పైసా పైసా చొప్పున పెరుగుతున్న ఇంధన ధరలు
నాలుగేళ్ల విరామం తర్వాత రోజువారీ వడ్డన
పది రోజుల్లోనే పెట్రోల్‌పై రూ. 5.35, డీజిల్‌పై రూ. 5.24 పెరిగిన వైనం
మరిన్ని విడతలుగా ధరలు పెరిగే అవకాశం
గుదిబండగా మారనున్న రవాణా భారం
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మార్కెట్ సెగతో చమురు సంస్థలు మళ్లీ రోజువారీ ధరల సవరణకు తెరలేపాయి. పైసా.. పైసా చొప్పున పెరుగుతున్న ఇంధన ధరలు.. సామాన్యుడికి గుదిబండగా మారనున్నాయి. కొన్నేళ్లుగా స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరల్లో కదలిక వచ్చింది. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత రోజువారీ ధరల సవరణ ప్రక్రియ మళ్లీ ఊపందుకుంది. చమురు సంస్థలు గత పది రోజుల వ్యవధిలోనే లీటర్ పెట్రోల్‌పై రూ.5.35, డీజిల్‌పై రూ. 5.24 చొప్పున పెంచాయి. అయితే, సవరణ ప్రక్రియ ప్రారంభమైన మొదటిసారి పెట్రోల్, డీజిల్‌పై ఏకంగా రూ. 3.39, రూ. 3.26 చొప్పున వడ్డించాయి.
ఆ తర్వాత నుంచి పైసా–పైసా రూపంలో రోజువారీగా ధరలను సవరిస్తుండటంతో నిరంతరాయంగా పెరుగుతున్నాయి. మధ్యలో రెండుసార్లు నాలుగు పైసల చొప్పున పెంచిన కంపెనీలు మరో రెండుసార్లు నాలుగు పైసల చొప్పున తగ్గించాయి. ధరల పెంపు కేవలం వాహనదారులకే పరిమితం కాకుండా నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభావం చూపనుంది. డీజిల్ ధర పెరగడం వల్ల లారీ రవాణా చార్జీలు భారమై కూరగాయలు, పాలు, ఇతర నిత్యావసరాల ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. చమురు సంస్థలు తమ నష్టాలను భర్తీ చేసుకునేందుకు మరిన్ని విడతలుగా ధరలను పెంచే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
రోజువారీ సవరణ బాధ్యత
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయించే బాధ్యతను 2017 జూన్ 16 నుంచి చమురు సంస్థలకే అప్పగిస్తూ ‘రోజువారీ ధరల సవరణ’ విధానాన్ని అమలులోకి తెచ్చింది. అంతకుముందు 2010లో పెట్రోల్, 2014లో డీజిల్ ధరలపై ప్రభుత్వ నియంత్రణను పూర్తిగా ఎత్తివేసిన తర్వాత ప్రతి 15 రోజులకు ఒకసారి అంతర్జాతీయ మార్కెట్ సగటు ఆధారంగా ధరలను సవరించేవారు. అయితే, 15 రోజులపాటు వేచి చూడటం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో వచ్చే ఆకస్మిక హెచ్చుతగ్గుల భారమంతా ఒకేసారి చమురు సంస్థలపై పడటం, లేదా అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పుడు ఆ తక్షణ ప్రయోజనం వినియోగదారులకు అందకపోవడం జరిగేది.
ఈ లోపాన్ని నివారించి, అంతర్జాతీయ మార్కెట్ బ్యారెల్ ధరలో డాలర్‌తో రూపాయి మారకం విలువలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు పారదర్శకంగా ప్రతిబింబించేందుకు ఈ రోజువారీ సవరణ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. అయితే, ఈ విధానానికి 2022లో బ్రేక్ పడింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు మండిపోయినప్పటికీ, దేశీయంగా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి, ఆ తర్వాత వచ్చిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోనూ చమురు సంస్థలు రోజువారీ సవరణలను తాత్కాలికంగా నిలిపివేశాయి. ఫలితంగా కొన్నేళ్లుగా ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతూ వచ్చాయి.
నష్టాల నుంచి గట్టెక్కేందుకు ..
కొన్నేళ్లుగా ఇంధన ధరల రోజువారీ సవరణను నిలిపివేసి, వినియోగదారులపై భారం పడకుండా చమురు సంస్థలే నష్టాలను భరిస్తూ వచ్చాయి. అయితే, ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 120 డాలర్ల మార్కును తాకడంతో నష్టాల భారం తమవల్ల కాదంటూ చమురు సంస్థలు చేతులెత్తేశాయి. నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఈ నెల 15 నుంచి మళ్లీ రోజువారీ ధరల సవరణ ప్రక్రియను ప్రారంభించి, వినియోగదారులకు విడతల వారీగా షాక్ ఇస్తున్నాయి. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వాలు విధించే స్థానిక పన్నులు (వ్యాట్), రవాణా చార్జీల వ్యత్యాసాలు తోడవడంతో సామాన్యుడికి చమురు వాత గట్టిగానే తగులుతోంది.


