బడ్జెట్‌ బాబు.. ఖాళీ జేబు | Rising Prices of Gas, Petrol, Diesel erode purchasing power of Middle Class Families | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌ బాబు.. ఖాళీ జేబు

May 21 2026 1:01 AM | Updated on May 21 2026 1:02 AM

Rising Prices of Gas, Petrol, Diesel erode purchasing power of Middle Class Families

గ్యాస్, పెట్రోల్, డీజిల్‌ ధరల పెంపుతో ఫ్యామిలీ బడ్జెట్‌ తలకిందులు

వారం రోజుల్లోనే పెట్రోలు లీటర్‌కు రూ.4 వరకు పెరుగుదల

నిత్యావసరాల రేట్లు పెరుగుతుండటంతో బెంబేలు

సగటు జీవి నెలవారీ బడ్జెట్‌ లెక్క తప్పుతున్న వైనం

కూరగాయలు, పాలు, కిరాణా రేట్లు పైపైకి.. ఇతర వస్తువులపైనా క్రూడాయిల్‌ రేటు పెంపు ఎఫెక్ట్‌

హైదరాబాద్‌లోని రామాంతాపూర్‌లో అద్దె ఇంట్లో నివసించే మన ‘బడ్జెట్‌ పద్మనాభం’ నవీన్‌కుమార్‌ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. ఆయన భార్య గృహిణి కాగా, ఇద్దరు పిల్లలు సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. ఆయన నెలవారీ జీతం సుమారు రూ.50 వేలు. ఇంటి అద్దె, ఈఎంఐలు, టూవీలర్‌కు పెట్రోల్, ఇతర నెలవారీ ఖర్చులు పోగా రూ.3 వేలు చిట్టీ (పొదుపు) కడుతున్నాడు. అయితే అటు గ్యాస్‌ ఇటు పెట్రో ధరల పెంపుతో ఆయన నెలవారీ బడ్జెట్‌ ఛిన్నాభిన్నం అయ్యింది. పాలు, పెరుగు, కిరాణా, కూరగాయలు తదితర నిత్యావసరాల ధరలన్నీ పెరుగుతుండటంతో నవీన్‌కుమార్‌ లబోదిబోమంటున్నాడు.

సాక్షి, హైదరాబాద్‌: పెరుగుతున్న చమురు ధరలు, తదనుగుణంగా పెరుగుతున్న నిత్యావసరాల ధరలు సామాన్య ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇంటి ఖర్చులు ఎలా నెట్టుకు రావాలో తెలియక సతమతమవుతున్నారు. చాలీచాలని జీతం, అంతకంతకూ పెరుగుతున్న ఖర్చులతో సగటు జీవి అతలాకుతలం అవుతు న్నాడు. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధర పెంపు ప్రభావం క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటిపైనా పడుతోంది. క్రూడాయిల్‌ ధర పెంపుతో దేశంలో డీజిల్, పెట్రోల్‌ ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. కాగా క్రూడాయిల్‌ ఆధారంగా తయారయ్యే ప్లాస్టిక్, ఇతర పారిశ్రామిక సామగ్రి ధరలు పెరిగాయి. ఇదే సమయంలో డీజిల్‌ ధర పెంపు కూరగాయలు, కిరాణా, పాలు, పెరుగు తదితర నిత్యావసరాల ధరలపై ప్రభావం చూపించింది. ఆయా వస్తువుల ధరలన్నీ పెరిగిపోవడంతో సామాన్యుడి ఇంటి బడ్జెట్‌ లెక్క తప్పుతోంది. కూలీ నుంచి కార్మికుడి వరకు, ఆటో డ్రైవర్‌ ఉంచి సాధారణ వేతన జీవి వరకు.. పెరిగిన ముడి చమురు ధరల చట్రంలో చిక్కుకుని విలవిల్లాడే పరిస్థితి ఉంది. 

పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైన తరువాత అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధరలకు రెక్కలొచ్చాయి. పశ్చిమ బెంగాల్‌తో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంధన కంపెనీలు వారం వ్యవధిలో రెండుసార్లు లీటర్‌కు దాదాపు రూ.4 మేర పెట్రోల్, డీజిల్‌ ధరలు పెంచాయి. త్వరలో మరింత పెరుగుతాయనే అంచనాలూ ఉన్నాయి. ఇది వాహనదారులపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తుండగా.. పరోక్షంగా అన్ని వర్గాల ప్రజలపై పడింది. పాలిథిన్‌ కవర్‌ నుంచి ప్లాస్టిక్‌ కుర్చీల వరకు, ఎలక్ట్రికల్‌ వైర్లు నుంచి ఎరువుల తయారీ వరకు అనేక ఉత్పత్తుల తయారీలో క్రూడాయిల్‌ కీలక ముడి పదార్థంగా ఉండటంతో ధరల పెరుగుదల అన్ని వస్తువులపై ప్రభావం చూపుతోంది. ఇక రవాణా ఖర్చులు పెరిగిన నేపథ్యంలో కూరగాయలు, కిరాణా, పాలు లాంటి నిత్యావసరాలతో పాటు ప్యాకేజింగ్‌ వస్తువులు, నిర్మాణ సామగ్రి, డిటర్జెంట్లు, పెయింట్లు.. ఇలా ప్రతి రంగంలో వస్తువులు, సామాగ్రి ధరలు పెరుగుతున్నాయి.

