
నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలో నీరు లేక వెలవెలబోతున్న ఎల్గలగూడెం చెరువు
భారీ వర్షాలతో జలాశయాల్లో 75 శాతానికి చేరిన నిల్వలు
చెరువుల్లో మాత్రం నిల్వలు అంతంతే
34,701 చెరువుల్లో అలుగుపోసింది 12,701 చెరువులే
10,240 చెరువుల్లో 75–100%నిల్వలు
నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో ఇంకా కరువు ఛాయలే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జలాశయాలు జలకళ సంతరించుకోగా, చెరువులు మాత్రం వెలవెలబోతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 34,701 చెరువులుండగా, 12,701 చెరువులు మాత్రమే పూర్తి స్థాయి లో నిండి అలుగుపోస్తున్నాయి. మరో 10,240 చెరువులు 75–100% వరకు నిండి జలకళను సంతరించుకున్నాయి. మిగిలిన చెరువుల్లో 5,682 చెరువులు 50–75%, 3,302 చెరువులు 25–50% నిండగా, 2,816 చెరువులు 0–25 శాతమే నిండాయి. చెరువుల్లో నిల్వలపై నీటిపారుదల శాఖ తాజాగా రూపొందించిన ఓ నివేదికలో ఈమేరకు వెల్లడించింది.
జలవనరుల సమర్థ నిర్వహణ, పర్యవేక్షణ కోసం నీటిపారుదల శాఖ నిర్వహిస్తున్న ఇరిగేషన్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ (ఐడీఎస్‌సీ) డ్యాష్ బోర్డుకి ఇప్పటివరకు రాష్ట్రంలోని 21,500 చెరువులను మ్యాపింగ్ చేశారు. వాటి మొత్తం నిల్వ సామర్థ్యం 253.8 టీఎంసీలు కాగా, 119.23 టీఎంసీల నిల్వలు (47శాతం) కలిగి ఉన్నాయి. ఈ చెరువులు మొత్తం 3098.85 చదరపు కి.మీ. ప్రాంతంలో విస్తరించి ఉండగా, 1321.44 చ.కి.మీ. ప్రాంతాని(42.6శాతం)కే నీటి నిల్వలు పరిమితమయ్యాయి.
నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో కరువే..
గత ప్రభుత్వం నీటిపారుదల శాఖను 19 ప్రాదేశిక ఈఎన్సీలు/చీఫ్ ఇంజనీర్లుగా విభజించింది. శాఖ నివేదిక ప్రకారం రాష్ట్రంలో గజ్వేల్ ఈఎన్సీ పరిధిలో అత్యధిక చెరువులు పూర్తిగా నిండి మత్తడి దూకుతున్నాయి. గజ్వేల్, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో వానాకాలం ముగిసేలోగా కురవనున్న వర్షాలతో చెరువులు పూర్తిగా నిండే అవకాశం ఉంది.
అయితే, చెరువుల్లో నీటి నిల్వలపరంగా అత్యంత కరువు పరిస్థితులు నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో ఉన్నాయి. నల్లగొండ సీఈ పరిధిలో 1628 చెరువులుండగా, కేవలం 183 చెరువులే పూర్తిగా నిండాయి. పొరుగునే ఉన్న సూర్యాపేట, కొత్తగూడెం జిల్లాల్లో పరిస్థితి మెరుగ్గానే ఉంది. నిజామాబాద్ సీఈ పరిధిలో 997 చెరువులుండగా, 55 చెరువులే పూర్తిగా నిండాయి.
జలాశయాల్లో 75% నిల్వలు
రాష్ట్రంలో కృష్ణా, గోదావరి పరీవాహకంలో మొత్తం 1069.34 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 87 జలాశయాలుండగా, సోమవారం నాటికి 802.92 టీఎంసీల (75శాతం) నిల్వలున్నాయి. ఎగువ నుంచి రెండు నదులకూ వరదలు కొనసాగుతుండటంతోపాటు ప్రస్తుత వానాకాలం ముగిసేలోగా మరికొన్ని దఫాలు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో జలాశయాలు 100శాతం నిండే అవకాశం ఉంది.
పరీవాహక ప్రాంతాల వారీగా చూస్తే గోదావరి పరిధిలో 419.81 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 57 జలాశయాలుండగా, ప్రస్తుతం 223.67 టీఎంసీలకు నిల్వలు చేరాయి. కృష్ణా పరిధిలో 649.53 టీఎంసీల సామర్థ్యంతో 30 జలాశయాలుండగా, నిల్వలు 579.25 టీఎంసీలకు చేరాయి. జలాశయాలు, చెరువులు కలిపి మొత్తం 1323.14 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉండగా, ప్రస్తుతం 922.15 టీఎంసీలకు నిల్వలు చేరాయి.