271)ను అధికారులు పంపించారు. అయితే ఆ బస్సు మార్చాల సమీపంలోని కాటన్‌మిల్ వద్దకు చేరుకోగానే అకస్మాతుగా వెనుక ఉన్న రెండు చక్రాలు ఊడిపోయాయి. అప్రమత్తమైన డ్రైవర్ రోడ్డు పక్కకు నిలిపివేయడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన జరిగినప్పుడు అందులో ప్రయాణికులెవరూ లేరు.