ప్లాన్‌ ప్రకారమే ప్రాణం తీశారు.. ఆనంద్‌ భార్య లీల ఎక్కడ?

Relatives of Young Woman Killed Youth For Love Affair At Medak - Sakshi

కూతురిని ప్రేమిస్తున్నాడని యువకుడి హత్య 

అమీర్‌పేట్‌కు రమ్మని యువతితో ఫోన్‌   

బలవంతంగా ఆటోలో ఎక్కించుకొని తీసుకెళ్లిన వైనం 

గొంతు నులిమి చంపి, హుస్సేన్‌ సాగర్‌ కాలువలో పారవేత 

తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్‌   

నలుగురిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు 

వివరాలు వెల్లడించిన డీఎస్పీ భీంరెడ్డి 

మృతదేహాం కోసం గాలిస్తున్న బృందాలు  

పటాన్‌చెరు టౌన్‌: కూతురిని ప్రేమిస్తున్న యువకుడిని యువతి కుటుంబ సభ్యులు పథకం ప్రకారం హత్య చేశారు. శుక్రవారం పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ భీంరెడ్డి ఆ వివరాలు వెల్లడించారు.

నాగర్‌ కర్నూలు జిల్లా కోడేరు గ్రామానికి చెందిన శివకుమార్‌ అదే గ్రామానికి చెందిన భారతి ప్రేమించుకుంటున్నారు. భారతి వాట్సాప్‌లో శివకుమార్‌తో చాటింగ్‌ చేసింది. చాట్‌ విషయం చిన్నాన్న ఆనంద్‌కు తెలిసింది. భారతిని తండ్రి బాలపీరు ఎదుటే మందలించాడు. అయినా పరిస్థితి మార్పు రాలేదు. దీంతో  తండ్రి బాలపీరు, బాబాయి ఆనంద్‌ కలసి పథకం వేశారు. ప్రణాళికలో భాగంగా కూతురు భారతితో ఈనెల 7వ తేదీ రాత్రి ఫోన్‌ చేయించారు. అమీర్‌పేట్‌కు రమ్మని చెప్పించారు. డబ్బులు లేవని శివకుమార్‌ చెప్పడంతో యువతికి వరుసకు బావ అయిన బాలకృష్ణతో రూ.200 ఆన్‌లైన్‌లో వేయించారు.

శివకుమార్‌ అమీర్‌పేట్‌కు వచ్చాక అతడిని బలవంతంగా ఆటోలో ఎక్కించుకున్నారు. హుస్సేన్‌సాగర్‌ దిగువనున్న గోశాల దగ్గరలో గల శ్మశాన వాటికకు తీసుకెళ్లి గొంతు నులిమి చంపారు. మృతదేహాన్ని పక్కనే ఉన్న హుస్సేన్‌సాగర్‌ నుంచి మూసీ నదికి వెళ్లే కాలువలో పడివేశారు. కాలువలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మృతదేహం కొట్టుకుపోయింది. పోలీసులు సీసీ కెమెరాలు, ఫోన్‌ డేటా ఆధారంగా ముషీరాబాద్‌ బొలక్‌పూర్‌కు చెందిన భారతి బాబాయి ఆనంద్, తండ్రి బాలపీరు, తల్లి బాలకిష్టమ్మ, బావ బాలకృష్ణను గురువారం అదుపులోకి తీసుకొని విచారించారు.

యువకుడిని హత్య చేసి కాలువతో పడేసినట్టు ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు.   పరారీలో ఉన్న ఆనంద్‌ భార్య లీలను త్వరలో పట్టుకుంటామన్నారు. కాగా శివకుమార్‌ మృతదేహం కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్, జీహెచ్‌ఎంసీ బృందాలతో గాలింపు  చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు కీలక పాత్ర పోషించిన పటాన్‌చెరు సీఐ వేణుగోపాల్‌రెడ్డి, క్రైం సీఐ బీసన్న, ఎస్‌ఐలు రామానాయుడు, ప్రసాద్‌ను ఎస్పీ రమణకుమార్‌ అభినందించినట్టు డీఎస్పీ తెలిపారు.  

ఇది కూడా చదవండి: షాకింగ్‌ ఘటన.. కాలేజీ విద్యార్థిని ఈడ్చుకెళ్లిన ఆటో డ్రైవర్‌, వీడియో వైరల్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top