ప్రతి వంటింటిపై భారం
ఇంధన ధరల పెంపు ప్రభావం సామాన్యుడి వంటింటి ఖర్చులపై స్పష్టంగా కనిపిస్తోంది. కూరగాయలు, పాలు, నూనెలు, కిరాణా సరుకుల ధరలు పెరుగుతుండటంతో  గృహిణులు తల పట్టుకుంటున్నారు. గత నెల వరకు రూ.500లో సరిపోయే వారాంతపు కూరగాయల కొనుగోలు ఇప్పుడు రూ.700–800 దాటుతోందని చెబుతున్నారు. తమ బడ్జెట్‌ పెంచమని భర్తల్ని అడుగుతున్నారు. ఆ అదనపు మొత్తం ఎలా సర్దుబాటు చేయాలో పాలుపోక ఇంటి యజమానులు బిక్కముఖం వేస్తున్నారు. ముఖ్యంగా వారం రోజుల్లోనే కూరగాయల ధరలు రూ.5–20 వరకు పెరిగాయి. బోయినపల్లి హోల్‌సేల్‌ మార్కెట్, మోండా మార్కెట్, గుడిమల్కాపూర్‌ మార్కెట్‌లలోనూ కూరగాయల ధరలు గణనీయంగా పెరిగాయి. డీజిల్‌ ఖర్చులు అధికమై రవాణా వ్యయం పెరగడం, జిల్లాల నుంచి సరుకు రాక తగ్గడంతో హోల్‌సేల్‌ వ్యాపారులు రేట్లు పెంచినట్లు చిల్లర వర్తకులు చెబుతున్నారు. ఈ ప్రభావం నేరుగా రిటైల్‌ మార్కెట్‌పై పడుతోందని అంటున్నారు. డీజిల్‌ ధర పెరిగిన నేపథ్యంలో స్కూల్‌ బస్సు, ఆటో చార్జీలు సైతం పెరగడం, ఎల్పీజీ గ్యాస్‌ ధర మరింత పెరిగే అవకాశం ఉందనే వార్తలతో సామాన్య కుటుంబాలు మరింత ఆందోళన చెందుతున్నాయి. చిన్న చిన్న ఖర్చులకు జేబులు తడుముకోవాల్సి వస్తోందని అంటున్నారు.


గ్రామీణ రైతు కుటుంబాలపై..
ఖరీఫ్‌ సీజన్‌కు ముందు డీజిల్‌ ధరల పెరుగుదల రైతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ట్రాక్టర్లు, నీటి మోటార్లు, వ్యవసాయ యంత్రాల వినియోగ వ్యయం పెరుగుతోంది. క్రూడాయిల్‌ ధరలు పెరగడంతో ఎరువులు, పురుగు మందులు కూడా ప్రియం కానున్నాయి. యాంత్రీకరణతో పంటలు సాగు చేసే రైతులు వినియోగించే వివిధ రకాల యంత్రాలకు డీజిల్‌ ఇంధనంగా ఉండడంతో గతంలో కన్నా అధికంగా వెచ్చించాల్సి వస్తోంది. పంటల రవాణా ఖర్చులు కూడా అధికమవుతుండటంతో సాగు వ్యయం మరింత పెరిగే ప్రమాదం ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. 

వీటి ధరలూ పెరిగే చాన్స్‌
క్రూడాయిల్‌ ఆధారంగా తయారయ్యే అనేక ఉత్పత్తుల ధరలు ఇప్పటికే పెరగగా, మరిన్ని వస్తువుల ధరలు పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. పాలిథిన్‌ కవర్లు, ప్లాస్టిక్‌ బకెట్లు, బాటిళ్లు, ప్లాస్టిక్‌ కుర్చీలు, గృహోపకరణాలు, డిటర్జెంట్లు, కాస్మెటిక్స్, పెయింట్లు, టైర్లు, లూబ్రికెంట్లు, ఎలక్ట్రికల్‌ వైర్లు, ఎరువులు, పురుగుమందులు, ప్యాకేజింగ్‌ మెటీరియల్‌ మొదలైన ఉత్పత్తులన్నీ క్రూడాయిల్‌తో ముడిపడి ఉన్నవే కావడంతో వాటి ధరలు పెరిగి, అంతిమంగా సామాన్యుడి బడ్జెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. మొత్తానికి ముడి చమురు ధరల మంటలు ఇప్పుడు పెట్రోల్‌ బంక్‌లను దాటి ప్రతి ఇంటి వంటగదిలోకి చేరాయి. 

Advertisement
 
Advertisement
Advertisement