రిజిస్ట్రేషన్లకు.. రెడీ!

Registration Work Started In Telangana - Sakshi

తుది దశకు ‘ధరణి’లో భూముల విలువల నమోదు కార్యక్రమం

13వ తేదీకల్లా ప్రక్రియ పూర్తి కావొచ్చని అధికారుల అంచనా

దసరాకల్లా సాగు భూముల రిజిస్ట్రేషన్లకు లైన్‌ క్లియర్‌

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు మరికొన్నాళ్లు వాయిదా?

ఆ ఆస్తుల నమోదులో జాప్యం జరుగుతుండటం వల్లే.. 

సాక్షి, హైదరాబాద్‌: దసరా నాటికి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలు పునఃప్రారంభించాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ప్రస్తుతం కార్డ్‌ విధానంలో అమలవుతున్న రిజిస్ట్రేషన్ల విధానాన్ని ధరణి పోర్టల్‌లోకి మార్చే ప్రక్రియలో సబ్‌ రిజిస్ట్రార్లు బిజీగా ఉన్నారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల మార్కెట్‌ విలువలను ధరణి పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. సర్వే నంబర్, ఇంటి నంబర్లవారీగా భూములు, ఆస్తుల విలువలను వాటి ఎదుటి కాలమ్‌లో నమోదు చేస్తున్నారు. రెండు వారాల క్రితం ప్రారంభమైన ఈ ప్రక్రియ మంగళవారం నాటికి పూర్తి కానుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరోవైపు స్థానిక సంస్థలు కూడా అన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తుల నమోదు ప్రక్రియను ‘ధరణి’లోకి అప్‌లోడ్‌ చేసే ప్రక్రియను సమాంతరంగా చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ చెప్పిన విధంగా విజయదశమి నాటికి అందుబాటులోకి వచ్చే ధరణి పోర్టల్‌ ఆధారంగా రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మళ్లీ ప్రారంభం కానుంది. సాగు భూముల రిజిస్ట్రేషన్లు ఈ నెల 25 నుంచి ప్రారంభం కావడానికి బాలారిష్టాలు అధిగమించినా... వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు మాత్రం మరికొన్నాళ్లు వాయిదా పడే చాన్స్‌ ఉంది. ఈ ఆస్తుల నమోదులో కొంత జాప్యం జరుగుతున్నందున కొన్ని రోజులు ఆలస్యమయ్యే అవకాశం లేకపోలేదని అధికార వర్గాలంటున్నాయి. 

నమోదు తర్వాత 2 నోటిఫికేషన్లు 
భూముల విలువల నమోదు ప్రక్రియ పూర్తయ్యాక ప్రభుత్వం రెండు నోటిఫికేషన్లు విడుదల చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ల చట్టం ప్రకారం తహసీల్దార్లకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల బాధ్యతలు అప్పగించేందుకు ఒక నోటిఫికేషన్‌... సబ్‌ రిజిస్ట్రార్ల నుంచి వ్యవసాయ భూ ముల రిజిస్ట్రేషన్ల బాధ్యతలను తప్పించేందుకు మరో నోటిఫికేషన్‌ జారీ చేయాల్సి ఉం టుందని అంటున్నారు. ఈ నోటిఫికేషన్ల తో భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రభుత్వం ఆలోచిస్తున్న విధానంలో ముందు కు తీసుకెళ్లడానికి వీలవుతుందని చెబుతున్నారు. 

ఆ రెండు ప్రక్రియలు రద్దు? 
రిజిస్ట్రేషన్ల శాఖ పరిధిలో మరో కీలక నిర్ణయం తీసుకొనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ (జీపీఏ), స్పెషల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ (ఎస్‌పీఏ) విధానాలను రద్దు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అక్రమాలకు, దౌర్జన్యాలకు, సెటిల్‌మెంట్లకు ఊతమిచ్చినట్లు అవుతోందనే ఆలోచనతో ఈ విధానాన్ని సర్దుబాటు చేయాలని... ఇకపై భూములు లేదా ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు యజమాని హాజరును తప్పనిసరి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే రెవెన్యూ చట్టంలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను సేల్‌డీడ్‌ ద్వారా చేస్తామని పేర్కొన్నారు కానీ, ఏజీపీఏ (అగ్రిమెంట్‌ ఫర్‌ జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ) ద్వారా చేస్తామని పేర్కొనలేదని రిజిస్ట్రేషన్ల అధికారులు చెబుతున్నారు.

అయితే రిజిస్ట్రేషన్ల చట్టం ప్రకారం జీపీఏ, ఎస్‌పీఏల రద్దు సాధ్యమవుతుందా లేదా అన్నదానిపై కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రభుత్వం తీసుకొస్తున్న మెరూన్‌ పాస్‌పుస్తకాలను కూడా రిజిస్ట్రేషన్ల శాఖే ఇవ్వనుంది. భూమి లేదా ఆస్తిని క్రయ, విక్రయ రిజిస్ట్రేషన్‌ చేయడం, ఆన్‌లైన్‌లోనే ‘ధరణి’ద్వారా మ్యుటేషన్‌ చేయడం, తద్వారా వెంటనే సేల్‌డీడ్‌తోపాటు మెరూన్‌ పాస్‌పుస్తకం ఇవ్వడం ఒక్క రోజులోనే జరుగుతుందంటున్నారు. 

వెయ్యి కోట్ల ఆదాయానికి గండి... 
కరోనా లాక్‌డౌన్‌ తర్వాత క్రమంగా రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలు కోలుకుంటున్న దశలో ప్రభుత్వం రిజిస్ట్రేషన్లను అనూహ్యంగా నిలిపేయడంతో గత నెల రోజులుగా రూ. 1,000 కోట్ల వరకు ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. అంటే ఈ నెల రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా రూ. 17 వేల కోట్లకుపైగా భూములు, ఆస్తుల క్రయవిక్రయ లావాదేవీలు నిలిచిపోయినట్లేనని రిజిస్ట్రేషన్ల అధికారులు చెబుతున్నారు. 

త్వరలో తహసీల్దార్లకు శిక్షణ
వ్యవసాయేతర ఆస్తులకు మెరూన్‌ రంగు పాస్‌పుస్తకాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు ప్రింటర్లు చేరుకున్నాయి. మరోవైపు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లపై తహసీల్దార్లకు ఈ నెల మూడో వారం నుంచి శిక్షణ కూడా ప్రారంభించనుంది. ఈ ప్రక్రియ కూడా పూర్తయితే రాష్ట్రంలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ దసరా తర్వాత ఓ కొలిక్కి వచ్చినట్టే. ఇక, భూముల మార్కెట్‌ విలువల సవరణలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే మూడు కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు రాష్ట్ర, జిల్లా, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల స్థాయిలో మార్కెట్‌ సవరణ విలువలను ప్రతిపాదించనున్నాయి. ప్రస్తుతమున్న మార్కెట్‌ విలువలనే ధరణి పోర్టల్‌లో నమోదు చేస్తున్న నేపథ్యంలో దసరా నాటికే మార్కెట్‌ విలువల సవరణ జరుగుతుందా? దసరా నుంచి కొత్త మార్కెట్‌ విలువల ద్వారా రిజిస్ట్రేషన్లు జరుగుతాయా? లేదా ముందుగా రిజిస్ట్రేషన్లను ప్రారంభించి ఆ తర్వాత ధరలు సవరిస్తారా అన్నది ఇంకా తెలియరాలేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top