కేటీఆర్‌.. మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది!: రేవంత్‌ రెడ్డి

Revanth Reddy Satires KTR Over Farmers Issue - Sakshi

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కు రైతుల సంక్షేమం పట్ల కాంగ్రెస్‌కి ఉన్న నిబద్ధత మీకు తెలియకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో  మీ నాయన(కేసీఆర్‌ను ఉద్దేశించి) అడగడం మంచిదంటూనే.. రైతు సమస్యల పరిష్కారానికి బదులు రాజకీయాలు చేయడంలో కేసీఆర్ బిజీగా ఉండొచ్చంటూ సెటైర్‌ సంధించారు. 

ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు రైతుల శ్రమను దోచుకుంటున్నాయని ఆరోపించిన రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ చేయలేని పనిని.. తాము చేసి చూపిస్తున్నామని కేటీఆర్ నిన్న ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై తాజాగా రేవంత్ ఫైర్ అయ్యారు. 

‘‘కేటీఆర్.. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తోంది. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ఎంతగా పాటుపడిందో పాపం మీకు తెలియదేమో. కాంగ్రెస్ చేసిందేంటో మీ నాయన కేసీఆర్ ను అడగండి చెబుతారు. అయినా, రైతుల సమస్యలను పరిష్కరించకుండా రాజకీయం చేయడంలో ఆయన బిజీగా ఉండి ఉంటారు’’ అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. 

4 కోట్ల మంది తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ‘స్వరాష్ట్ర’ కలను సాకారం చేసింది కాంగ్రెస్సేనని, తమ ప్రభుత్వంలోనే రైతులకు ఎంతో మేలు జరిగిందని గుర్తు చేసుకున్నారు. ఉచిత కరెంట్ ఇచ్చామని, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను తెచ్చామని చెప్పుకొచ్చారు రేవంత్‌. 

కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం 7 వేల మంది రైతులను పొట్టనబెట్టుకుందని మండిపడ్డారు. బీజేపీతో కుమ్మక్కయి రాజకీయ క్రీడలో రైతులను పావులుగా చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో కనీసం ఐకేపీ సెంటర్లు పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం మొండికేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో రైతుల ఎదుగుదల కోసం విప్లవాత్మక సంస్కరణలను తీసుకొచ్చామన్నారు. హరిత విప్లవం, వ్యవసాయ భూ పరిమితి చట్టం, భూమి లేని పేదలకు భూమి (అసైన్డ్ ల్యాండ్స్) ఇవ్వడం, కనీస మద్దతు ధర వంటి వాటిని అమలు చేశామని రేవంత్ పేర్కొన్నారు. 

నిత్యావసర సరుకుల చట్టం, రేషన్ పంపిణీ వ్యవస్థ, రూ.70 వేల కోట్ల మేర రైతులకు రుణ మాఫీ, ఉపాధి హామీ పథకం, సమగ్ర పంట బీమా, ఆహార భద్రత వంటి పథకాలు కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయన్నారు. ‘‘అంతేకాదు.. మీరేం బాధపడకండి కేటీఆర్. అన్ని విషయాల్లోనూ మీ లాంటి ప్రభుత్వాలను జవాబుదారీగా నిలబెట్టేందుకు ఆర్టీఈ, ఆర్టీఐ వంటి వాటినీ కాంగ్రెస్ పార్టీనే తీసుకొచ్చింది’’ అంటూ రేవంత్ సెటైర్లు వేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top